
Telangana Polls : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది. బీజేపీ బండి సంజయ్ పాదయాత్రకు, వైఎస్ షర్మిల పాదయాత్రకు రాని జనాలు.. రేవంత్ కు మాత్రం తెగ వచ్చేస్తున్నారు. ఇటీవల సర్వేల్లో కూడా బీఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. దీంతో ఈసారి కాంగ్రెస్ కు అధికారం తథ్యం అని.. అందుకే కేసీఆర్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు, జగన్ ల వరకూ పాదయాత్రలు చేసిన వారందరూ అధికారం సాధించారు. సీఎంలు అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదే హైప్ వస్తోంది. దీంతో ప్రతిపక్షాలు బలపడకముందే వారిని దెబ్బకొట్టాలని కేసీఆర్ ముందస్తుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. తాజాగా బడ్జెట్ సందర్భంగా నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ఒక సంచలన విషయం చెప్పారని.. ఓ మంత్రి పీఏ ఈ మేరకు ఈ రహస్యాన్ని మీడియాకు లీక్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ 2018లో లాగానే ఈసారి కాంగ్రెస్, బీజేపీలను దెబ్బకొట్టాలని ప్లాన్ చేసినట్టుసమాచారం.
ఈనెల 17న సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ లో నిర్వహించే బీఆర్ఎస్ మూడో విడత సమావేశంలో ఆయన ముందస్తు ఎన్నికలపై కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇప్పుడు బలం దృష్ట్యా ఎన్నికలకు వెళితే తిరుగులేని శక్తిగా అవతరించేందుకు ఛాన్స్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పిలిపించి జంపింగ్ లను ప్రోత్సహించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ రద్దు చేయనున్నట్టు కేసీఆర్ ఇదివరకే మంత్రులకు చెప్పారని.. ఈ క్రమంలోనే సభను మొత్తాన్ని మంత్రి కేటీఆర్ కు అప్పగించేసినట్టు తెలుస్తోంది. 2018లోనూ కేసీఆర్ ఇలాగే ప్రతిపక్షాలు సర్దుకోకముందే ముందస్తుకు వెళ్లి గెలిచారు. డిసెంబర్ వరకూ వేచిచూస్తే కాంగ్రెస్, బీజేపీ పాదయాత్రలతో బలపడుతాయని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. అందుకే అవి బలపడకముందే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారు.వారికి అవకాశం ఇచ్చే బదులు తనే సభను రద్దు చేసి మేలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిస్తే.. మే నాటికి తెలంగాణ ఎన్నికలు పూర్తి చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పుడే గెలిస్తే 10 నెలల సమయం ఉంటుందని.. ఈ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవసరమైన ప్రచారం రెడీ చేసుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఆలోచనలగా ఉంది. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే ముందుగా తెలంగాణ ఎన్నికలను గెలవాలని.. అందుకే త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.