Early Polls-Media: కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా మారింది తెలంగాణలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి. కోతికి ఒక కొబ్బరి చిప్ప దొరికితే రోజంతా కొరుకుతూనే ఉందట. ఇప్పుడు తెలంగాణ మీడియా కూడా ఏదైనా ఒక సంచలన విషయాన్ని పట్టుకుని వాస్తవం ఉందో లేదో తెలుసుకోకుండా రోజంతా కథనాల మీద కథనాలు, విశ్లేషణలు, డిబేట్ నిర్వహిస్తున్నాయి. వాస్తవం తెలుసుకోలేదు కాబట్టి.. హెడ్‌లైన్స్‌కు ఓ క్వశ్చన్ మార్కు పెట్టేస్తున్నాయి. దీంతో దోషం పోయినట్లు భావిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో మీడియాకు ముందస్తు ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. దీనికి కొన్ని కారణాలు చూపుతూ క్వశ్చన్ మార్క్ కథనాలు వండి వార్చేస్తున్నాయి.

ముందస్తు అంటే..
ఎన్నికలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ ఎన్నికలు, రెండోది మధ్యంతర ఎన్నికలు, మూడోది ముందస్తు ఎన్నికలు.. సాధారణ ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పూర్తికాలం ఐదేళ్లు పాలన సాగించిన తర్వాత ఎన్నికల సంఘం నిర్వహించేది సాధారణ ఎన్నికలు. ఇక ఒక ప్రభుత్వం పాలన సాగించలేక పథనమై ఎన్నికలు జరిగితే దానిని మధ్యంతర ఎన్నికలు అంటారు. ఇక ముందస్తు అంటే ఒక ప్రభుత్వాన్ని కావాలనే రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళితే దానిని ముందస్తు ఎన్నికలు అంటారు. మీడియాకు చాలా ఇష్టమైన పదం ఈ ముందస్తు ఎన్నికలు. తెలంగాణ మీడియాకు ఇప్పుడు ఈ ఇష్టమైన పదం దొరికింది. సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ముగించుకుని వచ్చిన మరుసటి రోజే క్యాబినెట్, అదే రోజు లెజిస్లేటివ్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు మీడియాకు మెయిన్ టాపిక్‌గా మారింది. రెండు సమావేశాలు నిర్వహించడంతో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారని కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రసారం చేస్తున్నాయి.
Also Read: Union Minister Nirmala Sitharaman: మోడీ ఫొటో లేకపోవడంతో నిర్మల తండ్లాట అంతా ఇంతా కాదే?
మీడియా అత్యుత్సాహం..
మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం ఇటీవల సాధారణమైంది. రెండు దశాబ్దాల క్రితం ఒకటి రెండు న్యూస్ చానెళ్లు, ఐదారు విశ్వసనీయ పత్రికలు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో వార్తల ప్రచురణ, ప్రసారంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవి. అవసరమైతే అధికారులు, పాలకులు, ప్రజాప్రతినిధుల వివరణ కూడా తీసుకునేవి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. చానెళ్లు పెరిగాయి. పేపర్లు అయితే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో మీడియా పరిమితులు విస్తృతమైనట్లు వ్యవహరిస్తున్నాయి. శీర్షికల వెనుక క్వశ్చన్ మార్కు పెట్టి వార్తలు, కథనాలు ప్రసారం చేస్తున్నాయి. గతంలో ఒక బాలుడు బావిలో పడితే ఎలక్ట్రానిక్ మీడియా దానిపై రోజంతా కథనం ప్రసారం చేసేవి. అవసరమైతే రోజుల తరబడి లైవ్ టెలికాస్ట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక సెలబ్రిటీలు ఎవరైనా అనుమానాస్పదంగా మృతిచెందితే దానికి మీడియానే సొంతంగా విచారణ చేసి.. లొకేషన్‌కు ప్రతినిధులను పంపించి, లేదా కల్పిత పాత్రల్లో సన్నివేశాలు చిత్రీకరించి ప్రసారం చేసేవి. సీనియన్ నటి శ్రీదేవి దుబాయిలోని ఓ హోటల్ బాత్‌రూంలో మృతిచెందినప్పుడు ఓ తెలుగు న్యూస్ చానెల్ యాంకర్స్ అయితే నిజంగా బాత్‌రూంలోకి వెళ్లి.. శ్రీదేవి ఎలా వెళ్లింది.. ఎక్కడ మొదట అడుగు పెట్టింది. బాత్ టబ్‌లో ఎలా పడుకుంది.. ఎలా జారిపడింది అంటూ విశ్లేషణ కూడా చేసింది. ఇటీవల తెలంగాణలో గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం వద్ద పలు గ్రామాలను ముంచేసింది. ఆ గ్రామాలకు వెళ్లిన న్యూస్ చానెళ్ల ప్రతినిదులు కూడా పీకల్లోతు నీటిలో నిలబడి వార్తలు కవర్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ముందస్తు వార్తను కూడా ఇలాగే ప్రసారం చేస్తున్నారు. కేసీఆర్ అసలు ముందస్తుకు వెళ్లే ఆలోచన ఉందా లేదా.. దీనిపై ఎవరితో అయినా మాట్లాడారా అని తెలుసుకోకుండా కేవలం బీహార్ వెళ్లొచ్చాక క్యాబినెట్, లెజిస్లేటివ్ మీటింగ్ రెండు ఒకేసారి నిర్వహిస్తున్నారు కాబట్టి ముందస్తు ఆలోచన ఉండొచ్చు అని కథనాలతో హోరెత్తిస్తున్నాయి.

కచ్చితత్వం లేని సమాచారం..
ముందస్తుపై ఇంత హడావుడి చేస్తున్న మీడియాకు ఏదైనా కచ్చితమైన సమాచారం ఉందా అంటే అదీ లేదు. కేవలం ఊహాకథనాలతో కచ్చితత్వం లేని సమాచారంతో రేటింగ్స్ కోసం పాకులాడుతున్నాయి. కొన్ని న్యూస్ పెపర్లు, వెబ్ పేపర్లు కూడా ఇలాగే కథనాలు రాస్తున్నాయి. కచ్చితత్వం లేదు కాబట్టి శీర్షికల వెనుక ఒక ప్రశ్న గుర్త పెడుతున్నాయి. దీంతో తాము ఏం ప్రసారం చేసినా చెల్లుతుందని, ఏది రాసినా ఏమీ కాదని భావిస్తున్నాయి.
అన్నీ ఇంతే అనలేం..
అయితే అన్ని కథనాలనూ ఇలా తప్పు పట్టడానికి వీలు లేదు. కొన్ని కథనాలు ఇన్వెస్టిగేటివ్ ఉంటాయి. వీటి ద్వారా అసలు నిజాలు కూడా బయటకు వస్తాయి. తద్వారా మీడియాకు క్రెడిబులిటీ దక్కుతుంది. ఇక సమస్యలను వెలుగులోకి తెచ్చినప్పుడు ప్రభుత్వాలు, అధికారుల్లో కదలిక తెస్తుంది. అయితే ప్రజలకు ఉపయోగం లేని కథనాలను రేటింగ్స్ కోసం పదేపదే ప్రసారం చేయడమే ఇబ్బందిగా మారుతోంది.
Also Read:Pawan Kalyan Birthday Special: ‘పవర్’ మార్చే పవన్ స్టార్.. జన సేనాని రాజకీయ లక్ష్యం అదే!