
చాలామంది మద్యం తాగితే తాము ఏం చేస్తున్నామనే విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటారు. మద్యం మత్తులో చేసిన పనుల గురించి ఆ తరువాత ఇతరులు చెబితే షాక్ అవుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మద్యం మత్తులో చేసే పనుల వల్ల తరువాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చెన్నైలో ఒక యువ వైద్యుడు మద్యం మత్తులో పోలీస్ వాహనంలో వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పుకు ఊచలు లెక్కిస్తున్నాడు.
మద్యం తాగినందుకు పోలీసులు యువ వైద్యుని కారును సీజ్ చేయడంతో ఆ యువకుడు ఈ పని చేశాడని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఎస్ మధు గణేష్ అనే వైద్యుడు తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం ప్రాంతానికి చెందిన వాడు. అతను ప్రస్తుతం కుంద్రాతుర్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో వైద్యునిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీకెండ్ లో మధు గణేష్ మద్యం తాగి వాహనం నడుపుతూ చెన్నైలోని కిల్పాక్ దగ్గర పోలీసులు చెక్ చేస్తుండగా దొరికిపోయాడు.
పోలీసులు అతనికి జరిమానా వేసి అతని కారును సీజ్ చేశారు. ఆ తరువాత మధు గణేష్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. 1.30 గంటల సమయంలో అక్కడినుంచి వెళ్లిపోయిన మధు గణేష్ 3.30 గంటల సమయంలో పోలీసుల దగ్గరకు వెళ్లి తన వాహనాన్ని తనకు ఇచ్చేయాలని కోరాడు. అయితే పోలీసులు మాత్రం అతనికి వాహనాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. మధు గణేష్ కోపంతో అక్కడే ఉన్న ఒక పెట్రోలింగ్ వాహనాన్ని తీసుకెళ్లాడు.
పోలీసులు బైక్ పై అతడిని వెంబడించి కొన్ని కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అతనిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులకు పట్టుబడిన మధు గణేష్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. కోర్టులో అతనికి ఏ శిక్ష విధిస్తారో చూడాల్సి ఉంది.