Connect Movie Review: నటీనటులు: నయనతార, అనుపమ్ కేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనీయానసీఫా, సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్, సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్, కథ; అశ్విన్ శరవణన్, కావ్యా రామ్ కుమార్, కూర్పు: రిచర్డ్ కెవిన్, సినిమాటోగ్రఫీ: మణికంఠన్ కృష్ణమాచారి, నిర్మాత: విగ్నేష్ శివన్, విడుదల చేసిన వారు: యువి క్రియేషన్స్, దర్శకత్వం: అశ్విన్ శర్వవణన్

దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతారకు హారర్ సినిమాలు కొత్తేమీ కాదు. మాయ, మయూరి, డోరా, ఐరా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆమె అలరించింది. వాస్తవానికి హర్రర్ సినిమా అంటే భయం ఒకటే కాదు… ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ కూడా ఉండాలి.. అప్పుడే ఆ సినిమా విజయవంతం అవుతుంది. కోవిడ్ ప్రబలిన తర్వాత ఓటీటీ లు మన గుమ్మంలోకి చొచ్చుకు వచ్చాయి. ఈ క్రమంలో కొత్త తరహా సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చాయి.. వాటిల్లో హర్రర్ సినిమాలదే ప్రధాన భాగం. అయితే ఇప్పుడు వాటి జోరు తగ్గినప్పటికీ… అప్పుడప్పుడు ఆ తరహా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాయి.. అయితే ఇటీవల తెలుగులో హర్రర్ కథాంశం నేపథ్యంలో వచ్చిన మసూద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో హరర్ చిత్రం కనెక్ట్. ఇందులో నయనతార లీడ్ రోల్లో నటించగా… ఆమె భర్త విగ్నేష్ శివన్ నిర్మాతగా వ్యవహరించాడు. గతంలో నయనతారతో పలు హారర్ సినిమాలు తీసిన అశ్విన్ దర్శకత్వం వహించాడు.. దీంతో ఈ సినిమాకి మార్కెట్లో మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిందా? లేదా? అనేది తెలుసుకుందాం.
-సినిమా కథ ఏంటంటే
జోసెఫ్ బెనాయ్ ( వినయ్ రాయ్), సుసాన్ ( నయన తార) భార్యా భర్తలు. వీరికి అమ్ము ( హనియా నసీఫా) అనే కూతురు ఉంటుంది. ఆమెకు చిన్నప్పటినుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ ప్రతిభతో లండన్ లోని హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్లో సీటు సాధిస్తుంది.. దీంతో ఆ కుటుంబం మొత్తం ఆనంద డోలికల్లో మునిగి తేలుతుంది . జోసెఫ్ వృత్తిరీత్యా వైద్యుడు.. కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తూ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి కన్నుమూయడంతో అమ్ము కుంగిపోతుంది.. మరణించిన తండ్రి తో మాట్లాడాలని ఆ న్ లైన్ లో వుయిజా బోర్డ్ ను ఆశ్రయిస్తుంది. అది వికటించి ఆమెను ఒక దుష్ట శక్తి ఆవహిస్తుంది. మరి తన కుమార్తె శరీరంలో మరొకరి ఆత్మ ఉందనే విషయం సుసాన్ కు ఎప్పుడు తెలిసింది? దాని నుంచి ఆమెను ఎలా కాపాడుకుంది? దీనికి సుసాన్ తండ్రి ఆర్ధర్ (సత్య రాజ్) ఎలా సహాయ పడ్డాడు? అమ్మును కాపాడేందుకు భూత వైద్యుడు ఫాదర్ అగస్టీన్ ( అనుపమ్ ఖేర్) ఎలాంటి తోడ్పాటు అందించాడు అనేది మిగతా కథ.

-విశ్లేషణ
హరర్ సినిమాలు ప్రేక్షకులను సీటు చివరి అంచులో కూర్చోబెట్టాలి. అలాగని భయం ఒకటే సరిపోదు. కథ కూడా కావాలి.. అయితే ఈ సినిమాలో కోవిడ్ నేపథ్యాన్ని దర్శకుడు తీసుకున్న విధానం బాగుంది.. పాత కథకి కోవిడ్, ఆధునిక సాంకేతికతను మేళవించి కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.. ఇందులో అక్కడక్కడ దర్శకుడి ప్రయత్నాన్ని తప్పకుండా ఉండలేం.. అయితే ఇదే ఒరవడిని మా మొత్తం కొనసాగించి ఉంటే బాగుండేది.. ఆరంభ సన్నివేశాలు కొత్త అనుభూతి కలిగించినప్పటికీ… సినిమా వెళ్తున్న కొద్ది ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లుతుంది.. కోవిడ్ లాక్ డౌన్ కాలాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు, ఒకరిని ఒకరు కలిసే వీలు లేకపోవడం, కేవలం సెల్ ఫోన్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితుల్ని ఈ కథకు దర్శకుడు బాగా కనెక్ట్ చేశాడు.. సినిమా మొత్తం వీడియో కాల్ లో సాగుతున్నట్టే కనిపిస్తుంది. కథ సాగే పరిధి నాలుగు గోడలకే పరిమితమైనప్పటికీ అందులో నుంచే భయం పుట్టించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే ఇది అక్కడక్కడ సఫలమైంది కూడా .. ప్రారంభ సన్నివేశాలు, ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భయపెడతాయి.. భావో ద్వేగాల తో ముడి పడిన ఇటువంటి కథని ప్రేక్షకులకు సరికొత్తగా చూపాలంటే దానికి బలమైన స్క్రీన్ ప్లే అవసరం. ఈ సినిమాలో అదే లోపించింది. ఈ సినిమాలో అమ్మును ఆవహించిన ఆత్మకు బలమైన బ్యాక్ స్టోరీ లేకపోవడం గమనార్హం. మరో వైపు సినిమా కథ కూడా అర్ధాంతరంగా ముగిసినట్టు అనిపిస్తుంది.
-ఎలా చేశారంటే
ఈ సినిమాకు ప్రధాన బలం నయనతార. యుక్త వయసు ఉన్న అమ్మాయికి తల్లిగా నటించి మెప్పించింది.. ఆమె తన పాత్రలో ఒదిగిపోయారు.. కానీ నటించేందుకు పెద్దగా ఆస్కార లేదు.. అమ్ముగా నటించిన హనియా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. వినయ్ రాయ్ కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ తన భావోద్వేగాలతో కట్టిపడేశారు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు.. ముఖ్యంగా సౌండ్ డిజైన్, కెమెరా పనితనం ఈ సినిమాకు ప్రధాన బలం.. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ… దానిని సినిమాగా నడిపించిన విధానంలో ఎందుకో బలం కనిపించలేదు..
-బలాలు: కథ, భయపెట్టే సన్నివేశాలు, నయనతార, హానియా, సత్య రాజ్, అనుపమ్ ఖేర్ నటన, కోవిడ్ నేపథ్యం
-బలహీనతలు
ప్రాధాన్యం లేని నయనతార పాత్ర, అర్ధాంతరంగా ముగిసే కథ.
బాటమ్ లైన్: అంతగా కనెక్ట్ కాని సినిమా
రేటింగ్: 2.5/5