Chandrababu Arrest : చంద్రబాబు రిమాండ్.. వైసిపికి ప్లస్సా? మైనస్సా?

ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి ఇదొక సానుకూలమైన అంశం. చంద్రబాబు అరెస్ట్ అనేది ఎన్నికల ప్రచార అస్త్రంగా మారుతుందని వైసీపీ భావిస్తున్నా.. అంతర్గతంగా అంతులేని నష్టాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 11, 2023 1:02 pm
Follow us on

Chandrababu Arrest : రాజకీయాల్లో చర్యకు ప్రతి చర్య ఉంటుంది.. ఇది అందరికీ తెలిసిన ఫార్ములాయే. అయితే ఇప్పుడు చంద్రబాబు విషయంలో జగన్ సర్కార్ చేసింది కరెక్టా? కాదా? అన్న చర్చ నడుస్తోంది. వైసిపికి ఇది ఆనందం కలిగించే అంశం. తెలుగుదేశం పార్టీకి ఎలాగూ బాధ కలిగిస్తుంది. అయితే తటస్తులు, ఏ పార్టీకి చెందినవారు.. ఎలా ఆలోచిస్తారు అన్నదే ప్రధాన అంశం. సహజంగా ఇటువంటి దుందుడుకు చర్యలు నష్టం చేకూరుస్తాయి. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా వైసిపి బాధిత వర్గంగా నిలవడం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత నాలుగేళ్లుగా వైసిపి దూకుడు చర్యలను ఏపీ ప్రజలు భరించారు. తమకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో బేరీజు వేసుకొని కాస్త మౌనంగానే ఉండేవారు. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో మాత్రం భిన్నంగా స్పందించడం ప్రారంభించారు. అది ఎంతలా అంటే.. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నా.. g20 శిఖరాగ్ర సమావేశం భారతదేశమే ఆతిధ్యమిస్తున్నా ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు అరెస్టుపై కోర్టులో జరుగుతున్న వాదనలపై ప్రతి నిమిషం ఆరా తీయడం మాత్రం చేశారు. చాలామంది టీవీలకే అతుక్కుపోయారు. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ తప్పు కాదు కానీ.. అరెస్టు చేసే తీరును మాత్రం ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. చంద్రబాబును అనవసరంగా అరెస్టు చేశారని ఎక్కువమంది భావిస్తున్నారు.

చంద్రబాబుకు రిమాండ్ అంటేనే.. తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పొయ్యడమేనని వైసీపీ సీనియర్లలో కొంతమంది భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సానుభూతి అనేది ఒక్క జగన్ సొంతం కాదని.. అప్పట్లో కేసులతో ఇబ్బంది పెట్టారన్న కోణంలోనే జగన్ కు ఎక్కువమంది సానుభూతి చూపారు. ఆ సానుభూతి జగన్కు అభిమానాన్ని తెచ్చి పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరుగుతుందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఏడుపదుల వయసులో ఉన్న చంద్రబాబుకు అభిమానించే వారి కంటే.. వ్యతిరేకులే అధికం. కానీ ఈ వయసులో చంద్రబాబును వేధిస్తుండడంతో చాలామంది తటస్తులు సైతం పునరాలోచనలో పడ్డారు. గత నాలుగున్నర ఏళ్లుగా ప్రభుత్వం విధ్వంసాలకు పాల్పడుతున్నా భరించారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ చర్యలను బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుతో సామాన్య జనాలకు ఏం పని అని వైసిపి భావించింది. కానీ గత మూడు రోజులుగా ఏ ఇద్దరు కలుసుకున్నా చంద్రబాబు అరెస్ట్ పైన చర్చ నడిచింది. టిడిపి వారు వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని వైసిపి వారు చెబుతున్నారు. అంతవరకు ఓకే కానీ ఏ సంబంధం లేని వారు మాత్రం.. ఇటువంటి చర్యలను హర్షించరు. బాధిత పక్షం వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో జరుగుతోంది అదే. మరోవైపు మూలన ఉన్న టిడిపి శ్రేణులను రోడ్డు పైకి తెప్పించడానికి చంద్రబాబు అరెస్ట్ ఒక కారణమైంది. తమ అధినేతకు జరిగిన అన్యాయం పై వారు బాహటంగానే పోరాటానికి దిగుతున్నారు. ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి ఇదొక సానుకూలమైన అంశం. చంద్రబాబు అరెస్ట్ అనేది ఎన్నికల ప్రచార అస్త్రంగా మారుతుందని వైసీపీ భావిస్తున్నా.. అంతర్గతంగా అంతులేని నష్టాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.