ABN RK : ” ప్రభుత్వ ఏజెన్సీ లతో వివిధ కంపెనీలను టేక్ ఓవర్ చేసుకున్న ఆదాని… ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.. మునుముందు ఇంకా పతనమవుతారు.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ పురస్కారానికి ఎంపికయింది కానీ… జగన్ నట విశ్వరూపాన్ని కూడా ఆస్కార్ కమిటీ పరిధిలోకి తీసుకోవాలి.. కే. విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన కళాఖండాలు నిర్మించారు.. ఆయన చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నాడు. కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా” ఇలా సాగిపోయింది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకు.

గత వారం ఎందుకనో కొత్త పలుకు రాయని రాధాకృష్ణ.. ఈసారి మాత్రం రకరకాల కోణాలను ఎంచుకున్నాడు. తన మిత్రుడు చంద్రబాబుకు శత్రువు అయిన జగన్ పై ఈసారి వ్యంగ్య బాణాలు వదిలాడు. బాబాయ్ ని హత్య చేసిన జగన్, కోడి కత్తితో సింపతి క్రియేట్ చేసుకున్న జగన్.. ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాంపర్ చేస్తున్న జగన్ పరిపాలనకు పనికిరాడని తేల్చేశాడు. జగన్మోహన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి హుకుం జారీ చేశాడు. అంతేకాదు జగన్ తాను చేసిన పాపాలకు ప్రయాశ్చిత్తంగా హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నాడని బాంబు పేల్చాడు.. ఫర్ డిబేట్ సేక్… శుద్ధ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు వింటున్నాడని పదేపదే రాధాకృష్ణ ఆరోపిస్తున్న నేపథ్యంలో జగన్ తన సన్నిహితులతో మాట్లాడుతున్న మాటలు రాధాకృష్ణకు ఎలా తెలుస్తున్నాయి? తాడేపల్లిలో ఏమైనా సీక్రెట్ కెమెరాలు పెట్టాడా? లేక ధ్రువ సినిమాలో రామ్ చరణ్ శరీరంలో అరవింద్ స్వామి మాదిరి ఏమైనా బగ్ పెట్టాడా?
కాశీనాధుని విశ్వనాధ్.. తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడు.. ఆయన తీసిన ఒక్కొక్క సినిమా కళాఖండం.. ఆయన సృష్టించిన బెంచ్ మార్క్ ఎవరూ అందుకోలేరు. అటువంటి దిగ్గజ దర్శకుడు కన్నుమూస్తే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదు.. అప్పట్లో హరికృష్ణ చనిపోయినప్పుడు, కృష్ణ కన్నుమూసినప్పుడు, కృష్ణంరాజు కాలం చేసినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. గొప్ప విషయమే ఇది.. కానీ ఎందుకనో కెసిఆర్ విశ్వనాధ్ విషయంలో ఉదారత చూపలేకపోయారు. ఇదే విషయాన్ని ఆర్కే తన కొత్త పలుకులో తూర్పారబట్టారు.. కెసిఆర్ కు కళాకారులంటే గౌరవం లేదని విమర్శించారు..
ఇక ఆదానీ షేర్ల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో రాధాకృష్ణ విరుచుకుపడ్డారు.. అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులు ఎప్పుడూ నిలబడలేవని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వ ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని ఇతర కంపెనీలను టేక్ ఓవర్ చేసారని, ఇప్పుడు పాపం పండిందని నేరుగానే వ్యాఖ్యలు చేశారు.. ఆదానీని వెనకేసుకొస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి మూల్యం చెల్లించుకుంటారని జోస్యం చెప్పారు. ప్రభుత్వ అధినేతగా ఉండి ఒక వ్యాపారిని వెనకేసుకురావడం ఏంటని ప్రశ్నించారు.. ఆదోని షేర్లు పతనం అవుతున్ననాటి నుంచి నేటి వరకు ఎంత మంది ఆస్తులు కరిగిపోయాయో లెక్క చెప్పిన ఆర్కే.. షేర్లు పతనమైతే నష్టపోయేది బ్యాంకులు, సామాన్యులేనని ఆర్కే వాపోయారు.. అయితే కేసీఆర్, లేకుంటే జగన్ పై విరుచుకుపడే రాధాకృష్ణ.. ఈసారి నరేంద్ర మోడీని, ఆదానిని వదిలిపెట్టలేదు.. మొత్తానికి ఒక్క వ్యాసంలో రకరకాల యాంగిల్స్ చూపించారు.. జగన్ కు ఆస్కార్ అడిగే రాధాకృష్ణ.. తనకు తాను పులిట్జర్ అవార్డు కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోకూడదు?!