TRS Party: ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రేతాస్తు’ అన్నట్లు ఎక్కడ మహిళలు గౌరవింప బడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మహిళ కంట కన్నీరొలికితే అందరికీ అరిష్టమే.. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎప్ పార్టీలో మహిళా నేతలకు వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. పురుషాధిక్య పార్టీలో ఆమెకు గౌరవం దక్కడం లేదు.. మహిళలకు కేసీఆర్ ఓ అన్నలా.. ఆడ పిల్లలకు తండ్రిలా.. వృద్ధులకు కొడుకులా ఉంటాడని చెప్పుకునే ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు.. పార్టీలో మహిళలకు ఎదురవుతున్న పరాభవంపై మాత్రం నోరు మెదపడం లేదు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి తనయుడు కె.తారకరామారావు మహిళా నేతలను అవమానించే వారిని కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవు. దీంతో గులాబీ గూటిలో మహిళా నేతలకు కన్నీరే మిగులుతోంది.

సాధారణంగా టీఆర్‌ఎస్‌లో పురుషాధిక్యం ఎక్కువ. మహిళ అంటే తన కూతురు కవిత మాత్రమే అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తారని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. పార్టీలో ఏ మహిళా నాయకులకు కనీస గౌరవం ఇవ్వరన్న విమర్శ కూడా తెలంగాణ తొలి ప్రభుత్వం చూశాక వచ్చింది. 2014 నుంచి 2018 వరకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సత్యవతి రాథోడ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ గూటికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు.
Also Read: YSRCP Leaders: నా చావుతోనైనా జగన్ తీరు మారుతుందా?
-తాజా పరిణామాలు దేనికి సంకేతం…
మహిళలు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు ఎనలేని గౌరవం అని చెప్పుకునే గులాబీ నాయకులు తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. వారిచ్చే గౌరవం ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గౌవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌ను ఏడాదిగా వివిధ రకాలుగా ఇబ్బంది పెడతున్నారు. కనీసం రాజ్యాంగ పరమైన ప్రొటోకాల్ కూడా కల్పించడం లేదు. గులాబీ పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారనుకుంటే.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారని గవర్నర్ తమిళిసై ఇటీవల ఢిల్లీలో స్వయంగా ప్రకటించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తెలంగాణలో పరిణామాలపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాకు నివేదిక ఇచ్చారు. దీంతో గులాబీ నేతలు గవర్నర్‌పై విమర్శల దాడి పెంచారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మొదలు.. మంత్రులు జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు చాలామంది వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తెలంగాణలో తనకు గవర్నర్‌గా కాకపోయినా.. కనీసం మహిళగా, ఒక సోదరిగా కూడా గౌరవం దక్కడం లేదని చెప్పడం గులాబీ నేతలు గవర్నర్‌కు ఎంత గౌరవం ఇస్తున్నారో అర్థమవుతోంది.

మహబూబాబాద్ ఎంపీ, మహబూబాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాలోతు కవితకు ఆ పార్టీ ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమలో మంత్రుల సమక్షంలోనే ఘోర అవమానం జరిగింది. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట కవిత అధ్యక్షతన యాసంగి ధాన్యం కొనుగోలుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో కవిత ప్రారంభోపన్యాసం చేస్తుండగా… మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వేదికపైకి వచ్చి అందరూ చూస్తుండగానే మైక్ లాక్కున్నారు. ‘నేను అధ్యక్షురాలిని.. నేను మాట్లాడుతున్నా’ అని సునీత వారించినా వినకుండా శంకర్‌నాయక్ మైక్ లాక్కుని తన ప్రసంగం ప్రారంభించారు. అక్కడే ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ చూస్తుండిపోయారు. మరోవైపు శంకర్‌నాయక్ అనుచరులు ‘శంకరన్న జిందాబాద్.. శంకరన్న నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినదించారు… అంటే మహిళా నేతను అవమానించినందుకు శంకర్‌నాయక్‌కు జయ జయ ధ్వానాలు పలికారా అన్న అనుమానం కలుగుతోంది.
–భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కేంద్రం కొనాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయడంతోపాటు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, పాలకవర్గ సభ్యులు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సీతాలక్ష్మి తన కుమారుడి బైక్‌పై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వారి వాహనం వెనుక బైక్‌పై వస్తూ రెండుసార్లు ఢీకొట్లారు. ఈ విషయం గమనించిన సీతాలక్ష్మి ‘అన్నా నేను మహిళను.. దండం పెడతా అంటూ బతిమిలాడినా..’ వినకుండా యూసుఫ్ మరోసారి తన బైక్ తో సీతాలక్ష్మి కూర్చున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ సందర్భంగా ఆమె కిందపడ్డారు. ఇక్కడ కూడా కొంతమంది సీతాలక్ష్మికి మద్దతుగా నిలవగా.. మరికొంతమంది యూసుఫ్‌కు అండగా నిలిచి.. కాకతాళీయంగా జరిగిందని పేర్కొన్నారు. బాధితురాలు స్వయంగా తనను కావాలనే ఢీకొట్టాడని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు.
-రెండు నెలల క్రితం నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఇందుకు అన్నపూర్ణ అనే ఓ మహిళా నాయకురాలు సహకరించారు. మహిళ వెంట ఒకసారి వైస్ చైర్మన్ వద్దకు వచ్చిన బాలికపై సాజిద్ కన్నేశారు. ఆమెను తన వద్దకు తీసుకురావాలని మహిళకు సూచించారు. సదరు మహిళ బాలికకు మాయమాటలు చెప్పి బాలికను హైదరాబాద్‌కు తీసుకెళ్లి సాజిద్‌కు అప్పగించింది. అక్కడ వైస్ చైర్మన్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
-కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ అకృత్యాలు ఆ జిల్లాలో లెక్కేలేదు. మహిళలు అంటే రాఘవకు లోకువ. ఇటీవల పాల్వంచ రామకృష్ణ తన కుటుంబంలో ఆస్తి తగాదా విషయమై రాఘవను ఆశ్రయించారు. అప్పటికే రామకృష్ణ సోదరితో సంబంధం నెరుపుతున్న రాఘవ.. బాధితుడు రామకృష్ణ భార్యపై కూడా కన్నేశాడు. అవసరం కోసం వెళ్లిన రామకృష్ణను నీ భార్యను నా దగ్గరకు పంపించు అని సూచించారు. దీనిని తట్టుకోలేకపోయిన రామకృష్ణ తనకు జరిగిన అవమానాన్ని వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవన్నీ కొన్ని మచ్చుకు మాత్రమే.. వెలుగులోకి రాని అనేక సంఘటనలు, బాధితులు వందల సంఖ్యలో గులాబీ పార్టీలో ఉన్నారు. కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదంపై స్పందించిన కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత సొంత రాష్ట్రంలో.. సొంత పార్టీ నాయకులు మహిళా నేతలతో ప్రవర్తిస్తున్న తీరుపై.. మహిళలపై చేస్తున్న అఘాయిత్యాలపై మాత్రం ఎన్నడూ నోరు విప్పకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read:Power cuts in AP: ముందు చూపు లేక ఏపీని ‘అంధకారం’లోకి నెట్టారా?