Homeజాతీయ వార్తలుEknath Shinde Bio-graphy :ఒకప్పుడు ఆటో డ్రైవర్.. నేడు మహారాష్ట్ర సీఎం.. ఎవరు ఈ ఏక్...

Eknath Shinde Bio-graphy :ఒకప్పుడు ఆటో డ్రైవర్.. నేడు మహారాష్ట్ర సీఎం.. ఎవరు ఈ ఏక్ నాథ్ షిండే?

Eknath Shinde Bio-graphy  : కొందరు రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా పైకి రారు.. ఇంకొందరు రెబల్ గా ముందుకెళుతారు. అదృష్టం తలుపుతట్టి అందలం ఎక్కుతారు. సొంత శివసేన పార్టీని కూల్చిన ఏక్ నాథ్ షిండే ఇప్పుడు మహారాష్ట్రకే బాస్ అయ్యారు. ఈ తిరుగుబాటు నేతకే అనూహ్యంగా సీఎం సీటును కట్టబెట్టి ఆ మలినాన్ని తమకు అంటకుండా బయట నుంచి మద్దతు ఇచ్చి బీజేపీ కడిగేసుకుంది. సీఎం అవుతాడనుకున్న బీజేపీ మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ కుర్చీ త్యాగం చేయగా.. డిప్యూటీ సీఎం అవుతాడనుకున్న ఏక్ నాథ్ షిండే అనూహ్యంగా మహారాష్ట్ర సీఎం అయ్యారు. ఒకప్పుడు ఆటోడ్రైవర్ గా మొదలైన ఏక్ నాథ్ షిండే ప్రయాణం ఇప్పుడు మహారాష్ట్ర సీఎం వరకూ సాగింది. అసలు ఎవరీ ఏక్ నాథ్ షిండే.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్న దానిపై స్పెషల్ స్టోరీ..

who-is-eknath-shinde

-ఏక్ నాథ్ షిండే ఎవరసలు?
శివసేన పార్టీలో సామాన్య కార్తకర్తగా చేరి మహారాష్ట్ర 20వ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న ఏక్ నాథ్ షిండే ఒక సామాన్య కుటుంబంలో పుట్టారు. 1964 ఫిబ్రవరి 9న మహారాష్ట్రలోని సతారా జిల్లా పుట్టారులో ఏక్ నాథ్ షిండే జన్మించారు. చిన్నతనంలోనే షిండే కుటుంబం థానేకు పని కోసం వలసవచ్చింది. అక్కడ ‘మంగళ’ హైస్కూల్ మరియు కాలేజీలో షిండే 11వ తరగతి వరకూ చదివాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ గా మారాడు.

ఏక్ నాథ్ షిండేకు ముగ్గురు సంతానం. 2000 సంవత్సరంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇద్దరు బిడ్డలను షిండే కోల్పోయారు. షిండే కొడుకు శ్రీకాంత్ షిండే ప్రస్తుతం కల్యాణ్ నియోజకవర్గ ఎంపీగా కొనసాగుతున్నారు.

-ఏక్ నాథ్ షిండే రాజకీయ ప్రస్థానం..
ఏక్ నాథ్ షిండేకు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. అందుకే తన 18వ ఏటనే శివసేనలో షిండే చేరారు. బాల్ ఠాక్రేపై పిచ్చి అభిమానంతో ఆ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. దాదాపు 15 ఏళ్ల పాటు శివసేనలో నిబద్ధతతో పనిచేశాడు. అనంతరం 1997లో ఏక్ నాథ్ కు థానే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ గా టికెట్ దక్కింది. ఇక వెనుదిరిగి చూడకుండా గెలుపు బాటపట్టాడు. థానేలో కౌన్సిలర్ గా గెలిచి అనంతరం కార్పొరేషన్ హౌస్ లీడర్ గా ఎదిగాడు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగాడు.

-2004లో శివసేన ఎమ్మెల్యేగా తొలి అడుగు
కౌన్సిలర్ గా గెలిచి లీడర్ ఆఫ్ ది హౌస్ గా కార్పొరేషన్ లో సత్తా చాటిన షిండేకు ప్రమోషన్ దక్కింది. 2004లో తొలిసారి థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా షిండే గెలిచాడు. ఆ తర్వాత శివసేన థానే జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో ‘కోప్రి పచ్చఖాడి’ నియోజకవర్గం నుంచి పోటీచేసి మరోసారి గెలిచారు. అనంతరం ఇక్కడి నుంచి ప్రతీసారి విజయం సాధించాడు. 2014-19 మధ్యలో మహారాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఏర్పడిన శివసేన ప్రభుత్వంలో ‘రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ’ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. థానే జిల్లా ఇన్ చార్జి మంత్రిగానే కొనసాగుతున్నారు

తాజాగా మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వ పాలనకు విసుగుచెంది.. ఉద్దవ్ పాలనకు వ్యతిరేకంగా.. ఆయన కుమారుడు ఆదిత్య ఆధిపత్యాన్ని నిరసిస్తూ.. హిందుత్వవాదం లేదని.. శివసేనలో విలువలు లేవంటూ ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. ఏకంగా 40 మంది వరకూ ఎమ్మెల్యేలను కూడగట్టి శివసేన ప్రభుత్వాన్ని గద్దెదించారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తీరుగా ఎదిగిన ఏక్ నాథ్ షిండే అనూహ్యంగా బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని అధిరోహించారు. తిరుగుబాటు చేసి మచ్చపడిన షిండేకు అదే వరంగా మారింది. బీజేపీ ఈ మరకలను తొలగించుకునేందుకే షిండేకే పగ్గాలు అప్పజెప్పి బయట నుంచి మద్దతు ప్రకటించింది. ఇలా అనూహ్యంగా షిండే ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కొట్టేశాడు. రాజకీయాల్లో కొత్త సంచలనానికి నాంది పలికాడు. ఒక సాధారణ ఆటోడ్రైవర్ నుంచి ఏకంగా సీఎం అయ్యే వరకూ ఎదిగిన షిండే వ్యక్తిగత జీవితం ఆసక్తి రేపుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular