YS Jagan Vs Chandrababu : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగలి ఉంది. అధికార వైసీపీని గద్దె దించడానికి విపక్షాలు ఇప్పటి నుంచి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఐక్యంగా అధికార పార్టీని దెబ్బకొట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత విపక్ష నేత చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషిస్తున్నారు. జగన్ చుట్టూ తనతోపాటు లోకేశ్, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలను నలుదిక్కులా మోహరిస్తున్నాడు. చతుష్టయ బంధనం చేస్తున్నారు.
అందరి లక్ష్యం ఒక్కటే..
ప్రస్తుతం ఏపీలో విపక్ష నేతల అందరి లక్ష్యం ఒక్కటిగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించడం, జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దించడమే టార్గెట్‌గా ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను జగన్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపే పనిలో ఉన్నారు. బీజేపీని కూడా కలుపుకుని వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్లాన్ ప్రకారం నేతలు ప్రజల మధ్యకు వస్తున్నారు. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
అటు లోకేశ్ పాదయాత్ర..
జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఏపీ మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాయలసీమలో పాతయాత్ర పూర్తి చేసుకున్నారు. స్పందన కాస్త తక్కువగానే ఉన్నా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని జనం ముందు ఏకరువు పెడుతున్నారు.
ఇటు చంద్రబాబు సభలు..
మరోవైపు చంద్రబాబు కూడా జగన్ టార్గెట్‌గా వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తున్న తప్పులను ఏకరువు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సెమీ మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. చంద్రబాబు సభలకు మంచి స్పందనే వస్తోంది.
ఇప్పుడు వారాహి యాత్ర..
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర ప్రారంభించారు. అన్నవరం నుంచి జూన్ 14న యాత్ర మొదలైంది. ఈ యాత్ర లక్ష్యం వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ను చిత్తుగా ఓడించాలన్న సంకల్పంతోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల నాటికి రాష్ట్రం మొత్తం పర్యటించేలా ప్రత్యేక వాహనం తయారు చేయించుకుని దానికి వారాహి అని నామకరణం చేశారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం తిరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ యాత్రలో వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఎడ్డగట్టడమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నారు.
రంగంలోకి బీజేపీ..
ఇన్నాళ్లూ జగన్ సర్కార్ అవినీతి, వైఫల్యాలపై మౌనం వహించిన బీజేపీ కూడా తాజాగా రంగంలోకి దిగింది. ఇటీవల ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా వైసీపీ సర్కార్ అవినీతిని ఎండగట్టారు. నాలుగేళ్లలో భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, నిధుల మళ్లింపు, ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి అంటూ ఏకరువు పెట్టారు. అమిత్ షా వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు కలకలంగా మారాయి.
జగన్ ఒంటి పోరాటం..
ఒకవైపు విపక్షాలు ఏకమౌతుంటే.. సీఎం జగన్ మాత్రం ఒంటిరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. తాను బీజేపీని నమ్ముకోలేదని, తాను దత్త పుత్రుడిని నమ్ముకోలేదని, తనకు మీడియా అండ లేదని పేర్కొంటున్నారు. తాను నమ్ముకున్నది దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదమే అని సెంటిమెంటు రగిలిస్తున్నారు. ఇక బీజేపీ ఆరోపణలను కూడా వైసీపీ నేతలు తిప్పికొట్టారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒకవైపు ఉంటే.. జగన్ ఒక్కరే ఒకవైపు ఉన్నారు. ఎంత మంది కలిసినా..తాను సింగిల్ గానే ఫైట్ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.