Dharani Portal: ప్రజల కోసం ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడం, చట్టాలు రూపొందించడం, చట్ట సభల్లో బిల్లులు ప్రవేశపెట్టడం చేస్తుంటాయి. చాలా వరకు అవి మెజారిటీ ప్రజలు ఆమోదించేలా ఉంటాయి. అలా కాని పక్షంలో పాలకులు తీసుకునే నిర్ణయాలకు ప్రజల్లో విలువ ఉండదు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. తమ నిర్ణయం తప్పని, ప్రజామోదం లేదని గుర్తిస్తే వీలైనంత త్వరగా దానిని సరిద్దికోడం ఉత్తమ పాలకుడి లక్షణం. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అచ్చం ఇలాగే వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్‌కు ఎన్నికల ఏడాది తాము తప్పు చేశామన్న భావన కలిగింది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో ఎన్నికల వేళ తమ నిర్ణయమే తమ గుండెల మీద కుంపటిగా మారబోతోందని బీఆర్‌ఎస్ ఆలస్యంగా గుర్తించింది. చేతులు కాలాక ఆకులు పట్టుయున్న చందంగా ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తోంది.

నష్ట నివారణ చర్యల్లో తెలంగాణ సర్కార్..
రైతులు, ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న నిర్ణయం ధరణి పోర్టల్. దీని వెనుక మంచి ఉద్దేశమే ఉండి ఉండవచ్చు. కానీ మెజారిటీ ప్రజలు, రైతులకు దీనితో నష్టం జరిగింది. రెండేళ్లుగా లక్షల మంది బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ నిర్ణయం తప్పని పాలకులకు ఆలస్యంగా అర్థమైంది. ఇప్పుడు ధరణి పోర్టల్ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఏం చేయాలన్న దానిపై ప్రగతి భవన్, సచివాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో కొత్త చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, రెవెన్యూ అధికారులు తీవ్రంగా చర్చించారు. గతంలోని ‘మా భూమి’ తరహాలో ఉంటేనే మేలు అన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విపక్షాలకు ఆయుధంగా…..
ధరణి పోర్టల్ ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. అధికారంలోకి వస్తే పోర్టల్ రద్దు చేస్తామంటూ ఎన్నికల హామీగా ప్రకటిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ అంశం ముంచుందేమోనని మంత్రులు. ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రజలు వినతిపత్రాలు ఇవ్వడానికి తమ దగ్గరికి వస్తున్నారని చెబుతున్నారు.. భూ సమస్యలను పరిష్కరించలేక తాము తప్పించుకు తిరుగుతున్నామని పేర్కొంటున్నారు.
అంతా సోమేశ్ పుణ్యమే..
ధరణి పోర్టల్ అమలులోకి రావడానికి మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేశ్‌కుమార్ ప్రధాన కారణం. దీని వెనుక కీలయపాత్ర ఆయనే పోషించారు. పోర్టల్ అమలులోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఈ నిర్ణయాలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్, బీజేపీలు పోరుబాట పట్టాయి. సోమేశ్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా? సీఎం కేసీఆర్ అదేశించారా? దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ధరణిని రద్దు చేసి పాత పద్ధతినే అమలు చేయాలని కోరుతున్నాయి.
మొన్నటి వరకు బిహారీ.. ప్రస్తుతం ఆంధ్రా అధికారి..
తెలంగాణ చీఫ్ సెక్రటరీగా మొన్నటి వరకు బిహార్‌కు చెందిన సోమేశ్‌కుమార్ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రాకు చెందిన శాంతికుమారికి అప్పగించారు. మొన్నటి వరకు బిహారీ చేతిలో ఉన్న తెలంగాణ భూపరి పాలనను తాజాగా ఆంధ్రా అధికరి చేతిలో పెట్టేశారు. సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా పని చేస్తున్న రజత్ కుమార్ షైనీ కేంద్ర విధులకు వెళ్లిపోయారు. దీంతో అదనపు బాధ్యత పేరుతో సీసీఎల్‌ఏ సత్యశారదకు అప్పగించారు. ఆమెకంటే సీనియర్లు ఉన్నప్పటికీ అందరినీ పక్కన పెట్టేశారు. దీంతో ఇంకా సోమేశ్‌కుమార్ పెత్తనమే నడుస్తొందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ధరణి పోర్టల్‌తో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నా సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధరణి బీఆర్‌ఎస్ సర్కార్‌కు గుదిబండగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
ఎటూ తేల్చుకోలేక పోతున్న సర్కార్
పాత పద్ధతిలోనే భూ రికార్డుల నిర్వహణను పున రుద్ధరించాలని మెజార్టీ పార్టీలు, ప్రజాప్రతిని ధులు కోరుతున్నారు. పాత విధానమే బాగుందని ఒకరిద్దరు మంత్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే వెనక్కి తగ్గడం వల్ల ప్రతిష్ట దెబ్బ తింటుం దేమోనని తెలంగాణ సర్కారు ఎటూ తేల్చుకోలేకపోతున్నది. పోర్టల్‌లో సవరణలు చేయాలా? లేకుంటే పూర్తిగా రద్దు చేయాలా? నిర్ణయించుకోలేకపోతున్న ది. ప్రగతిభవన్, సచివాలయంలో కీలక అధికారులతో సమావేశాలు నిర్వహించి, దీనిపై చర్చిస్తున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తి వేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించినందున.. ఇప్పుడు రద్దు చేస్తే అపోజిషన్ పార్టీలకు ఆయుధంగా మారుతుందేమోనని అనుమానిస్తుంది. మరోవైపు ధరణిలోని సమస్యలకూ పరిష్కారం చూపలేక సతమతమవుతోంది. దీంతో సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అయోమయంలో మంత్రులు
ధరణి అమల్లోకి తెచ్చి రెండేళ్లకుపైగా గడుస్తున్నా పూర్తిస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కాలేదు. రైతులు, సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సీసీఎల్‌ఎ వరకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పట్టించుకునే వారు లేరు. ఇలాంటి అనేక సమస్యలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు పదేపదే ధరణి పోర్టల్ వైఫల్యాలపై జనంలోకి వెళ్తుండడం మంత్రులు, ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు.