CM KCR- Komatireddy Venkat Reddy: కేసీఆర్‌ ఒక్కొక్కరికి రూ.10కోట్లు ఇచ్చి పంపారా? నిజమెంత?

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఈసారి చాలా మంది మారతారని, సిట్టింగులలో 30 మందిని పక్కన పెడతారని ప్రచారం జరిగింది. కానీ గులాబీ బాస్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం నలుగురికి మాత్రమే టికెట్‌ ఇవ్వలేదు.

Written By: Raj Shekar, Updated On : September 13, 2023 12:14 pm

CM KCR- Komatireddy Venkat Reddy

Follow us on

CM KCR- Komatireddy Venkat Reddy: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పాలన గడువు త్వరలో ముగియబోతోంది. అనుకున్నట్లు జరిగితే ఈఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 21న మంచి ముహూర్తం ఉందని బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మొదటి జాబితా కూడా ప్రకటించారు. 115 స్థానాలకు 114 మంది అభ్యర్థులను ప్రకటించారు. కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎజెండా రూపకల్పనలో నిమగ్నమయ్యారు. అక్టోబర్‌ 16న వరంగల్‌లో నిర్వహించే సభలో బీఆర్‌ఎస్‌ అజెండా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

పైసలతోనే గెలుపు..
బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఈసారి చాలా మంది మారతారని, సిట్టింగులలో 30 మందిని పక్కన పెడతారని ప్రచారం జరిగింది. కానీ గులాబీ బాస్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం నలుగురికి మాత్రమే టికెట్‌ ఇవ్వలేదు. అందులో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వారే. సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వడం వెనక వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైసలు పెడితే ఓట్లు అవే పడతాయన్న విశ్వాసంతో కేసీఆర్‌ ఉన్నట్లు చెబుతున్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. హుజూరాబాద్‌లో నిరాశపర్చినా.. మునుగోడులో నెగ్గారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పైసలు పంచితే ఓట్లు పడతాయనే కాన్సెప్ట్‌తో కేసీఆర్‌ ఉన్నారని ప్రచారం జరగుతోంది. అందుకే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. సిట్టింగులకే టికెట్‌ ఇచ్చారని అంటున్నారు.

ఒక్కొక్కరికి రూ.10 కోట్లు..
ఇదిలా ఉండగా.. కేసీఆర్‌ 115 మంది అభ్యర్థులను ప్రకటించడంతోపాటు వారికి ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ఇచ్చారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణకు కారణం లేకపోలేదు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. టికెట్లు ప్రకటించి.. అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో మీటింగ్‌ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఒక కవర్‌ ఇచ్చి పంపించారు. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి కవర్లు పంపిణీ చేయలేదు. అయినా.. కేసీఆర్‌ అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీ. సుమారు 8 వేల కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు పార్టీ అప్పట్లోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఫండ్‌ ఇచ్చి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ, విశ్లేషకులు, విపక్షాలు మాత్రం అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ఇచ్చే ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఈసారి గట్టి నిఘా పెట్టిన నేపథ్యంలో కవర్లు ఇవ్వలేదని తెలుస్తోంది.