Cyrus Mistry టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. టాటాలాంటి పెద్ద సంస్థకు ఒకప్పుడు చైర్మన్ గా చేసి.. ఇప్పుడు ప్రముఖ కార్పొరేట్ సంస్థ పంల్లోంజి వ్యవహారాలు చూసుకుంటున్న సైరస్ మిస్త్రీ ఇలా అహ్మదాబాద్ నుంచి ముంబైకి సాదాసీదా వ్యక్తిలా కారులో ప్రయాణించడం ఏంటి? మరణించడం ఏంటని అందరూ ఆరాతీస్తున్నారు. మామూలు హీరోలు, ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్ లో వెళుతున్న ఈరోజుల్లో ఇంత పారిశ్రామికవేత్త ఇలా కారులో రావడం.. డ్రైవర్ కూడా లేకుండా ఒక లేడీ కారు నడపడంపై అందరిలోనూ ప్రశ్నలు మెదులుతున్నాయి. ఈ కారు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ సీటు బెల్ట్ ధరించలేదని, అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో అతను మరియు అతని సహ-ప్రయాణికుడు జహంగీర్ పండోలే మరణించినట్లు ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. కారు అతివేగంగా ఉందని, కేవలం 9 నిమిషాల్లోనే 20కిలోమీటర్లు ప్రయాణించిందని పోలీసులు తెలిపారు. వెనుక సీటులో కూర్చున్న మిస్త్రీ, పండోల్ తలకు గాయాలయ్యాయి. అతి వేగమే వీరి మరణానికి కారణమని తేలింది.

నిన్న టాటా మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ బెంజ్ కారులో అహ్మదాబాద్ నుండి ముంబైకి ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. అంత పెద్ద వ్యాపారవేత్త ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా మరణించడంతో అందరూ కారు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నారు.
సైరస్ మిస్త్రీ వెనుక సీటులో కూర్చున్నారు. ఆయన సీటు బెల్ట్ పెట్టుకోలేదు. అదే మరణానికి కారణమైంది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తులు సీటు బెల్ట్‌తో ముందు కూర్చున్నారు. వాహనంలో నలుగురు వ్యక్తులు ఉండగా అందులో మిస్త్రీ సహా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన మరో వ్యక్తిని జహంగీర్ బిన్షా పండోల్‌గా గుర్తించారు.
గాయపడిన వారిని.. బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని టాప్ డాక్టర్ అనాహిత పండోల్ (కారు నడుపుతున్నవారు) మరియు జేఎం ఫైనాన్షియల్ ప్రైవేట్ ఈక్విటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అయిన డారియస్ పండోల్‌గా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
సీటు బెల్టు పెట్టుకోకపోతే ఎయిర్‌బ్యాగ్స్ వల్ల ఉపయోగం ఉండదు.. అదే మొదటి శ్రేణి రక్షణ.. ఎయిర్ బ్యాగ్ ఉన్నా కూడా సీటు బెల్ట్ పాటిస్తేనే రక్షణ కలుగుతుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అన్ని కార్లకు వెనుక సీటు బెల్ట్‌లు ఉంటాయి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారు. వెనుక భాగం చాలా సురక్షితం అని భ్రమ పడుతారు.
క్రాష్ సమయంలో వెనుక ఉన్న వ్యక్తి కొన్నిసార్లు 40 గ్రావిటీ (40 రెట్లు గురుత్వాకర్షణ, అంటే 80kgs బరువున్న వ్యక్తి 3200kgs లాగా ఉంటాడు) శక్తితో విసిరివేయబడతాడు.
ముందు ప్రయాణీకుడు సీటు బెల్ట్ ధరించి.. వెనుక ప్రయాణీకుడు ధరించకపోతే, క్రాష్ సమయంలో, వెనుక ప్రయాణీకుడు ఏనుగు అంత బరువుతో పడిపోవడం వల్ల ముందు ప్రయాణీకుడు తీవ్రంగా గాయపడటం లేదా మరణించే అవకాశం ఉంది.
సో సైరస్ మిస్త్రీ మరణంతోనైనా సీట్ బెల్ట్‌లు ధరించండి.. వాటిని ఎందుకు ఉపయోగించకూడదో తెలుసుకోండి.. సురక్షితంగా ఉండండి. అది వారి ప్రాణాలను కాపాడుతుంది.