Chandrababu : నగదు బదిలీ పథకం గుర్తుంది కదూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బలంగా వినిపించిన మాట ఇది. అంటే రేషన్, గ్యాస్ సరఫరా, విద్యుత్ చార్జీలు వంటి విషయంలో ప్రభుత్వ రాయితీ బదులు నగదు బదిలీ చేస్తామన్న ప్రతిపాదనలు వచ్చాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో కూడా నగదు బదిలీ పథకం గురించి ప్రస్తావించారు. నారా లోకేష్ ఈ మేనిఫెస్టో తయారీలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో యాక్టివ్ కాకపోయినప్పటికీ ఆయన చేసిన ప్రయత్నం అప్పట్లో అందర్నీ ఆకట్టుకుంది. టీడీపీ అధికారంలోకి వస్తే.. నగదు బదిలీ చేస్తామని కుప్పంలో ఇలా లబ్దిదాుల కార్డుల్ని కూడా పంచారు. కానీ ఆ నగదు బదిలీ హామీలకు టైమింగ్ మిస్సయింది. ఈ సారి మాత్రం టీడీపీ మేనిఫెస్టోకు నగదు బదిలీ పథకాన్ని అనుసంధానించనున్నారు.
టీడీపీ గతంలో సంక్షేమ పథకాలు అమలుచేసినా ఈ స్థాయిలో దుబారా చేసిన దాఖలాలు లేవు. చాలా రకాల పథకాలు అమలుచేశారు. చేతి వృత్తుల వారికి, నిరుద్యోగ యువతకు, వెనుకబడిన వర్గాల వారికి అమలుచేసి వారికి ఉపాధినిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత పథకాలను అడ్డూ అదుపు లేకుండా అమలుచేశారు. దీంతో చంద్రబాబు సైతం అంతకు మించి సంక్షేమ పథకాలు అమలుచేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అందుకే మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోను ప్రకటించారు.
అయితే టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపేస్తారని వైసీపీ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. సంక్షేమం విషయంలో చంద్రబాబు ఫెయిల్యూర్స్ ను చూపే ప్రయత్నం చేస్తోంది. గతంలో జరిగిన తప్పిదాలను గుర్తుచేస్తోంది. అయితే జగన్ ఇవ్వగా లేనిది… సంపద సృష్టించే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేరని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ లాజిక్ కూడా తేలిపోవడంతో మేనిఫెస్టో కాపీ అంటూ కొత్త విమర్శలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. తమ పథకాల లబ్దిదారులకు ముందుగానే ఎంపిక చేసి వారికి కార్డులు పంచబోతోంది.
వాస్తవానికి జగన్ ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. విపక్ష నేతగా ఉన్నప్పుడు దారిపొడవునా అన్నివర్గాల వారికి హామీలు మీద హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరచి కేవలం నవరత్నాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది కూడా ఉండని లబ్దిదారులతో పథకాలు లాగేస్తున్నారు.. చివరికి విదేశీ విద్యా దీవెన పథకానికి… బడుగు, బలహీనవర్గాల పెళ్లిళ్లకు ఇచ్చే సాయానికి కూడా ఊహించని షరతులు పెట్టి… లబ్దిదారుల్ని తగ్గించేశారు. అందుకే టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. అర్హుల పేరుతో ఎవర్నీ ఎలిమినేట్ చేయబోమని… నమ్మకం కలిగించేందుకు ముందుగానే కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. టీడీపీ తాజా నిర్ణయంతో వైసీపీ శ్రేణుల నోటీలో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.