
Lithium Reserves India : అరబ్ కంట్రీస్ లో చమురు ఎక్కువగా దొరుకుతుంది.. కాబట్టి ప్రపంచంపై వాటి ముద్ర ఎక్కువ.. వాటిని దక్కించుకునేందుకు అమెరికా ఎన్నో యుద్ధాలు చేసింది.. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది అయినా ఫాయిదా దక్కలేదు. ఇక ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా…ఇప్పటికీ యూరప్ దేశాలకు తలవంచడం లేదు. పైగా రోజురోజుకూ ఎగరేస్తోంది.. ఇందుకు కారణం ఆ దేశం వద్ద అపారమైన చమురు నిలువలు ఉండటమే… ఖనిజం లేదా చమురు ఇవే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.. లేకుంటే ఎడారిలో ఉన్న అరబ్ దేశాలను ఎవడు పట్టించుకుంటాడు? సగం యూరప్ లో, సగం ఆసియాలో ఉండే రష్యాను ఎవడు దేకుతాడు? మన దేశానికి వస్తే ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్నది కాబట్టి చమురు అవసరాలు ఎక్కువ. ఖనిజ అవసరాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.. నీకోసం మన విదేశీ మాదకద్రవ్యాన్ని ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తోంది.. ఒకవేళ అనుచిత పరిస్థితులు ఏర్పడితే ఆ భారం ప్రజలపై పడుతుంది.. ధరలు పెరగడంతో ప్రభుత్వం పై ఒత్తిడి అధికమవుతుంది.. ఇలాంటి నేపథ్యంలో భారతదేశానికి లిథియం రూపంలో అద్భుతమైన వరాన్ని కాశ్మీర్ లోయ అందించింది. ప్రపంచానికి సుల్తాన్ ను చేసే అవకాశాన్ని కల్పించనుంది.. ఇంతకీ ఏమిటి ఆ లిథియం? దానివల్ల ఏంటి ఉపయోగం?
జమ్ము కాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో ఉన్న సలాల్ హైమాన ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నాయని జి.ఎస్.ఐ అధికారులు వెల్లడించారు.. నిజానికి కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గతంలో 16 టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించారు. కానీ వాణిజ్యపరంగా లాభదాయకం కాదని వదిలేశారు.. లిథియం తవ్వకం చాలా ఖర్చుతో కూడుకున్న పని.. ఒక టన్ను ముడి లిథియం తవ్వకానికి 78,032 అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 64 లక్షల వరకు ఖర్చు అవుతుంది.. 2020లో ఇది 6, 000 అమెరికన్ డాలర్లు అంటే 49 లక్షలు గా ఉండేది. డిమాండ్ పెరగడంతో ధర కూడా పెరిగింది.. మొబైల్స్, లాప్టాప్స్ మాత్రమే కాదు ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను లిథియం ఆయాన్ బ్యాటరీలను వాడుతున్నారు. లిథియం ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆస్ట్రేలియా, చిలీ, చైనా దే అగ్రస్థానం. తొలి మూడు స్థానాల్లో ఇవే ఉన్నాయి. అందుకే ఈ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. తొలిసారిగా భారత్లో ఇప్పుడు నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో భారత్ కూడా ఈ రంగంలో తన ముద్ర వేసే అవకాశం దొరికింది. అంతేగాక లిథియం ఆయాన్ బ్యాటరీల తయారీ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు సువర్ణ అవకాశం కూడా దక్కింది.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రభుత్వాలు కూడా వాటికే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో లిథియం కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాల అవసరం ఉంది. 2025 నాటికి లిథియం కి కొరత ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో భారీ మొత్తంలో నిక్షేపాలు బయటపడటం ప్రపంచానికి భరోసా కల్పించింది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా లభ్యమైన నిత్యం నిక్షేపాల్లో అధిక భాగం నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనే దొరికాయి. పైగా లిథియం వెలికితీతకు పెద్ద మొత్తంలో నీటి నిల్వలు అవసరం. దీంతో నీటి నిల్వలు లేక ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో అటువంటి పరిస్థితి లేదు. దీంతో భవిష్యత్తు లిథియం అవసరాలకు భారత్ ప్రపంచానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
