Chiranjeevi Jagan: 2024 ఎన్నికలు ఏపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే బలమైన వైసీపీ ఒకవైపు.. బలహీనంగా మారిన టీడీపీ.. ఏపీలోని ఇతర పక్షాలైన జనసేన-బీజేపీ కలిసి సాగేందుకు ఇప్పటి నుంచే ప్లాన్లు చేస్తోంది. ఈ మూడు పార్టీలు కలిస్తే ‘కాపు ఓటు బ్యాంకు’ మొత్తం వీరికే టర్న్ అవుతుంది. ఏపీలో అత్యధిక శాతం ఉండి.. రాజకీయాలను శాసించేలా ఉన్న కాపులు దూరమైతే అధికార వైసీపీకి గడ్డు కాలమే.. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ కు విరుగుడుగా ఆయన సోదరుడు చిరంజీవిని మచ్చిక చేసుకోవడానికి జగన్ ప్లాన్ చేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

అయితే సినిమా టికెట్ల వివాదంపై జగన్ ను కలిశానని చిరంజీవి ఎంత మొత్తుకుంటున్నా.. ఓ వర్గం మీడియా మాత్రం చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకే జగన్ పిలిపించారని లీకులు ఇచ్చింది. టీడీపీ-జనసేన పొత్తును ఎదుర్కోవడానికి జగన్ ఇదొక బలమైన వ్యూహంగా కూడా భావిస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి.
ఈ వార్తలపై చిరంజీవి స్పందించారు. తాను రాజ్యసభ టికెట్ కోసం అలాంటి ఆఫర్ ను ఆశించి రాలేదని.. అలాంటి వాటికి అంగీకరించనని.. తాను రాజకీయాల్లోంచి ఎప్పుడో వైదొలిగానని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అధికార వైసీపీ తనకు ఎలాంటి ఆఫర్ ఏమీ ఇవ్వలేదని చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో చిరు రాజ్యసభ ఊహాగానాలకు తెరపడింది.
అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు చిరంజీవి ఒప్పుకుంటే సినిమా టికెట్ల వివాదంతోపాటు రాజ్యసభ ఆఫర్ ను కూడా జగన్ చేశాడని.. కానీ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం చిరంజీవి లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.
దీంతో జగన్ చిరంజీవి మధ్య కేవలం సినిమా టికెట్ల వివాదంపైనే సాగినట్టు తెలుస్తోంది. అనుకున్న కార్యం జరగకపోయేసరికి జగన్ కూడా సినిమా టికెట్ల వివాదంపై హామీ ఇవ్వనట్టు తెలిసింది. ఇలా చిరు-జగన్ భేటి అసంతృప్తిగా ముగిసినట్టు తెలుస్తోంది.