Yoga Benefits: ‘యోగా చేస్తే మంచిది..’ రోజూ అందరం వినే మాటే ఇది. ఆ మంచి ఏమిటని అడిగితే తెలియదు అనే వాళ్లే ఎక్కువ. యోగా ఎంత అద్భుతమైనదంటే.. మన శరీరం మీద శాస్త్రీయంగా అది చూపించే ప్రభావం తెలుసుకుంటే.. ఆసనం వేయకుండా ఉండలేము. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీరూ చదివేయండి. రోజూ ఉదయం ప్రయత్నించండి.
వెన్ను
వెన్నుపూసల మధ్య ఉండే స్పైనల్ డిస్క్‌లు దగ్గరవుతూ, దూరమవుతూ నాడులకు తగిన చేతనను అందిస్తాయి. యోగాసనాల్లోని ముందుకు, వెనక్కు వంగే, మెలితిరిగే భంగిమల వల్ల వెన్నుపూసల మధ్య ఫ్లెక్సిబిలిటీ మెరుగై శరీర పటుత్వం సమకూరుతుంది.
ఎముకలు, కండరాలు
యోగాసనాల ద్వారా కండరాలు, ఎముకలు, కీళ్లు వాటి పూర్తి సామర్ధ్యానికి తగ్గట్టు వాడబడతాయి. ఇలాంటి వ్యాయామం వల్ల కీళ్ల మధ్య ఉండే మెత్తని మృదులాస్థి సాగి, దగ్గరవుతూ ఉంటుంది. ఇలా మరే వ్యాయామంలోను జరిగే అవకాశమే లేదు. ఇలా యోగాలో జరగటం వల్ల కార్టిలేజ్‌కు కొత్త పోషకాలు అందించబడి, కదలికలకు అనుగుణంగా కీళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా వంగగలుగుతాయి. ఫలితంగా మృదులాస్థి క్షీణించి కీళ్లు అరిగిపోవటమనే సమస్య తలెత్తదు.
నాడీ వ్యవస్థ
గుండె కొట్టుకునే వేగాన్ని, శ్వాసను నియంత్రించటం లాంటివి యోగులు మాత్రమే చేయగలరు. ఇలా యోగాతో శరీర క్రియలను అదుపులో పెట్టుకోగలిగినప్పుడు అదే యోగాను నాడుల పనితీరు మెరుగుపరచటానికి కూడా ఉపయోగించవచ్చు. రాత్రుళ్లు నిద్ర పట్టనప్పుడు రిలాక్సేషన్ కోసం, మనసును స్వాధీనంలో ఉంచుకోవటం కోసం కూడా యోగాభ్యాసాన్ని సాధన చేయొచ్చు. దీనికి ఎంతో సాధన అవసరం.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత
జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు, మానసిక ఒత్తిడులు దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనుల మీద ఏకాగ్రత లోపించటానికి కారణమవుతూ ఉంటాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. యోగా మనసులోని గజిబిజి ఆలోచనలను పారద్రోలి పంచేంద్రియాలకు సాంత్వన అందిస్తుంది. మెదడులోని నిరంతర గందరగోళాన్ని వదిలించి ధ్యాసను మళ్లిస్తే ఏకాగ్రత కుదరటంతోపాటు ఙ్ఞాపకశక్తి మెరుగవుతుందని స్వానుభవంలో తెలుస్తుంది. ఇది యోగాతోనే సాధ్యం.
మధుమేహం
కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్ స్రావాలను నియంత్రించటం, బరువు తగ్గించటం, ఇన్సులిన్‌కు స్పందించే గుణాన్ని పెంచటం ద్వారా యోగా చేసే మధుమేహుల చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మధుమేహంతో లింకయి ఉండే గుండె పోటు, కిడ్నీ ఫెయిల్యూర్‌లాంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవు.
రోగనిరోధక శక్తి
వివిధ యోగాసనాల ద్వారా కండరాలను సాగదీయటం వల్ల లింఫ్ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి. ఇమ్యూన్ సెల్స్‌తో నిండి ఉండే ఈ స్రావాల విడుదలతో ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే గుణం, క్యాన్సర్ కణాల నాశనం, కణాల పనివల్ల విడుదలయ్యే వ్యర్ధాల విసర్జనలు జరుగుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి
మెరుగవుతుంది. కొన్ని ఆసనాల వల్ల కండరాలలోని ఇబ్బందులు తొలగి రక్తప్రసరణ స్వేచ్ఛగా సాగుతుంది.
యాంగ్జయిటీ, డిప్రెషన్
ఒత్తిడికి లోనయినప్పుడు శరీరంలో జరిగే మార్పులను నియంత్రించటం ద్వారా ఆ ప్రభావం శరీరంపై పడకుండా కాపాడటంలో యోగా సమర్థనీయమైనది. యోగా వల్ల స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ పనితీరు క్రమబద్ధమై రక్తపోటు తగ్గటం, గుండె స్థిరంగా కొట్టుకోవటం, శ్వాస మెరుగవటంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటి వల్ల ఎలాంటి మందులతో పనిలేకుండానే ఆందోళన, డిప్రెషన్‌లాంటి మానసిక రుగ్మతలు యోగాతో నయమవుతాయి. దీనికి అత్యంత క్రమశిక్షణ, ఓపిక అవసరం. పర్యవేక్షకుల ఆధ్వర్యంలో యోగా చేస్తూనే.. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సమస్యను కట్టడి చేయవచ్చు.
భరద్వాజాసన:
ఈ ఆసనంతో వెన్నెముక, కటి కండరాలు, ఎముకలు బలపడతాయి.
సేతుబంధ:
మెదడు నెమ్మదించి, అలిసిన కాళ్లు ఉపశమిస్తాయి.
మార్జర్యాసన:
వెన్ను, ఉదరంలోని అవయవాలు మర్దన అవుతాయి.
అథోముఖ శవాసన:
పూర్తి శరీరం ఉల్లాసభరితమవుతుంది.
అగ్నిస్తంభాసన:
సయాటిక్ నరంతో సంబంధమున్న పిరుదుల కండరాలు స్ట్రెచ్ అవుతాయి.
అర్థ మత్సేంద్రాసన
వెన్నును బలపరిచి, ఆకలిని పెంచే అవయవాలను ప్రేరేపిస్తుంది.
అర్ధచంద్రాసన
కాళ్లు, మడమలు బలపడతాయి.
ధనురాసన
నడుము కింది భాగం, చేతులు శక్తివంతమవుతాయి.
హాలాసన
బడలిక వదిలి మంచి నిద్ర పడుతుంది.
సుఖాసన
రుతుస్రావ నొప్పిని నివారిస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది.