Congress – YCP : వైసీపీ నేతలకు టచ్ లోకి కాంగ్రెస్ హై కమాండ్?

మొత్తానికైతే వైసీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చిన మరుక్షణం.. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : January 8, 2024 9:34 am
Follow us on

Congress – YCP : ఏపీలో ఎలా పాగా వేయాలి? ఏ పార్టీని బలహీనం చేస్తే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది? అంటే ముమ్మాటికి వైసిపి పేరే వినిపిస్తోంది. పేరుకే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ.. అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ నాయకులే. కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లే వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. అందుకే వైసిపి పతనమైతే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఆశిస్తున్నారు. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించనున్నారు. దీంతో ప్రథమ గురి జగన్ మీదేనని తెలుస్తోంది. దానిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ధ్రువీకరించారు.

ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఎవరెవరు కాంగ్రెస్ లో చేరతారని చర్చలు ప్రారంభమయ్యాయి. రాజశేఖర్ రెడ్డి తో సమకాలీకులు చాలామంది ఉన్నారు. వారు వేరే ప్రత్యామ్నాయం లేక జగన్ వెంట నడుస్తున్నట్లు ఎప్పటి నుంచో ఒక ప్రచారం ఉంది. వారు జగన్ వద్ద తగిన గుర్తింపు, గౌరవం లేక సతమతం అవుతున్నారని.. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం జగన్ చేస్తున్న మార్పులు చాలామంది సీనియర్లకు మింగుడు పడడం లేదు. వద్దని వారిస్తున్నా జగన్ వినకపోవడంతో చాలామంది వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల వరకు వేచి చూద్దామని.. ఫలితాల తరువాత నిర్ణయం తీసుకుందామని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

తాజా పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ బలపడేందుకు చేజేతులా జగన్ సాయం చేస్తున్నట్లు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో.. వారు కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛను గుర్తు చేసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించినా.. 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే టిక్కెట్ రాకపోయినా చాలామంది బాధపడడం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి చేతులు కాల్చుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీయే తమకు సరైన వేదిక అని చాలామంది సీనియర్లు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా మొదలుకొని అనంతపురం వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులందరికీ మళ్లీ ఇప్పుడు ఆహ్వానాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, ఆనం రామనారాయణరెడ్డి, జెసి బ్రదర్స్.. ఇలా చాలామందికి హై కమాండ్ పెద్దలు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో టిడిపిలో ఉన్నవారిపై ఒత్తిడి లేకపోయినా.. వైసీపీలో కొనసాగుతున్న వారికి మాత్రం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ లో పని చేసిన వారంతా మంత్రి బొత్స, ధర్మాన లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల అనంతరం.. ఫలితాలను అనుసరించి నిర్ణయం తీసుకుందామని వారు అనునయిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చిన మరుక్షణం.. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.