AP Cyber Crime: తెలంగాణని చూసి ఏపీ నేర్చుకోవాల్సిందేనా?

తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు ఇట్టే చెక్ పడుతోంది. సైబర్ నియంత్రణకు ఒక వ్యవస్థ పని చేస్తోంది. సైబర్ నేరాల నియంత్రణకు నిత్య విచారణలు జరుగుతుంటాయి.

Written By: Dharma, Updated On : November 22, 2023 10:57 am

AP Cyber Crime

Follow us on

AP Cyber Crime: ఏపీలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ పేరిట, బ్యాంకు రుణాల పేరిట, ఇలా ఒకటేమిటి.. చాలా విధాలుగా ఈ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. హలో హలో అంటూ ఫోన్ చేసి అచ్చ తెలుగులో మాట్లాడతారు ఒకరు. నిమిషాల వ్యవధిలో పేపర్ల రుణాలు అంటూ నమ్మిస్తారు మరొకరు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం ఓటీపీ చెప్పండి అని కోరుతారు మరొకరు. ఇలా చెప్పిన మరుక్షణం ఖాతాల్లో ఉన్న నగదు మాయమవుతుంది. లబోదిబో మనడం బాధితుడు వంతవుతుంది. అయితే ఈ తరహా సైబర్ నేరాలకు ఏపీలో అడ్డుకట్ట పడకపోవడంతో.. కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వందల బాధితులు కాస్త వేలాది మంది అవుతున్నారు. అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతుండడం విశేషం.

ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ రిక్వెస్ట్ లాంటి వాటితో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి.. బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవడం, వస్తువులు అమ్ముతామని చెబుతూ డబ్బు కొట్టేయడం, బహుమతి వచ్చిందంటూ క్యూఆర్ కోడ్ పంపించి ఖాతాలో ఉన్న సొమ్మును ఖాళీ చేయడం వంటి నేరాలు ఇటీవల పెరిగాయి. చైనా రుణ యాపుల గురించి చెప్పనక్కర్లేదు. ఫోన్ తెలిస్తే చాలు ఈ తరహా మెసేజ్ లు కనిపిస్తుంటాయి. పొరపాటున క్లిక్ చేస్తే మాత్రం ఖాతాలో ఉన్న నగదు అంతా క్షణాల్లో మాయం చేస్తున్నారు.

తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు ఇట్టే చెక్ పడుతోంది. సైబర్ నియంత్రణకు ఒక వ్యవస్థ పని చేస్తోంది. సైబర్ నేరాల నియంత్రణకు నిత్య విచారణలు జరుగుతుంటాయి. కానీ ఏపీలో మాత్రం ఆ స్థాయిలో ప్రత్యేక నేర పరిశోధనకేంద్రాలు లేవు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సైబర్ పోలీస్ స్టేషన్ అంటూ లేకుండా పోయింది. దీంతో ఏపీలో సైబర్ నేరాలు, వైట్ కలర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అక్కడికి రాష్ట్రంలో సరైన వ్యవస్థ అంటూ లేదు. అన్నింటికీ హైదరాబాద్ పై ఆధార పడాల్సి వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైబర్ పోలీసింగ్ వ్యవస్థను గాలికి వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తొలుత విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ సైబర్ సెల్ ని ఏర్పాటు చేశారు. సీఐ, ఎస్సై తో పాటు ఏడుగురు కానిస్టేబుళ్లను కేటాయించారు. సైబర్ నేరాల కట్టడి, దర్యాప్తుపై ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ అనే సంస్థతో శిక్షణ ఇప్పించారు. అక్కడితో చేతులు దులుపుకున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఈ వ్యవస్థ సరిపోదని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక ప్రత్యేక సైబర్ సెల్ ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఇది సాగితేనే ఏపీలో సైబర్ నేరాల నియంత్రణ సాధ్యమన్న టాక్ నడుస్తోంది. కనీసం తెలంగాణ వ్యవస్థను ఫాలో అయినా.. ఏపీకి ఏ కష్టాలు ఉండవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో జగన్ సర్కార్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సైబర్ నేర నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.