Telangana congress : కాంగ్రెస్ ను ఎవరో వచ్చి ముంచాల్సిన పనిలేదు. వాళ్లకు వాళ్లే ముంచుకుంటారు. ఔను ఇది నిజంగా నిజం.. తెలంగాణ ఇచ్చిన పార్టీ రెండు సార్లు అధికారానికి దూరమైతే ఎంత పకడ్బందీగా.. ఎంత కసిగా.. ఎంత ఐక్యంగా పనిచేసి వచ్చేసారి అధికారంలోకి రావాలి. కానీ ఆ సోయి ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతలకు ఉందా? అధికారంలోకి రావడానికి కొట్లాడాల్సింది పోయి.. ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో కలహించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి ఆధిపత్యం పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చిక్కి శల్యం అవుతోంది. వచ్చేసారి అధికారం దిశగా కాదు.. అసలు తెలంగాణలో మనుగడలోకే రాకుండా పోయే ప్రమాదంలో పడింది.

ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బతీస్తూ బీఆర్ఎస్, బీజేపీ విస్తరిస్తుంటే.. వాటిని తట్టుకొని నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం అంతర్గత కుమ్ములాటలతో కుదేలవుతోంది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్లు ఆదినుంచి జీరీ్ణించుకోవడం లేదు. అప్పటి నుంచే అసమ్మతి రాజేస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జిగా మాణిక్యం ఠాగూర్. ఆయనపైన కూడా కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పైగా భట్టి ఇంట్లో ఇటీవల కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడబలుక్కొని రేవంత్ రెడ్డి నియమించిన పీసీసీ పదవులపై తిరుగుబాటు చేశారు. రాజీనామాలకు కొందరు పాల్పడ్డారు.
కాంగ్రెస్ లో కల్లోలం సృష్టించిన ఈ పరిణామాలతో అధిష్టానం సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పంపింది. ఆయన వచ్చారు.. బుజ్జగించారు వెళ్లారు. అయినా అసమ్మతి చల్లారలేదు. కాంగ్రెస్ తిరుగుబాటు నేతలైన ఉత్తమ్, మధుయాష్కీ, రాజనర్సింహ, జగ్గారెడ్డి, భట్టి, మహేశ్వర్ రెడ్డి తదితర నేతలు ఠాగూర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ సాయంత్రమే ఠాగూర్ టీపీసీసీ గ్రూపుల నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశారు.
దీంతో అధిష్టానం ఇప్పటివరకూ తెలంగాణ ఇన్ ఛార్జ్ గా ఉన్న మాణిక్కం ఠాగూర్ ను గోవా కాంగ్రెస్ ఇన్ చార్జిగా నియమించింది. ఈయన తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని నివారించడంలో విఫలమయ్యారు. రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్టుగా ఉన్న మాణిక్యం ఠాగూర్ సీనియర్ల తిరుగుబాటును వ్యతిరేకించారు. వారి తీరును తప్పుపడుతూ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్గానికి ఠాగూర్ ఫుల్ సపోర్టుగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్లకు టార్గెట్ అయ్యారు. ఇప్పుడు వారిధాటికి పదవి పోగొట్టుకున్నారు.
ఈ మొత్తం వివాదంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల పంతమే నెగ్గింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియామకంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ రాజీనామా చేశారు. అధిష్టానం వెంటనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా మాణిక్ రావు థాక్రేను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
ఠాకూర్ రాజీనామాతో వైదొలగడంతో రేవంత్ రెడ్డి వర్గానికి పెద్ద దెబ్బ తగిలింది. ఇన్నాళ్లు ఠాకూర్, రేవంత్ కలిసి యువతకు పెద్దపీట వేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావించారు. కానీ సద్దుమణగక పోవడం సీనియర్ల తిరుగుబాటుతో ఠాకూర్ వైదొలిగారు. ఇక నెక్ట్స్ రేవంత్ రెడ్డినే మిగిలారు. ఈయన వైదొలుగుతారా? లేక కాంగ్రెస్ సీనియర్ల రాజకీయాలను తట్టుకొని పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తారా? రేవంత్ రెడ్డి అడుగులు ఎటువైపు పడుతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.