Nara Lokesh : లోకేష్ కు షాక్.. 10న విచారణకు రావాల్సిందే

తాజాగా హైకోర్టు ఈనెల 10 వరకు లోకేష్ కు అవకాశం ఇవ్వడంతో.. ఈనెల 9 వరకు లోకేష్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : October 3, 2023 8:20 pm

258916-nara-lokesh

Follow us on

Nara Lokesh : నారా లోకేష్ కు హైకోర్టు షాకిచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసులో లోకేష్ ను సిఐడి ఏ14 నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ముందస్తు బెయిల్ కు లోకేష్ హైకోర్టు ను ఆశ్రయించారు. కానీ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. విచారణకు సహకరించాలని లోకేష్ కు కోర్టు ఆదేశించింది. 41 ఏ నోటీసులు జారీ చేసి విచారించాలని సిఐడిని ఆదేశించింది. ఈ తరుణంలో సిఐడి ఢిల్లీ వెళ్లి లోకేష్ కు నోటీసులు ఇచ్చింది. హెరిటేజ్ లో షేర్ హోల్డర్ కాబట్టి.. ఆ సంస్థకు సంబంధించి నగదు లావాదేవీలు, ఇతరత్రా వివరాలతో రావాలని లోకేష్ కు సిఐడి అధికారులు సూచించారు.

అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లోకేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని ఆయన తరుపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. లోకేష్ కు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఆ వివరాలు లోకేష్ ను కోరడం సమంజసం కాదని చెప్పుకొచ్చారు. అయితే తాము డాక్యుమెంట్లపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని.. ఈనెల నాలుగున లోకేష్ యధావిధిగా విచారణకు హాజరుకావాలని సిఐడి తరఫున కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈనెల 10న లోకేష్ ను సిఐడి విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 10న లోకేష్ ను న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారణ చేపట్టాలని సూచించింది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని.. కోర్టు నిబంధనలు పక్కాగా పాటించాలని ఆదేశించింది. ఇప్పటికే లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. తొమ్మిదో తేదీకి విచారణ వాయిదా పడింది. ఆరోజు కేసులో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. తాజాగా హైకోర్టు ఈనెల 10 వరకు లోకేష్ కు అవకాశం ఇవ్వడంతో.. ఈనెల 9 వరకు లోకేష్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.