సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళిన అక్కడ మనకు ఆ పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కొన్ని ఆలయాలలో విగ్రహ రూపంలో దర్శనమివ్వడం మనం చూస్తూనే ఉంటాం. విగ్రహ రూపంలో అయిన శివుడు కూర్చొని భక్తులకు దర్శనమివ్వడం మనం చూసే ఉంటాం. కానీ లక్ష్మీదేవి వడిలో ఆ విష్ణుమూర్తి శయనిస్తున్న దృశ్యం మనకు తెలిసిందే. కానీ పార్వతీదేవి వడిలో ఆ పరమ శివుడు తలవాల్చి శయనిస్తున్న ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే అలాంటి ఆలయం ఎక్కడ ఉందో? ఈ విధంగా ఈ ఆలయంలో పరమశివుడు భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
శయన భంగిమలో కనిపించే ఈ పరమేశ్వరుడి క్షేత్రం మన తెలుగు రాష్ట్రాలలోనే ఉంది.ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సూరటు పల్లి అనే గ్రామంలో ఆ శివుడు శయన భంగిమలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.మరగదాంబిక సమేత పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ది పొందిన ఈ క్షేత్రంలో పరమ శివుడు ఈ విధంగా దర్శనం ఇవ్వడానికి గల కారణం వెనుక ఓ కథ ఉంది అదేమిటో తెలుసుకుందాం..
శివపురాణం ప్రకారం సాగరమధనం చేస్తున్నప్పుడు మహా సముద్ర గర్భం నుంచి కాలకూట విషం బయటకు వస్తుంది. అయితే ఆ విషాన్ని సేవించిన పరమశివుడు
విష ప్రభావంతో తూలి కొంత సేపు పార్వతి దేవి ఒడిలో సొమ్మసిల్లి .. ఆ తరువాత సేదదీరిన క్షేత్రం ఇది. గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహా విష్ణుమూర్తి సూక్ష్మ శరీరంతో ఆ పరమేశ్వరుడి గొంతులో ఉంటాడు. శివుడు విషాన్ని దాచుకున్న ఆ ప్రాంతం మొత్తం నీలిరంగుగా మారడం వల్ల స్వామి వారిని నీలకంఠేశ్వరుని గా పిలుస్తారు. ఈ విధంగా స్వామి వారు పార్వతి దేవి వడిలో సేద తీరుతున్న విషయాన్ని నారదుడు ముల్లోకాలకు తెలియజేస్తాడు.
ఆ పరమశివుడికి స్వస్థత చేకూరాలని ముల్లోకాల్లో ఉన్న సురగణమంతా సురుటపల్లికి చేరుకుంది. ఆవిధంగా పరమేశ్వరుడుని చూడటానికి వచ్చిన వారందరికీ స్వామివారి విశ్రాంతి తీసుకుంటున్నారని నందీశ్వరుడు వారిని ఆపుతాడు.ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు లేచి తన భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అయితే దేవ దేవతలు, ఋషులు పరమేశ్వరుని కృష్ణపక్ష త్రయోదశినాడు దర్శించుకున్నారని శివపురాణం చెబుతోంది. ఆ విధంగా సురులు మొత్తం ఆ ప్రాంతానికి కలిసి రావడంతో ఆ ప్రాంతానికి ఆ సురులపల్లి అనే పేరు వచ్చింది. క్రమంగా సురుటపల్లిగా మారింది. ఈ ఆలయంలో స్వామి వారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున కృష్ణపక్ష త్రయోదశినాడు ఆలయానికి చేరుకుంటారు. భక్తుల కోరికలను తీర్చే స్వామిగా పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు.