
మార్కెట్ లో టమోటా, ఉల్లి రేట్లు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయో ఎప్పుడు తక్కువగా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. టమోటా, ఉల్లి కొన్నిసార్లు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తుంటే మరి కొన్నిసార్లు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నిలకడలేని ధరల వల్ల రైతులకు భారీగా నష్టాలు వస్తున్నాయి. అయితే టమోటా రేటు తక్కువగా ఉన్నా రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు.
నాణ్యమైన టమాటాలను కోసి ఎండబెడితే ఆ ఎండిన టమోటాలను పొడిగా చేసి విక్రయించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ జిల్లాల రైతులు ఎక్కువగా టమోటాలను పండిస్తారు. అతిపెద్ద టమోటా మార్కెట్ లలో ఒకటైన మదనపల్లి మార్కెట్ లో పది కిలోల మేలురకం టమోటా ధర 130 రూపాయలుగా ఉంది. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం టమోటాలను ఒరుగులు(ఎండు ఒప్పులు)గా, పొడిగా మార్చి వినియోగించుకోవచ్చని చెబుతోంది. నాణ్యమైన కాయలను ఎన్నుకొని ప్లాస్టిక్ షీట్ మీద 34 డిగ్రీల సెల్షియస్ అంతకుమించిన ఉష్ణోగ్రత ఉంటే 10 రోజుల వరకు ఎండబెట్టలి. పూర్తిగా ఎండిన ఒరుగులను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసిన ఎండు ఒరుగులను 6 గంటలు నీళ్లలో నానబెట్టి వినియోగించుకోవచ్చు.
ఒరుగులతో వంటలు చేస్తే తాజా టమోటాలు వేసినప్పటి మాదిరిగానే రుచి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమోటాల ద్వారా లభించే విటమిన్ సి, లైకోపెన్ తదితర పోషకాలు ఈ ఒరుగుల ద్వారా కూడా కూడా లభిస్తాయి. ఈ ఒరుగులను విక్రయించి మంచి లాభాలను పొందవచ్చు.