మొబైల్స్, లాప్ టాప్ లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే రీఛార్జబుల్ బ్యాటరీలు, పేస్ మేకర్ యంత్రాలు, బొమ్మలు, కడియారాలలో వాడే నాన్ రీఛార్జిబుల్ బ్యాటరీల తయారీకి లిథియం అవసరం. అయితే ప్రపంచమంతా ఈవీల వాడకండి ప్రోత్సహిస్తూ ఉండటంతో లిథియం బ్యాటరీల ధరలకు ఇటీవల రెక్కలు వచ్చాయి. ఈ బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియంతో పాటు నిఖిల్, కోబాల్ట్ వంటి వాటిని భారత్ ఇన్నాళ్లు దిగుమతి చేసుకుంటుంది. పైగా ఈ వీల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వాహన, బ్యాటరీ తయారీ సంస్థలకు అనేక రాయితీలు ఇస్తోంది. ఇప్పుడు దేశంలోనే లిథియం నిల్వలు ఉండడంతో దిగుమతుల భారం తగ్గనుంది. దీనివల్ల ఈ వీళ్ళతోపాటు దేశీయంగా తయారయ్యే సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు, డిజిటల్ కెమెరాలు, ఇతర ఉత్పత్తుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉండటం సానుకూల అంశం.
ఖనిజం ఏదైనా కావచ్చు.. జరిపే తవ్వకాలు పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో లిథియం కూడా అతీతమేమీ కాదు. నిత్యం తవ్వకాలు విపరీతమైన కాలుషానికి కారణమవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. లిథియం తవ్వకాలు చేపట్టిన చోట నీటి నిల్వలు హరించుకుపోతాయని, భూమి పొడిబారి కరువు నేలగా మారిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక ఒక టన్ను లిథియం కోసం కొండల్లో తవ్వకాలు జరిపినప్పుడు గాలిలోకి 15 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని తెలుస్తోంది. దీనినిబట్టి లిథియం తవ్వకాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఇక లిథియం, బంగారం సహా వేరు వేరు ఖనిజ నిల్వలు ఉన్న 51 బ్లాక్ లను గుర్తించామని, వాటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అప్పగించిందని జిఎస్ఐ అధికారులు చెబుతున్నారు. వీటిలో ఐదు బంగారం గనులు కాగా మిగిలిన వాటిలో పోటాష్, కాపర్, జింక్ పలు ఇతర లోహాల ఉన్నాయని చెబుతోంది. బ్లాకులు జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.. 2018 నుంచి 19 వరకు చేసిన విశ్లేషణలు పరిశోధనల ఆధారంగా ఈ బ్లాక్ లను గుర్తించినట్టు జిఎస్ఐ అధికారులు చెబుతున్నారు.
ముందుగానే చెప్పినట్టు చమరు లేదా ఖనిజం ఉన్న దేశాలే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఈరోజు చైనా గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోంది అంటే దానికి కారణం ఖనిజమే.. అంతేకాదు తన వద్ద ఉన్న అపారమైన విదేశీ మారకద్రవ్య నిల్వలు వల్ల ఇతర దేశాల నుంచి వివిధ రకాలైన ఖనిజాలు దిగుమతి చేసుకుంటున్నది. ఒకవేళ ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు తాను చెల్లించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తుంది. ఈ విధానం పాటిస్తోంది కాబట్టే చైనా తిరుగులేని శక్తిగా ఆవిభవిస్తున్నది.. ప్రస్తుతం లిథియం వంటి ఖనిజ నిక్షేపాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో భారత్ కూడా ప్రపంచం పై గుత్తాధిపత్యం సాధించే రోజులు ఎంతో దూరంలో లేవు.