Etela Rajender- KCR: ఓటమి గెలుపునకు నాంది అని పెద్దలు అంటారు కానీ… అదే ఓటమిని రాజకీయ నాయకులు ఎప్పటికీ జీర్ణించుకోలేరు. ప్రజాస్వామ్యంలో ఓటమి అంటేనే ప్రజలు తిరస్కరించినట్టు లెక్క. దానిని ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాజ్యసభ సీట్లు భర్తీ చేయలేవు. ఇక అలాంటి తిరస్కారం ఎదురైన చోట తిరగాలంటే నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే నారాజ్. ఆ పరిస్థితి ఎప్పటికీ రాకూడదని ఎప్పటికప్పుడు తమ తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆరా తీస్తూ ఉంటారు. ఏమాత్రం తమకు తేడా అనిపిస్తున్నా వెంటనే నియోజకవర్గ మార్పునకు శ్రీకారం చుడతారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించుకుంటారు.

ఇందిర ఈజ్ ఇండియా.. ఇండియా ఈజ్ ఇందిర అనేలా పేరు గడించిన ఇందిరా గాంధీ 1980 లో మెదక్ లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి అయ్యారు. మంథనిలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీవీ నరసింహారావు 1984 లో హనుమకొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇలాంటి ఎంతోమంది లబ్ద ప్రతిష్టులైన రాజకీయ నాయకులు ఒకటే నియోజకవర్గం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లి కొందరు విజయం సాధించారు. ఇంకొందరు పరాజయం పాలయ్యారు. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం ఇస్తున్న గజ్వేల్ నుంచి తాను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఒకవేళ ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే సీఎం కేసీఆర్ ఆయనకు ప్రత్యర్థిగా ఉంటారా? లేక గత ఆనవాయితీ ప్రకారం నియోజకవర్గ మార్పు కోరుకుంటారా? ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీస్తోంది.
కేసీఆర్ చాలా నియోజకవర్గాలు మారారు
కేసీఆర్ రాజకీయాల్లో దిట్ట. తనకు ఏమాత్రం ప్రతికూలంగా అనిపిస్తున్నా వెంటనే మార్పులు, చేర్పులు చేపడతారు. తనకు లాభం జరుగుతుందనుకుంటే వంద మెట్లు దిగివచ్చయినా సరే ఎదుటి మనిషిని ఆలింగనం చేసుకుంటారు. సిద్దిపేటలో తన రాజకీయ ఓనమాలు ప్రారంభించిన కేసీఆర్.. మెదక్ ఎంపీగా పోటీ చేశారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు పోటీగా ఉన్న వంటేరు ప్రతాపరెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ కు చైర్మన్ గా చేశారు. భవిష్యత్తులో ఎటువంటి పోటీ లేకుండా చేసుకున్నారు. ఈమధ్య గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ మధ్య రేవంత్ రెడ్డి నిర్వహించిన నిరుద్యోగ సైరన్ సభకు భారీ ఎత్తున జనం హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో పీకే టీం తో సీఎం కేసీఆర్ మూడుమార్లు రహస్యంగా సర్వే నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాను గజ్వేల్ నుంచి వేరే స్థానానికి వెళ్లే యోచనలో ఉన్నారు. పనిలో పనిగా తన స్థానాన్ని ఒంటేరు ప్రతాప్ రెడ్డికి కట్టపెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు వినికిడి.
వాసాలమర్రి కి అందుకే వెళ్లారా
గజ్వేల్ నుంచి కాకుండా ఈసారి భువనగిరి నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ యాదాద్రి క్షేత్రానికి భారీగా నిధులు వెచ్చించారు. పైగా భువనగిరి నియోజకవర్గంలోని వాసాలమర్రి అనే గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి గ్రామస్తులకు భారీగా నిధులు ఇచ్చారు. అక్కడి కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి గ్రామస్తులతో భోజనం కూడా చేశారు. అదే సమయంలో వాసాలమర్రిని తాను దత్తత తీసుకుంటున్నట్టు చెప్పి, ఇది మరొక ములకనూరు లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజల్లో ప్రచారం కోసం వాసాలమర్రి సర్పంచ్ తో పలమార్లు సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. మరోవైపు భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతున్నారు. ఆమధ్య జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం కేసీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అదే సమయంలో భువనగిరి నుంచి తాను పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ వివరించారని ప్రచారం సాగుతోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మొదటి నుంచి కేసీఆర్ కు అంతరంగిక ఆప్తమిత్రుడుగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ హడావిడి చేస్తున్నా భువనగిరిలో ఆ పార్టీకి గట్టి నాయకుడు అంటూ లేరు. పైగా ఆ ప్రాంతంలో బీజేపీకి కేడర్ తక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనక సహకరిస్తే కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది.

అదే గనుక జరిగితే
ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే కేసీఆర్ భువనగిరి వైపునకు వస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఈటల రాజేందర్ కూడా ఆర్థికంగా పరిపుష్టి ఉన్న నాయకుడే కాబట్టి, పైగా కేసీఆర్ ఆలోచన తీరు ఎలా ఉంటుందో తెలిసిన నాయకుడు కాబట్టి.. గజ్వేల్ లో ఆయనపై పోటీ చేసేందుకు సై అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గజ్వేల్ లోని టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఈటెల రాజేందర్ హైదరాబాదులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్లో జరిగినట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ని ఓడించినట్టే కేసీఆర్ ను ఈటల రాజేందర్ ద్వారా ఓడించి టీఆర్ఎస్ నాయకుల్లో ఆత్మ స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీయాలని ఆమిత్ షా యోచిస్తున్నారు. పైగా ఇటీవల మాసాయి పేట భూములను రైతులకు పంచడంతో రగిలిపోతున్న ఈటల రాజేందర్ కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే అనువైన సమయమని అనుకుంటున్నారు. అందులో భాగంగానే గజ్వేల్ లోని అన్ని మండలాల్లో కీలకమైన నాయకుల పై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పదిమంది నాయకులు ఈటల రాజేందర్ లైన్ లోకి వచ్చారని సమాచారం. వారికి కావలసిన ఏర్పాట్లను బీజేపీ అధిష్టానం నేరుగా చూసుకుంటున్నది. ఒకవేళ కేసీఆర్ భువనగిరి నుంచి పోటీ చేసినా అందుకు తగ్గట్టుగానే ప్లాన్ బీ అమలు చేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం.
Also Read:Kodali Nani- Palanki Brothers: కొడాలి నానికి షాక్.. జనసేనలోకి ప్రధాన అనుచరులు..మరికొందరు పక్కచూపులు?