Chess Olympiad 2022: చదరంగం.. వెనుకటి మన రాజులు , రాజ్యాలు ఉన్నప్పుడు పుట్టింది ఈ ఆట.. ఎలాగైతే పక్కరాజ్యాలపై మనవాళ్లు వ్యూహాలతో దండెత్తుతారో.. ఆ ఆలోచనల్లోంచే ఈ ఆట పుట్టిందంటారు. చదరంగం ఆడేవారికి మైండ్ పవర్ ఎక్కువగా ఉంటుందన్నది ఓ వినికిడి.

-చదరంగం ఎలా పుట్టింది?
చదరంగం ఆట ఎక్కడ ఎప్పుడు పుట్టిందన్నది చారిత్రకంగా కొంచెం విభేదాలున్నాయి. వివిధ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. భారత్ లోనే పుట్టిందని చాలా మంది చరిత్రకారులు చెబుతున్నారు. చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. భారతదేశంలోనే ఈ ఆట ప్రాణం పోసుకుందని చరిత్ర చెబుతోంది.
మన పురాణ ఇతిహాసాల్లో చదరంగం గురించిన ప్రస్తావన ఉంది. దీన్ని చతురంగ అని పిలిచేవారు. ఇక్కడి నుంచి మనల్ని ఓడించి పాలించిన ‘పర్షియా’కు ఇది వ్యాపించిందని.. అక్కడి నుంచి వారిని ఓడించిన అరబ్స్, దక్షిణ యూరప్ దేశాలకు ఈ ఆట వెళ్లిందని సమాచారం. వర్ధమాన ఆట యూరప్ లో 15వ శతాబ్ధంలో రూపుదిద్దుకుంది. 1886లో మొట్టమొదటి ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ ను నిర్వహించారు.

భారత్ లో పుట్టిన ఈ ఆటకు ఇప్పుడు ప్రభ లేకుండాపోయింది. విశ్వనాథన్ ఆనంద్ లాంటి దిగ్గజ చెస్ ఆటగాళ్లు, హంపి సహా బాల మేధావులు ప్రతిభ చాటుతున్నా ఇప్పటికీ ప్రాచుర్యం లేదు. కానీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం, అక్కడి ఐఏఎస్ ఉన్నతాధికారుల చొరవతో ‘చదరంగానికి’ మునుపటి ఖ్యాతా వస్తోంది. వారి ఆదరణ అందరినీ ఉప్పొంగేలా చేస్తోంది.
ఒకరి ఆలోచనకు పోటీగా మరొకరు పోటీపడుతూ.. ఎత్తులకు పై ఎత్తులు వేసే చెస్ క్రీడ ఆసక్తిగా ఉంటుంది.. మాస్ట్రో మైండ్ సెట్ ఉన్న వాళ్లే చెస్ లో రాణిస్తారు.. అలా తన మేధస్సును కూడబెట్టి..ఆలోచనలకు పదును పెట్టిన విశ్వనాథ్ ఆనంద్ ప్రపంచ విజేతగా నిలిచారు.. ఆయనను ఆదర్శంగా తీసుకొని మరికొందరు ముందుకు వెళ్తున్నారు.. చెస్ క్రీడ గురించి పూర్తిగా తెలియనందువల్ల చాలా మంది ఈ క్రీడపై ఆసక్తి చూపరు. ఎందుకంటే అది నేర్చుకోవడం కొంచెం కఠినమే. అందుకే అందరికీ అర్థం కాదు. దీంతో ఈ క్రీడల నిర్వహణ స్పాన్షర్స్ ముందుకు రారు. కానీ తమిళనాడు రాష్ట్రం మాత్రం చెస్ క్రీడల్ని పండుగలా నిర్వహిస్తోంది. తనకు అవకాశం వచ్చిన ఏ ఈవెంట్ ను వదులుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రపంచ క్రీడలను తన భూభాగంపై నిర్వహించేందుకు అవకాశం చేజిక్కించుకుంది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే చెస్ ఒలంపియాడ్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోంది.

44వ చెస్ ఒలింపియాడ్ ను జూలై 29న చెన్నైలో ప్రారంభించారు. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. 44వ ఒలింపియాడ్ లో 187 దేశాలు పాల్గొంటున్నాయి.. ఇందులో ఆరు భారత జట్లు ఉన్నాయి. ఒక్కో విభాగంలో మూడు జట్లు పాల్గొంటాయి. ఈసారి విశ్వనాథ్ ఆనంద్ బరిలో లేరు. యువ చెస్ క్రీడాకారులకు మెంటార్ పాత్రను నిర్వహిస్తున్నాడు. గత ఎనిమిదేళ్లలో భారత్ నుంచి చెస్ క్రీడాకారులు పెరిగారు. దేశ వ్యాప్తంగా 33 వేల మంది అంతర్జాతీయ రేటింగ్ పొందిన వాళ్లు ఉన్నారు. అంతర్గత తగాదాలు, వివాదాలు ఉన్నప్పటికీ చెస్ సమాఖ్య గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకుంటోంది.
ఉక్రెయియ్ తో యుద్ధం కారణంగా చెస్ ఒలంపియాడ్ నుంచి రష్యా వైదొలగింది. దీంతో రష్యాలో నిర్వహించాల్సిన 44వ చెస్ ఒలంపియాడ్ ను నిర్వహించే అవకాశాన్ని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ దక్కించుకుంది. అయితే ఈ సమయంలో స్పాన్సర్లు, ఈవెంట్ ను మేనేజ్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ చెస్ ను నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
కేంద్రప్రభుత్వం సహకారంతో అంతర్జాతీయ చెస్ ను నిర్వహించేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. అలాగే 180 దేశాలకు చెందిన ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేశారు. ఇక ఈ ఈవెంట్ ను ప్రచారం చేసుందుకు తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను వాడుకుంది. పాల ప్యాకెట్ల నుంచి బిల్ బోర్డుల వరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. తంబి మస్కట్ లు ఏర్పాట్లు చేసి ఆకర్షిస్తోంది. ఇక ఈ కార్యక్రమ ఓపెనింగ్ లో పాల్గొన్న రజనీకాంత్, ఏ ఆర్ రహమాన్ ఫొటోలను ప్రదర్శిస్తూ హంగామా చేస్తోంది. ఇక టెక్నాలజీ ద్వారా డిజిటలైజ్ అడ్వర్టయిజ్మెంట్ తో హోరెత్తిస్తోంది.
ఇక ఇప్పటికే ఈవెంట్ ను జనాల్లోకి తీసుకువెళ్లడానికి తమిళనాడు ప్రభుత్వంలోని ఓ కలెక్టర్.. కళాకారులతో కలిసి ఈ చెస్ క్రీడలను మనుషులతో ఎలా ఆడుతారో తెలిపేలా రూపొందించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖులు షేర్ చేసి.. మన ప్రాచీన కళల గొప్పతనాన్ని చాటిచెప్పారు. రూపాయి ఆదాయం రాకున్నా తమిళనాడు ప్రభుత్వం ఈ క్రీడల నిర్వహణ, ప్రచారాన్ని నిర్వహిస్తున్న తీరు చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరూ ముందుకు రానీ చెస్ క్రీడలను తమిళనాడు ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహించడం చూసి క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.