ABN RK -Errabelli : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. అవసరార్థం రాజకీయాలు చేసుకుపోవడమే.. ఒకప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సీఎం కేసీఆర్ కు దగ్గరి మిత్రుడు.. బావ -బావమరిది టైపు.. ఓరేయ్ అన్నంత చనువు ఉంది. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక వీరికి చెడింది. ఏబీఎన్ రాధాకృష్ణ చంద్రబాబు పంచన చేరి కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేయడంతో వీరిద్దరి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి.. ఇప్పటికీ ఆ పాత పగలు రగులుతూనే ఉన్నాయి.అయితే కేసీఆర్ వ్యతిరేకించే రాధాకృష్ణ వద్దకు తాజాగా ఎర్రబెల్లి వచ్చాడు. పాత పరిచయాలు గుర్తు చేసుకొని మరీ అన్ని రహస్యాలు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఎర్రబెల్లితో ‘ఓపెన్ హార్ట్’ చేసిన రాధాకృష్ణ ఇంటర్వ్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ కేబినెట్ లోని ఎర్రబెల్లి, తలసాని, తుమ్మలతో ఏబీఎన్ ఆర్కేకు టీడీపీలో ఉన్నప్పటి నుంచే సత్సంబంధాలు ఉన్నాయి. ఎర్రబెల్లిని ‘దొర’ అంటూ ఆప్యాయంగా పిలిచేంత చనువు రాధాకృష్ణకు ఉంది. ఈ మేరకు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో తాజాగా ఎర్రబెల్లితో ఇంటర్వ్యూ నిర్వహించాడు ఆర్కే. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ఇప్పటిదాకా టీడీపీలో మంత్రి ఎందుకు కాలేడన్న విషయాన్ని రాబట్టాడు.
‘మంత్రి పదవి కోసం ఎంతగా ప్రయత్నించినా చంద్రబాబు ఇవ్వలేదని.. తనకు వడ్డాణం చేయిస్తే మంత్రి పదవి ఇప్పిస్తానని లక్ష్మీపార్వతి ఆఫర్ ఇచ్చిందని’ ఎర్రబెల్లి ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టాడు. కానీ నేను ఆ పనిచేయలేదని.. టీడీపీలో అన్నేళ్లు ఉన్నా తనకు మంత్రి పదవి దక్కలేదన్నారు.
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత కక్ష సాధింపు ప్రభుత్వాన్ని చూడలేదని.. మోడీ చుట్టూ, కేంద్రమంత్రుల చుట్టూ తిరిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎర్రబెల్లి సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంతో కొట్లాడడం కరెక్టేనని ఎర్రబెల్లి సమర్థించుకున్నారు. ఇక కాంగ్రెస్ ను ఖతం చేస్తే.. బోనులా ఉన్న పులిలా బీజేపీ వెంటపడుతోందన్న ఆర్కే వాదనతో ఎర్రబెల్లి ఏకీభవించారు.
కొండా సురేఖ-మురళీలతో తనకు శాశ్వత శత్రుత్వం ఉందని.. ఫ్యాక్షన్ పగలు సాగాయని ఎర్రబెల్లి అంగీకరించారు. తనను విలన్ ను చేసి సినిమా తీస్తే రెండు రోజులు కూడా ఆడలేదని చెప్పుకొచ్చాడు. సురేఖను చంపడానికి మురళీ వస్తే తనే కాపాడనని.. ఆ విషయం సురేఖకు తెలుసు అంటూ సంచలన విషయం లీక్ చేశాడు.
కేసీఆర్ మొండిఘటం చెబితే వినడు అన్నది అబద్ధమని.. నేను చెబితే చాలా సార్లు విన్నాడని ఎర్రబెల్లి చెప్పుకొచ్చాడు. ఇక ‘ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించింది.. ఆ విషయాన్ని లీక్ చేసింది ఎర్రబెల్లినేనట కదా?’ అన్న ఏబీఎన్ ఆర్కే ప్రశ్నకు తలదించుకున్నాడు ఎర్రబెల్లి. దీనికి ఏం సమాధానం చెప్పాడన్నది రివీల్ చేయలేదు. ఓపెన్ హార్ట్ లో ఎర్రబెల్లి దీనికి ఏం సమాధానం చెప్పాడు? అది ఎంత దుమారం రేపుతుందన్నది ఈ ఆదివారం ఫుల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఇప్పుడే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.