Telangana Speaker : తెలంగాణ శాసన సభాధిపతి పీఠంపై తొలి దళితుడు కొలువుదీరబోతున్నాడు. అసెంబ్లీ శాసనసభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, దాని మిత్ర పక్షం మజ్లిస్ సైతం స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని ప్రకటించింది. గడువు ముగియడంతో ఒక్కరే నామినేషన్ వేయడంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఖాయమైంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ గురువారం (డిసెంబర్ 14)న శాసన సభలో స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఒకే ఒక్క నామినేషన్…
తెలంగాణ మూడో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు డిసెంబర్ 4న సెక్రటేరియేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన గడ్డ ప్రసాద్‌కుమార్ డిసెంబర్ 13న మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారకరామారావు, సీపీఐ నేత కూనంనేని సాంబశిరావు, ఎంఐఎం ఎమ్మెల్యేల సమక్షంలో ప్రసాద్ నామినేషన్ వేశారు. గడువు ముగిసే సమయానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. ఇక ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్‌గా ప్రకటించడమే తరువాయి.
విపక్షాలతో మాట్లాడిన శ్రీధర్‌బాబు..
ఇదిలా ఉండగా, అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సహకరించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను, ఇతర ప్రతిపక్షాలను ఒప్పించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ శాసన సభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబుకు అప్పగించింది. ఆయన మరో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి చకచకా విపక్షాల నేతలతో మాట్లాడారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కోరారు. అందరూ అంగీకరించడంతో ప్రసాద్ ఎన్నిక లాంఛనమే అయింది. ప్రకటనే మిగిలింది.
న్యాయవాది.. మంత్రిగా అనుభవం..
గడ్డం ప్రసాద్ న్యాయవాది. మంత్రిగా పనిచేసి అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ రెండుసార్లు వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తొలిసారి ఆయన నెగ్గింది 2008 ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడారు. ఆపై కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు.
స్వగ్రామం బెల్కటూరు..
ఇక గడ్డం ప్రసాద్ కుమార్ స్వస్థలం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య. తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2008లో అసెంబ్లీ ఎప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ నుంచి విజయం సాధించారు. రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో టెక్స్‌టైల్ మినిస్టర్‌గా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో గెలిచి తొలి దళిత స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్ ఎన్నిక కానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళిత మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతి వ్యవహరించారు. ఆ తర్వాత అసెంబ్లీకి దళితుడు స్పీకర్ కావడం ఇదే.