
MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణంలో రెండో దఫాకు సంబంధించి కవిత వివారణ పూర్తయింది. రాత్రి 9:14 నిమిషాలకు బయటకువచ్చిన 9:25 నిమిషాలకు తుగ్లక్ రోడ్‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వ్యక్తమైన నేపథ్యంలో కవిత విచారణ ముగించుకుని బయటకు రావడం విశేషం. ఉదయం అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో కానఫ్రంటేషన్ విధానంలో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. సాయంత్రం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిసి ప్రశ్నించినట్టు తెలుస్తోంది, మొత్తం 20కి పైగా ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.అయితే ఈ ప్రశ్నలకు కవిత పెద్దగా రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది.
ఉదయం నుంచీ ఏం జరిగింది?
కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వెళ్లాల్సిన కవిత 10:30కే ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు సాయంత్రం 9 గంటల దాకా విచారణ సాగింది. మధ్యాహ్నం ఒక్కసారి మాత్రం కవిత బయటకు వచ్చారు. అక్కడి ఈడీ క్యాంటిన్‌లో ఆహారం తీసుకున్నారు. తర్వాత మళ్లీ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అరుణ్ రామచంద్ర్ పిళ్లైని కూడా ఈడీ అధికా రులు పిలిపించారు. ఇద్దరినీ కాన్‌ఫ్రంటేషన్ విధానంలో విచారించినట్టు సమాచారం. ‘రామచంద్రన్ పిళ్లై మీకు ఎలా పరిచయం? ఎవరి ద్వారా పరిచయం? సౌత్ గ్రూప్‌లో పెట్టుబడులు ఎలా పెట్టారు? అంత డబ్బు మీకు ఎక్కడిది? ఇలా పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు కవిత నుంచి ఎటుంటి సమాధానం రాలేదని సమాచారం.
కన్‌ఫ్రంటేషన్ విధానంలో ఈడీ అధికారలు
ఈడీ అధికారులు సోమవారం కవితను కన్‌ఫ్రంటేషన్ విధానంలో విచారించారు. నలుగురితో కూడిన అధికారుల బృందం కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకానొక దశలో అధికారుల దూకుడుకు కవిత అలా నిశ్చేష్టురాలైపోయింది. అరుణ్ రామచంద్రన్ పిళ్లైని తీసుకురావడంతో కవిత ఆశ్చర్యపోయింది. అతడి రాకతో ఆమె ముఖం మారిపోయింది. దీనిని ఈడీ అధికారులు ప్రముఖంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం పొద్దుపోయే దాకా సాగింది. సాయంత్రం ఏడు గంటలు దాటినా కవిత బయటకు రాకపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. మరో వైపు కవిత వ్యక్తిగత లాయర్ సోమ భరత్, అడ్వకేట్ జనరల్ గండ్ర మోహన్‌రావు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లడంతో కవితను అరెస్ట్ చేస్తారేమోన్న ఆందోళన నెలకొంది. బీఆర్‌ఎస్ నాయకుల హడావుడి కూడా ఇందుకు ఊతం ఇచ్చింది.
తొమ్మిది గంటల పాటు
కవితను సాయంత్రం తొమ్మిది గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. డాక్యుమెంటేషన్‌పై ఆమె సంతకాలు తీసుకున్నారు. విచారణ ముగిసింది అని చెప్పేందుకేనా లేక కవితను అరెస్ట్ చేసే ముందుకు సంతకాలు తీసుకుంటున్నారా అని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కొంతమంది వైద్యులు ఈడీ కార్యాలయంలోకి వెళ్లడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తాను ఒక మహిళను సాయంత్రం ఆరు గంటల దాకా విచారించకూడదని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఈడీ అధికారులు సాయంత్రం 9 దాటిన తర్వాత కూడా ఆమెను తమ కార్యాలయంలోనే ఉంచి విచారణ చేయడం గమనార్హం.
ఈడీ తరువాతి స్టెప్ ఏంటో
మరోవైపు ఢిల్లీలోనే ఉన్న మంత్రి కేటీఆర్ ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇంటలిజెన్స్ అధికారులు కూడా ఈడీ పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో ఉండగా, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఢిల్లీ పరిణామల నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులకు కేసీఆర్ నుంచి కీలక ఆదేశాలు వెల్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కవిత అరెస్ట్ లేకపోవడంతో బీఆర్‌ఎస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. కవిత కేసీఆర్ ఇంటికి చేరుకోవడంతో అక్కడే ఉన్న కేటీఆర్ ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల గురించి తెలుసుకున్నారు. కవిత వెంటనే కేసీఆర్‌కు ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే మంగళవారం 11;30 కు కవితను మళ్ళీ విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గులాబీ నేతల్లో ఆందోళన నెలకొంది.