Chhatrapati Shivaji Maharaj : ఈ మరాఠా యోధుడి గురించి తెలుసుకోవాల్సిన నిజాలివి

లక్ష సైన్యం, ఆయుధాలు, అశ్వాలు, నావికా దళాన్ని ఏర్పాటు చేసుకున్న శివాజీ 27 సంవత్సరాల పాటు తన సామ్రాజ్యాన్ని నిరాటంకంగా ఏలాడు. 1680 ఏప్రిల్ 3న రాయగడ కోటలో మూడు వారాలపాటు జ్వరంతో బాధపడి కన్నుమూశాడు.

Written By: NARESH, Updated On : February 19, 2024 2:23 pm
Follow us on

Chhatrapati Shivaji Maharaj : ఈ భూమి మీద ఎందరో పుట్టారు.. ఇంకా పుడుతూనే ఉన్నారు.. భవిష్యత్లోనూ పుడుతూనే ఉంటారు. పుట్టినవారు చనిపోయారు. ఇంకా చనిపోతూనే ఉంటారు. కానీ కొందరు మాత్రమే చనిపోయినా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటారు. అలాంటి మహనీయుల జాబితాలో ఛత్రపతి శివాజీ ఒకరు. మరాఠా యోధుడిగా పేరుపొందిన ఇతడి పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. నేడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా.. అతడి జీవితంలో అరుదైన విషయాలు మీ కోసం..

శివాజీ 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియా బాయి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచే శివాజీకి మాతృభూమిపై, ప్రజలపై ప్రేమ కలిగే విధంగా జిజియా బాయి విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాథలు నేర్పింది. వీరు భోస్లే కులానికి చెందినవారు. జిజియా బాయి దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశానికి చెందిన ఆడపడుచు.

శివాజీ తన తండ్రి వరుస పరాజయాలు పొందడం చూసి కలత చెందాడు. యుద్ధంలో తన తండ్రి ఎక్కడ తప్పులు చేస్తున్నాడో గమనించి అధ్యయనం చేసేవాడు. తక్కువ కాలంలోనే యుద్ధ విద్యల్లో నిష్ణాతుడయ్యాడు. 17 సంవత్సరాల వయసులో మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నాకోట ను స్వాధీనం చేసుకున్నాడు. 20 సంవత్సరాల వయసులో రాజ్ గడ్, కొండన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఫలితంగా పూణే ప్రాంతాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తండ్రి నుంచి వచ్చిన రెండువేల మంది సైనికులను పదివేల మందికి పెంచుకున్నాడు. యుద్ధంలో ఆధునిక తంత్రాలు ఉపయోగించాడు. గెరిల్లా తరహా యుద్ధాన్ని ప్రపంచానికి శివాజీనే తొలిసారి పరిచయం చేశాడు.

శివాజీ కోటలు సొంతం చేసుకోవడం చూసి ఆది ల్షా కుతంత్రాలు రచించాడు. శివాజీ తండ్రి షాహాజీ ని బంధీ చేశాడు. తర్వాత శివాజీని, బెంగళూరులో ఉన్న అతడి అన్న శంభూజీ ని పట్టుకొనేందుకు ఏకంగా రెండు సైన్యాలు పంపాడు. ఆ సైన్యాలను శివాజీ అతడి సోదరుడు ఓడించి తన తండ్రిని విడిపించుకున్నారు. ఆ యుద్ధంలో ఓడిపోయినందుకు కలతగా అది ల్షా అఫ్జల్ ఖాన్ ను శివాజీ పైకి పంపించాడు. ఈ పన్నాగం తెలిసిన శివాజీ బీజాపూర్ ప్రాంతానికి చెందిన తోరణ దుర్గాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. దీంతో పూనే ప్రాంతం మొత్తం అతని ఆధీనంలోకి వచ్చింది.

శివాజీ ఆడవాళ్ళ పట్ల అపారమైన గౌరవాన్ని కలిగి ఉండేవాడు. యుద్ధాలు చేస్తున్నప్పుడు మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగనిచ్చేవాడు కాదు. సైనికులకు వ్యక్తిగత ఆయుధాలు ఇచ్చేందుకు నిరాకరించేవాడు. వేరే రాజ్యాలను ఆక్రమించుకున్నప్పుడు స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు కచ్చితంగా లెక్క చెప్పాలనేవాడు. మత ప్రదేశాలపై, ఇళ్ళ పై దాడులకు అంగీకరించేవాడు కాదు. ముస్లింలకు సముచిత స్థానం ఇచ్చేవాడు. బీజా పూర్ సుల్తానులను ఓడించడానికి ఔరంగజేబుకు శివాజీ సహాయపడ్డాడు. అహమ్మద్ నగర్ ప్రాంతం ముట్టడికి సహకరించాడు. అనివార్య పరిస్థితిలో ఓటమి ఇక తప్పదు అనుకున్నప్పుడు యుద్ధం నుంచి తప్పుకోవాలి అని శివాజీ పదే పదే సైన్యానికి చెప్పేవాడు. అనుకూల సమయంలోనే శత్రువు పై దాడి చేసి గెలవాలని సూచించేవాడు. ఈ సూత్రాలే శివాజీ యుద్ధాలలో గెలిచేందుకు దోహదపడ్డాయి. విదేశీ దండయాత్రల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడ్డాయి..

శివాజీకి భవాని మాత ఆలయం అంటే చాలా ఇష్టం. యుద్ధంలో శివాజీని వడగొట్టేందుకు అఫ్జల్ ఖాన్ భవాని ఆలయాన్ని కూలగొట్టాడు. అయితే ఈ కుతంత్రం ముందే తెలిసిన శివాజీ అతడిని సమావేశానికి ఆహ్వానించాడు. ఆ సమయంలో ఉక్కు కవచం ధరించి, చేతికి పులి గోర్లు వేసుకొని శివాజీ వెళ్ళాడు. అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా.. అతడు తన పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ ను హతమార్చాడు. అప్పటినుంచి శివాజీ మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు తన మేనమామ పహిస్తా ఖాన్ ను శివాజీ పైకి పంపితే.. అతడు పరాజయంతో తిరిగి వచ్చాడు. 1666 లో ఔరంగాజేపీ కుట్ర చేసి శివాజీని ఆగ్రా జైల్లో బంధించాడు.. శివాజీ అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు. 1674 జూన్ 6న రాయగడ కోటలో వేద పండితుల మంత్రాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతి అని కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. లక్ష సైన్యం, ఆయుధాలు, అశ్వాలు, నావికా దళాన్ని ఏర్పాటు చేసుకున్న శివాజీ 27 సంవత్సరాల పాటు తన సామ్రాజ్యాన్ని నిరాటంకంగా ఏలాడు. 1680 ఏప్రిల్ 3న రాయగడ కోటలో మూడు వారాలపాటు జ్వరంతో బాధపడి కన్నుమూశాడు.