Telugu Film Industry : అక్కినేని కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సహేతుకం కాదు.వాటిని అసలు సమర్ధించలేం కూడా. అలా సమర్ధించడం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే ఈ ఘటన సర్వత్రా చర్చకు దారితీసింది. ప్రతి ఒక్కరూ ఖండించారు. రాజకీయాల్లోకి ఇతర రంగాలను తీసుకురావడం మంచి పద్ధతి కాదని పలికారు. మొత్తం సినీ పరిశ్రమ అంతా ఏకతాటి పైకి వచ్చింది. దేశంలోని మిగతా చిత్ర పరిశ్రమలు సైతం ఈ విషయంలో కలిసి వచ్చాయి. అంతవరకు ఓకే కానీ..ఇదే చిత్ర పరిశ్రమ మొత్తం మునుగడకుజగన్ హయాంలో ప్రమాదం ఏర్పడింది. ఇదే చిత్ర పరిశ్రమకు చెందిన కొన్ని కుటుంబాలు టార్గెట్ అయ్యాయి.అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులుఅనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఈ ఐక్యత ఏమయింది అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.పాలకుడు ఆలోచన తీరుబట్టి ప్రవర్తించినట్టు అర్థం అవుతోంది. అప్పట్లో జగన్ కఠిన నిర్ణయాలు తీసుకునేవారు. వైసీపీ సర్కార్లో ఆయనది వన్ మాన్ షో. ఏం చేస్తామంటే కుదరదు.పైగా ఆయన ఎవరి మాట వినరు.అదే రేవంత్ అయితే కాంగ్రెస్ సీఎం. కాంగ్రెస్ అంటే బహుముఖ నాయకత్వం.అందుకే జగన్ హయాంలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు.రేవంత్ హయాంలో ఆ పరిస్థితి ఉంది కనుక స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు.తప్పులను ఎత్తిచూపగలుగుతున్నారు. తప్పు చేశారు కనుక ఖండిస్తున్నారు. అయితే ఐక్యత అనేది ఎక్కడైనా బలంగా పనిచేస్తుంది.కానీ జగన్ హయాంలో ఒకరిద్దరూ పరిశ్రమ పెద్దల తప్పులు, ఆపై దూకుడు వ్యవహార శైలి చిత్ర పరిశ్రమ నోటికి తాళం వేసింది.
* లక్షలాది మందికి ఉపాధి
అన్ని రంగాల మాదిరిగా సినిమా రంగం కూడా ఒకటి. ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు లక్షలాదిమంది ఉంటారు.కొందరు ప్రత్యక్షంగా ఉంటారు.మరికొందరు పరోక్షంగా ఉంటారు.సినిమా హీరో నుంచి నిర్మాత,దర్శకుడు వరకు,చివరకు లైట్ బాయ్ వరకు అందరూ ఇదే రంగంపై ఆధారపడి బతికిన వారే. సినిమా బయటకు వచ్చిన తర్వాత సినిమా ప్రదర్శించే యజమాని నుంచి వాల్ పోస్టర్ అతికించే వారి వరకు సినిమాపై ఆధారపడి బతుకుతారు.సమాజంలో సినిమా కూడా ఒక భాగం.ఇదో వినోదరంగం. ప్రజలకు వినోదాన్ని పంచడమే కాదు లక్షలాది మందికి ఉపాధి కూడా కల్పిస్తుంది ఈ రంగం.ఇతర రంగాల మాదిరిగా ప్రభుత్వంలో కూడా ఇది ఒక భాగం.ఇందులో అందరి యోగక్షేమాలు గమనించాల్సిన అవసరం ఉంది.కానీ గత ఐదేళ్లలో వైసిపి సినీ పరిశ్రమను ఒక వ్యతిరేక రంగం గా మాత్రమే చూసింది.
* నాడు మెగాస్టార్ కు అవమానం
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందగలిగారు. చిత్ర పరిశ్రమకు పెద్దగా ఉన్నారు.వైసీపీ హయాంలో రాజకీయ కారణాలతో టిక్కెట్లధరను అమాంతం తగ్గించేశారు. ఆ ప్రభావం సినీ రంగంపై పడింది.ఒక రకమైన సంక్షోభం ఏర్పడింది. అప్పటికే కొవిడ్ ప్రభావంతో పరిశ్రమకు అపార నష్టం కలిగింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని అప్పటి సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని పరిశ్రమ బృందం కలిసింది. కానీ నాడు ఆ నటులపై జగన్ ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ముఖ్యంగా చిరంజీవి నమస్కారం చేస్తూ చేసిన విన్నపాన్ని సైతం బుట్ట దాఖలు చేశారు. మెగాస్టార్ కు తగిన గౌరవం ఇవ్వకుండా అవమానపరిచారు. కానీ అప్పట్లో బయట వ్యక్తులు ఈ విషయాన్ని ఖండించారు. కానీ సినీ పరిశ్రమ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలు లేవు.
* కనీస స్పందన లేదు
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు మకుటం లేని మహారాజు. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎంతగానో దోహదపడ్డారు. ఆయన తరువాత చంద్రబాబు సినీ రంగానికి ఎంతో ప్రోత్సాహం అందించారు. కానీ అదే ఎన్టీఆర్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నాటి వైసిపి ఎమ్మెల్యేలు. నిండు సభలో అవమానించారు. కానీ నాడు సినీ పరిశ్రమ వ్యక్తులు కనీసం స్పందించలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. అప్పుడు కూడా నోరు తెరవలేదు. పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో మాతృమూర్తి అంజనా దేవిని తూలనాడుతూ కొందరు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడాఒక్కరంటే ఒక్కరు కూడా ఖండించేందుకు ముందుకు రాలేదు. ఖండించాలని అనుకున్న వారు సైతం అప్పుడు జగన్ సర్కారు వైఖరికి భయపడ్డారు. చిత్ర పరిశ్రమ హైదరాబాదులో ఉండగా.. ఆ చిత్రాలను ప్రదర్శించాల్సిన థియేటర్లు ఏపీలో ఉన్నాయి. అక్కడ తన మిత్రుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఇక్కడ జగన్ పాలిస్తున్నారు. అందుకే చిత్ర పరిశ్రమ ఎంతగానో భయపడింది. ఇప్పుడు కొండా సురేఖ మాటలపై పరిశ్రమ యావత్తు విరుచుకుపడుతోంది. దీనిని తప్పు పట్టలేము కానీ.. నాడు మాత్రం నోరు తెరవకపోవడం నేటి పరిస్థితికి కారణం అని చెప్పవచ్చు.