Homeజాతీయ వార్తలుDraupadi Murmu Biography: మారుమూల గ్రామం నుంచి రాష్ట్రపతి దాకా

Draupadi Murmu Biography: మారుమూల గ్రామం నుంచి రాష్ట్రపతి దాకా

Draupadi Murmu Biography: కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే నేపథ్యం ఆమెది. ఆడపిల్లకు చదువు ఎందుకంటే డిగ్రీ దాకా చదువుకొని అందరి నోళ్ళు మూయించిన ఘనత ఆమెది. భర్త బ్యాంకు ఉద్యోగి అయినప్పటికీ అత్తమామలతో కలిసి పూరి గుడిసెలో నివాసం ఉన్న తెగువ ఆమెది. పేరుకు గిరిజన నేపథ్యం అయినప్పటికీ అనితర సాధ్యమైన మాట తీరు ఆమెది. ఇన్ని గుణగణాలు ఉన్నాయి కాబట్టే.. భారత 15వ రాష్ట్రపతిగా అఖండమైన మెజార్టీతో విజయాన్ని సాధించారు. కానీ ఇంతటి స్థాయికి రావడానికి ఆమె పడ్డ కష్టాలు ఎన్నో. కుటుంబంలో వరుస పెట్టి మరణాలు సంభవిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో బతికింది. తనను నమ్ముకున్న గిరిజనులకు అండదండలు అందించింది. ఆమె ద్రౌపది ముర్ము.

Draupadi Murmu Biography
Draupadi Murmu

తిరుగులేని విజయం

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడో ఒడిశాలోని మారు మూల అటవీ గ్రామంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ద్రౌపది జీవితం ఎందరికో స్ఫూర్తివంతం. స్వాతంత్రం అనంతరం జన్మించిన తొలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం. సంథాలి తెగకు చెందిన ఆమెను రాష్ట్రపతిగా ఎన్నుకోవడం ద్వారా ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతావని రుణం తీర్చుకుంది. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఉపర్ బేడలో 1958 జూన్ 20న అతి నిరుపేద కుటుంబంలో ద్రౌపది జన్మించారు. అనేక కష్టాలకు వచ్చి భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆడపిల్లకు చదువు ఎందుకని బంధువులు హేళనకు గురిచేసినా పట్టు విడకుండా ఆమె చదువుకున్నారు.ఇదే క్రమంలో బ్యాంకు ఉద్యోగి శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వాస్తవానికి అతి పేదరిక నేపథ్యమైన ద్రౌపదికి 2009 వరకు కూడా సొంత ఇల్లు లేదు. అత్తమామలతో కలిసి ఒక పూరిపాకలో నివాసం ఉండేది.

Also Read: Draupadi Murmu: పదవులిస్తున్నారు.. పవర్ నొక్కేస్తున్నారు.. ద్రౌపది ముర్ము ఎంపిక వెళ తెరపైకి ‘సామాజిక న్యాయం’

2009లో తన 25 ఏళ్ల కొడుకు లక్ష్మణ్ మిత్రులతో కలిసి విందుకు వెళ్లాడు. తిరిగి అతడిని అపస్మారక స్థితిలో ఇంటికి తన స్నేహితులు తీసుకువచ్చారు. పైకి దెబ్బలు ఏమీ కనిపించకపోవడంతో అంత సీరియస్ గా తీసుకోలేదు. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి గదిలో మరణించి ఉన్నాడు. ఇది ద్రౌపదికి కోలుకోలేని షాక్. కుమారుడు మరణించడంతో ఆమె కొన్నాళ్లపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఇక 2013లో పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. 2014లో భర్త గుండెపోటుతో మరణించాడు. 2015 ద్రౌపది తల్లి, సోదరుడు కూడా మరణించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం బ్రహ్మకుమారి మార్గాన్ని అనుసరిస్తున్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. శివుడికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ మానసిక ధైర్యాన్ని పొందుతున్నారు. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే స్థానిక శివాలయానికి వెళ్లి ఆ ఆవరణను చీపురుతో శుభ్రంగా ఊడ్చి తన శివ భక్తిని చాటుకున్నారు.

నీటిపారుదల శాఖలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం.

