
Vidudhala Trailer : ఆ మధ్య అల్లు అరవింద్ కన్నడ బ్లాక్ బస్టర్ కాంతార సినిమాను తెలుగులో డబ్ చేసి.. స్ట్రెయిట్ సినిమా సాధించిన వసూళ్లను మూట కట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక డబ్బింగ్ సినిమాతో వస్తున్నాడు. ఈసారి ఆయన “విడుదల” సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు. కానీ ఈ “విడుదల” రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమా కాదు. తమిళ వెట్రి మారన్ సృష్టించిన అద్భుత దృశ్య కావ్యం. తమిళనాడులో “విడుతలై_1” పేరుతో మార్చి 31న విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతున్నది. దీంతో ఈ సినిమాపై అల్లు అరవింద్ కన్ను వేశాడు. ఫ్యాన్సీ రేటుకు సినిమా డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేశాడు.
ప్రస్తుతం తెలుగులో దసరా, రావణాసుర విజయవంతంగా ఆడుతుండడం, డబ్బింగ్ అలాంటి కారణాలవల్ల “విడుదల” కొంచెం ఆలస్యమైంది. అల్లు అరవింద్ ముందుకు రావడంతో “విడుదల మొదటి భాగం” ఏప్రిల్ 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిని సినిమా అనేకంటే వెట్రిమారన్ దృశ్య కావ్యం అనడం సబబు. కల్ట్ సినిమాలు తీయడంలో తనకు తానే పోటీ. పైగా కథను చెప్పడంలో ఆయన ఎంచుకునే విధానం సూపర్ గా ఉంటుంది. అందుకే ఆయనకు తమిళనాడులో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. తెలుగు నాట రాజమౌళికి ఇంతవరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. అలాగే వెట్రి మారన్ కు కూడా ఒక్క పరాజయం కూడా లేదు. అలాంటి దర్శకుడు తీసిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే పోలీస్ శాఖలో చాలా నిజాయితీగా ఉండే పోలీస్ కానిస్టేబుల్ ( కమెడియన్ సూరి) తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి చలించిపోతాడు. మరో వైపు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పెరుమాళ్(విజయ్ సేతుపతి) పోరాడుతుంటాడు. అయితే పెరుమాళ్ కోసం ప్రభుత్వం వెతుకుతూ ఉంటుంది. అయితే ఈలోగా ప్రత్యేక అధికారి (గౌతమ్ మీనన్) వచ్చిన తర్వాత ప్రజాదళం సానుభూతిపరుల మీద, వారి ఆడవాళ్ళ మీద పోలీసులు దారుణాలకు తెగబడతారు. దీంతో పెరుమాళ్ బయటికి వస్తాడు. అరాచకం మొదలుపెడతాడు. అయితే ఇది ఎక్కడికి వెళ్ళింది అన్నదే మిగతా కథ!
చూసేందుకు చిన్న కథ అయినప్పటికీ హక్కు, బాధ్యత మధ్య ఎంతటి సంఘర్షణ ఉంటుందో ఈ చిత్రం ద్వారా వెట్రీ మారన్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. విజయ్ సేతుపతి మరోమారు తన పాత్రలో జీవించేశాడు. కమెడియన్ సూరి కానిస్టేబుల్ పాత్రలో అదరగొట్టాడు. ఇక విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇళయరాజా సంగీతం మనల్ని మరో ప్రపంచం లోకి తీసుకెళ్తుంది. వెట్రి మారన్ వడ చెన్నై, అసురన్, కాకముట్టై విడుతలై_1 అనే సినిమాలు తీశాడు. కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు. నాలుగు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు.. ఇక వెట్రి మారన్ లాగానే విరాటపర్వం సినిమాలో ఇలాంటి లైన్ నే వేణు ఊడుగుల టచ్ చేసాడు. కానీ తెలుగు ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోలేదు.. మరి ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏప్రిల్ 15న తెలిసిపోతుంది.