Homeప్రత్యేకంChatGPT: పౌరోహిత్యం కూడా చేసేసిన చాట్ జీపీటీ... దేవుడా ఇంకా ఏమేం చేయబోతోందో!

ChatGPT: పౌరోహిత్యం కూడా చేసేసిన చాట్ జీపీటీ… దేవుడా ఇంకా ఏమేం చేయబోతోందో!

ChatGPT: కృత్రిమ మేథ మనుషుల జీవితాల్లోకి మరింత వేగంగా దూసుకు వస్తోంది. సమూల మార్పులకు కారణమవుతోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన చాట్ జిపిటి సరికొత్త సాంకేతిక ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. రాసే కవితల దగ్గర నుంచి చేసే పనుల వరకు ప్రతి ఒక్కటి దాని ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ కృత్రిమ మేథ వల్ల ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సాంకేతిక పరమైన ఉద్యోగాలు మాత్రమే కాకుండా వంశపారంపర్యమైన వృత్తుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. చదివేందుకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ త్వరలో ఇది నిజం కాబోతుంది. దీనికి సంబంధించిన ఘటన అమెరికాలోని కొలరాడో లో ఇటీవల జరిగింది.

అమెరికాలోని కొలరాడో ప్రాంతానికి చెందిన రీస్ వీంచ్ అనే యువతి, డీటన్ ట్రూయింట్ అనే యువకుడు ఒక డేటింగ్ యాప్ లో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. కొద్దిరోజులు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలో ఇలాంటి సంస్కృతి సర్వసాధారణం కాబట్టి వారిద్దరి కోరికను ఇరువైపులా కుటుంబ సభ్యులు సమ్మతించారు. ఒక మంచి రోజు చూసుకుని పెళ్లి వేడుక జరిపించాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి వేడుక విభిన్నంగా ఉండాలని ఇరువైపుల వారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా అమెరికా లాంటి ప్రాంతాల్లో జరిగేవన్నీ క్రిస్టియన్ వివాహాలే కాబట్టి మత గురువు చెప్పిన దాని ప్రకారం ఆ తంతు కొనసాగుతుంది. రొటీన్ గా కాకుండా ప్రస్తుత సాంకేతిక కాలానికి అనుగుణంగా పెళ్లి తంతు నిర్వహించాలని అటు వధువు, ఇటు వరుడి తరఫు వారు నిర్ణయించి చాట్ జిపిటిని రంగంలోకి దించారు.

రీస్ వీంచ్, డీటన్ ట్రూయింట్ ల వివాహాన్ని 1800 లో నిర్మించిన ఒక చారిత్రాత్మక చర్చి వేదికగా నిర్వహించారు.. అయితే మొదట ఈ వివాహ తంతును నిర్వహించేందుకు చాట్ జిపిటి ఒప్పుకోలేదు. దీంతో వధువు తండ్రి స్టీఫెన్ వీంచ్ పట్టుదలతో చాట్ జిపిటిని ఒప్పించాడు. ” నాకు కళ్ళు లేవు.. శరీరం లేదు. మీ పెళ్లిని నేను అధికారికంగా నిర్వహించలేను” అని చాట్ జిపిటి చెప్పినప్పుడు
స్టీఫెన్ వీంచ్ ఆలోచనలో పడ్డాడు. చివరికి పట్టుదలతో చాట్ జిపిటిని ఒప్పించి ఈ పెళ్లి తంతో నిర్వహించేలా చేశాడు.. ఈ వేడుక కోసం అతడు చాట్ జిపిటి స్క్రిప్టులో చాట్ బాట్ వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచాడు. ఆ తర్వాత చాట్ జిపిటి.. క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మొదట చాట్ జిపిటి నూతన వధూవరులిద్దరితో ప్రతిజ్ఞలు చేయించింది.. ఈ వివాహ వేడుకకు హాజరైన 30 మంది అతిథులకు వివాహం గొప్పతనాన్ని వివరించింది. చాట్ జిపిటి కి రూపం లేదు కనుక.. దాని వినిపించే ఆడియో బాక్స్ ను ఒక రోబోలాగా అలంకరించారు. అది వివాహ తంతుకు సంబంధించిన ప్రతిజ్ఞలు చెబుతుంటే వచ్చిన అతిధులు మొత్తం ఆశ్చర్యంగా చూశారు.. సుమారు గంటపాటు జరిగిన ఈ వివాహ తంతు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని మరింత సుఖవంతం చేస్తోంది. ఇదే సమయంలో సంప్రదాయాలను కూడా మట్టిలో కలిపేస్తోంది. ఇది ఎంతకు దారితీస్తుందో” అని నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Colorado wedding officiated by Chat GPT

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version