Telangana Elections 2023: ఖమ్మం పది నియోజకవర్గాల్లో పోటాపోటీ.. ఎవరో మేటి?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితికి కేవలం ఒక్క సీటు మాత్రమే లభించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 21, 2023 1:34 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: మరో 9 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. అధికార భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా విస్తృతంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు కూడా ప్రచారంలో నిమగ్నమైపోయారు. బిజెపి నుంచి బండి సంజయ్ తో పాటు ఇతర జాతీయస్థాయి నాయకులు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచార పర్వంలో తలమునకులయ్యారు.. తెలంగాణ రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే అందులో అందరి దృష్టి ప్రధానంగా ఆకర్షించేది ఉమ్మడి ఖమ్మం జిల్లా.

పది అసెంబ్లీ నియోజకవర్గాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితికి కేవలం ఒక్క సీటు మాత్రమే లభించింది. కొత్తగూడెంలో పోటీ చేసిన జలగం వెంకట్రావు అప్పటి తన సమీప వైఎస్ఆర్సిపి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు పై విజయం సాధించారు.. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఏకంగా మూడు స్థానాలు దక్కించుకుంది.. పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, వైరా నుంచి బానోత్ మదన్లాల్, అశ్వరావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఇక భద్రాచలం నుంచి కమ్యూనిస్టు అభ్యర్థి సున్నం రాజయ్య గెలుపొందారు. పాలేరు స్థానంలో రాంరెడ్డి వెంకటరెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ విజయం సాధించారు. ఇల్లందు స్థానంలో కోరం కనకయ్య గెలుపొందారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు.. ఇక సత్తుపల్లి స్థానంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన పువ్వాడ అజయ్ కుమార్, వైఎస్ఆర్సిపి నుంచి విజయం సాధించిన బానోత్ మదన్లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు గులాబీ పార్టీలో చేరారు. ఇక 2018 ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కేవలం ఖమ్మం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలంలో పోదెం వీరయ్య, మధిరలో భట్టి విక్రమార్క, పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందులో బానోత్ హరిప్రియ , పినపాకలో రేగా కాంతారావు విజయం సాధించారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా.. భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య మినహా మిగతా వారంతా అధికార భారత రాష్ట్ర సమితిలో చేరారు. అప్పటి ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు సత్తుపల్లి, అశ్వరావుపేట స్థానాల నుంచి విజయం సాధించారు. వైరా అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ గెలుపొందారు. తదుపరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వెంకట వీరయ్య, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వరరావు కూడా కారు పార్టీలో చేరిపోయారు.

ప్రస్తుతం ఎలా ఉందంటే

ఖమ్మం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పువ్వాడ అజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఈయన గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. తుమ్మలకు పాలేరు టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు మధ్య, పువ్వాడ అజయ్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే కావడంతో పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. తాను చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ఉపేందర్ రెడ్డి నమ్ముతున్నారు. మరోవైపు అధికార భారత రాష్ట్ర సమితి చేసిన తప్పిదాలే తన విజయానికి సోపానం అవుతాయని శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నారు.. మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కామల్రాజ్ పోటీ పడుతున్నారు. కమల్ రాజ్ ఈ నియోజకవర్గంలో పలుమార్లు పోటీ చేసినప్పటికీ ఆయనకు ఓటములే ఎదురయ్యాయి. అయితే ప్రభుత్వ పథకాలు, చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని కమల్ రాజ్ నమ్ముతున్నారు. సీఎల్పీ నాయకుడిగా ప్రజా సమస్యలపై తాను చేసిన పోరాటమే మరోసారి విజయాన్ని కట్టబెడుతుందని భట్టి విక్రమార్క భావిస్తున్నారు. సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి నుంచి సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ మట్టా రాగమయి పోటీలో ఉన్నారు.. ఈ నియోజకవర్గంలో సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో తాను విజయం సాధిస్తానని రాగమయి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేసిన అభివృద్ధి పనులు తన గెలుపునకు నాంది పలుకుతాయని భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య భావిస్తున్నారు. వైరా నియోజకవర్గం నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా మదన్ లాల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాందాస్ నాయక్ పోటీలో ఉన్నారు. ఇక్కడ రాందాస్ నాయక్ పై చేయిగా ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఒకింత నైరాశ్యంలో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇక్కడ అధికార పార్టీ నాయకులు కూడా రాందాస్ నాయకులు ప్రచారం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇల్లందు స్థానంలో అధికార పార్టీ అభ్యర్థిగా బానోత్ హరి ప్రియ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోరం కనకయ్య బరి లో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. ఎవరు విజయం సాధించినా కేవలం 5000 ఓట్ల లోపే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రాచలం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోదెం వీరయ్య, అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా తెల్లం వెంకటరావు పోటీలో ఉన్నారు. అయితే మరోసారి కూడా భద్రాచలం ఓటర్లు వీరయ్య వైపే మొగ్గు చూపుతున్నారని వివిధ సర్వేల ద్వారా తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు, కమ్యూనిస్టు అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ కూనంనేని సాంబశివరావు, వెంకట్రావు మధ్య ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆశ్వారావు పేట నియోజకవర్గం లో అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జారే ఆదినారాయణ పోటీలో ఉన్నారు. వీరిలో ఆదినారాయణ కొంచెం మొగ్గు కనిపిస్తోందని సర్వేల ద్వారా తెలుస్తోంది. పినపాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా రేగా కాంతారావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ కొనసాగుతోందని సర్వేల ద్వారా తెలుస్తోంది. అయితే విజయం పట్ల ఇద్దరు అభ్యర్థులు ఆశాభావంతో ఉన్నారు.