ద్రౌపది 1979లో సాగునీటి శాఖలో చిరు ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు అరబిందో విద్యాలయంలో తన పిల్లలను చదివించుకుంటూ అక్కడే టీచర్ గా స్వచ్ఛందంగా సేవలు అందించారు. తర్వాత బిజెపిలో చేరి స్థానిక నగర పంచాయతీ కౌన్సిలర్ గా గెలిచారు. వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెకు స్వతంత్ర హోదా ఇచ్చారు. సంథాలి, ఒరియా భాషల్లో అద్భుత ప్రసంగాలు చేస్తూ ద్రౌపది బిజెపిలో ముఖ్య నాయకురాలిగా ఎదిగారు. మంత్రిగా ఉన్నప్పుడు ఒడిస్సా లో రోడ్లు, నౌకాకాశ్రయాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.

Draupadi Murmu Biography
Draupadi Murmu

ఇదే క్రమంలో 2004లో బిజెపి, బీజేడీ మధ్య తెగతెంపులు కావడంతో ఎన్నికలు వచ్చాయి. అయినప్పటికీ ద్రౌపది మరోసారి ఎమ్మెల్యే గెలిచారు. ఒడిశాలో బిజెపి గిరిజన మోర్చా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2009లో చిన్న కుమారుడు లక్ష్మణ్ కనుమూయడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వరుస విషాదాల నుంచి తేరుకొని 2014లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ఈ లోగానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో మోడీ ఆమెను జార్ఖండ్ గవర్నర్ గా నియమించారు. ఇక ఆ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఆమె ముక్కుసూటిగా పని చేశారు. బీహార్ నుంచి రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్ లో మొదటి నుంచి రాజకీయ అనిశ్చితి ఉంది. ఇక ఒక పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్లడం అక్కడ పరిపాటి. గవర్నర్ గా ఆరేళ్ల కాలంలో ఆమె ఎక్కడ కూడా విమర్శలు ఎదుర్కోలేదు. పైగా అటవీ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేలా అక్కడి బిజెపి ప్రభుత్వం చట్టం మార్చేయాలని చూస్తే ద్రౌపది అడ్డుకున్నారు.

సంతకం పెట్టకుండా బిల్లుని నిలుపుదల చేశారు. తద్వారా ఆ రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలకు చెక్ పెట్టారు. నాటి కృతజ్ఞతతోనే జేఎంఎం అధినేత హేమంత్ సోరేన్ ద్రౌపదికి మద్దతు పలికారు. పైగా ద్రౌపది గవర్నర్ గా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతోనూ సత్సంబంధాలను నెరిపేవారు. ప్రోటోకాల్ విషయంలోనూ అందరికీ సముచిత ప్రాధాన్యం ఇచ్చేవారు. అందువల్లే ద్రౌపది అభ్యర్థిత్వాన్ని గిరిజన నాయకులు ఏకపక్షంగా ఆమోదించారు. పార్టీలు వేరైనప్పటికీ గిరిజన బిడ్డ కావడంతో ఆదివాసీ ప్రజాప్రతినిధులు తమ ఓటును ఆమెకే వేశారు. ఏకంగా భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదిని గెలిపించుకున్నారు. ఎక్కడో ఒడిశా లోని మారుమూల ప్రాంతంలో పుట్టిన అతి పేద కుటుంబానికి చెందిన గిరిజన మహిళను ఈ దేశ ప్రథమ పౌరురాలిని చేశారు.

Draupadi Murmu Biography
Draupadi Murmu

ద్రౌపది కోసం కుమార్తె బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు

తల్లి, సోదరుడు, భర్త, ఇద్దరు కుమారుల మరణం తర్వాత ద్రౌపది ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు ఉన్న ఏకైక ధైర్యం కుమార్తె ఇంటి శ్రీ.. పూణేలో ఎంబీఏ చదివిన ఆమె… భువనేశ్వర్ లో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నారు. 2015 లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. తల్లి రాష్ట్రపతి అయ్యాక బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి కుటుంబంలో వరుస పెట్టి మరణాలు సంభవిస్తున్నప్పుడు ద్రౌపదికి ఇంటి శ్రీనే పెద్దదిక్కు అయ్యారు. డిప్రెషన్ లోకి వెళ్లిన ద్రౌపదిని ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లి మామూలు మనిషిని చేశారు. పైగా ఆమె అనారోగ్యం పాలయితే సపర్యలు చేశారు. అందువల్లే ప్రస్తుతం ద్రౌపది ముర్ము నిలదొక్కుకున్నారు. ఇక రాష్ట్రపతి పదవికి మరింత వన్నె తేవడంపైనే తన దృష్టి ఉందని ద్రౌపది చెబుతుండడం ఈ దేశంలో నూతన విలువలకు నాంది పలికే ప్రయత్నమని చెప్పవచ్చు.

Also Read:BJP vs TRS: బీజేపీకి మరో ఆయుధం ఇచ్చిన టీఆర్ఎస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular