Revanth vs Mallareddy : రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. ఇద్దరు నాయకులు టిడిపిలో ఉన్నప్పుడే పొసిగేది కాదు. వారిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకునేవారు. ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడుకు చాలా ఇబ్బందిగా ఉండేది అని టిడిపి నాయకులు అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నాయకులు టిడిపిని విడిపోయి ఒకరు భారత రాష్ట్ర సమితిలో, మరొకరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయిప్పటికీ ఇద్దరి మధ్య భూములకు సంబంధించి వివాదాలు కొనసాగాయి. మల్లారెడ్డి పేద ప్రజల భూములు ఆక్రమించాడు అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తే.. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ అని మల్లారెడ్డి ఆరోపించారు. ఆ మధ్య ఒక భూమి విషయంలో ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకున్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్లారెడ్డి తాజాగా రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే మల్లారెడ్డి పై చేశారు. అయితే ఇటీవల ఎన్నికల్లో మల్లారెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే ఆయన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మల్లారెడ్డి మాజీ మంత్రి అయ్యారు. కేవలం ఎమ్మెల్యే గానే మిగిలిపోయారు. అటు రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇదే సందర్భంలో వారిద్దరి మధ్య ఉన్న వైరాన్ని విలేకరులు ప్రశ్నిస్తే.. రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు అని మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ మాటలకు రేవంత్ రెడ్డి కరిగినట్టు లేరు. అందుకే మల్లారెడ్డి ఆక్రమించిన భూములకు సంబంధించి రికార్డులను తిరగదోడుతున్నట్టు తెలిసింది.
ఇక మల్లారెడ్డి వ్యవహారం పై రేవంత్ దృష్టిసారించడంతో.. పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారని బాధితులు ఏకంగా ప్రజాభవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంతేకాదు మల్లారెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అధికారులకు సమర్పించారు. అయితే వాటి ఆధారంగా తదుపరి చర్యలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మల్లారెడ్డి ఎన్ని భూములు కొనుగోలు చేశారు? అవి ఎవరి పేరు మీద ఉన్నాయి? గతంలో ఆ భూమికి సంబంధించి ఎవరు ఆధీనంలో ఉన్నారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
అయితే రేవంత్ రెడ్డి ఎలాగో తన భూములకు సంబంధించిన గుట్టు విప్పుతాడు కాబట్టి.. ముందుగానే మల్లారెడ్డి మేల్కొన్నారు అని తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి నుంచి గట్టిగా కాచుకోవాలంటే జాతీయ స్థాయిలో పలుకుబడి అవసరమని మల్లారెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. అందుకే మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే ఆయన తన అల్లుడు గెలిచిన మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ స్థానం నుంచి రేవంత్ రెడ్డి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో 2023 లో జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి.. గెలిచిన అనంతరం రేవంత్ రెడ్డిని జాతీయస్థాయి పలుకుబడితో కాచుకోవాలని ఆలోచనతో మల్లారెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఏంతో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే భారత రాష్ట్ర సమితి పెద్దలతో మల్లారెడ్డి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.