AP Revenge Politics : ‘రోడ్డు’న పడ్డ ప్రతీకార రాజకీయం..

చంద్రబాబు ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డునపడింది. నాడు వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇదే గతి పట్టింది. అదే గతిని చంద్రబాబుకు పట్టించడంలో జగన్ విజయం సాధించారు.

Written By: NARESH, Updated On : September 9, 2023 8:05 pm

ap politics

Follow us on

AP Revenge Politics : కక్షలు, కార్పణ్యాలు.. ప్రతీకార రాజకీయాలు.. ఇప్పుడు ఇవే రాజకీయాలను శాసిస్తున్నాయి. తెలంగాణలో ఇవి కాల్పుల విరమణకు దారితీసినా.. ఏపీలో మాత్రం ఇప్పటికీ కొనసా…గుతూనే ఉన్నాయి. ఎందుకో కానీ జగన్ లోని ఆ పగ, ప్రతీకారం చల్లారలేదు. 16 నెలలు తనను జైలు పాలు చేసిన పార్టీని, వ్యక్తులను జగన్ పగబట్టాడు. ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అందుకే నాడు వైఎస్ఆర్ ఫ్యామిలీ రోడ్డున పడితే.. ఈరోజు అదే దుస్థితి చంద్రబాబు ఫ్యామిలీకి వచ్చిపడింది. సిట్ కార్యాలయం ముందు రోడ్డుమీద నారా లోకేష్ కూర్చొని నిరసన తెలిపిన తీరు చూశాక నాడు వైఎస్ఆర్ ఫ్యామిలీ రోడ్డుపై ఇలానే జగన్ జైలు పాలు అయినప్పుడు ఎదురుచూసిన ఫొటోను వైరల్ చేస్తున్నారు. చెల్లుకు చెల్లు అన్నట్టుగా రాజకీయం ఏపీలో తయారైందని చెప్పక తప్పదు.

-తెలంగాణలో ఇంతటి ప్రతీకారాలు లేవు..
తెలంగాణలో ఇంతటి పగ ప్రతీకారాలు లేవు. కాంగ్రెస్ తో కేసీఆర్ కు వైరం ఉన్నా కూడా కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ కాపాడుతూనే వస్తున్నాడు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత కాంగ్రెస్ నేతలు ఎందరికో అతడితో సంబంధాలు ఉన్నాయని తేలింది. కేసు, విచారణ చేస్తే అందరికీ లోపలికి పంపే ఛాన్స్ వచ్చినా సాటి నేతలను కేసీఆర్ వదిలేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి చూసిన చంద్రబాబును ‘ఓటుకు నోటు’లో ఇరికించినా కూడా కేసీఆర్ ఒకప్పటి తన గురువైన చంద్రబాబును గురుభక్తితోనే వదిలేశాడు. ఇక ఇటీవల బీజేపీతో వైరం పెట్టుకొని జాతీయ పార్టీ పెట్టి సవాల్ చేశాడు. కూతురు కవితను లిక్కర్ స్కాంలో బీజేపీ ఎంతో ఇరుకునపెట్టింది. జైలుకు పంపిస్తుందని అంతా ఆశించారు. కానీ ఏమైందో కానీ బీజేపీతో కేసీఆర్ కు కాల్పుల విరమణ జరిగింది. ఆ కేసులన్నీ పక్కకుపోయాయి. ఇప్పుడు రెండూ పక్షాలు తెలంగాణలో అసలు పోటీదారులుగానే లేకుండా పోయారు. బండి సంజయ్ మార్పు.. కిషన్ రెడ్డికి పగ్గాలు ఇలా తెలంగాణలో ప్రతీకార రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడింది. రెండు పార్టీలు సయోధ్య కూదుర్చుకున్నాయి.

-ఏపీలో పగ, ప్రతీకార జ్వాల..
వైఎస్ఆర్ ఉన్నప్పుడే చంద్రబాబుపై 27 విచారణ కమిషన్ లు వేశాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారితో చంద్రబాబు, రామోజీని ముప్పుతిప్పులు పెట్టారు. ఒక్క కేసులోనైనా జైలుకు పంపాలనుకున్నాడు. కానీ సాధ్యపడలేదు. ఒకప్పటి తన కాంగ్రెస్ సహచరుడు అని వైఎస్ఆర్ కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ వైఎస్ఆర్ మరణం తర్వాతనే అసలు కథ మొదలైంది. జగన్ ను జైలుకు పంపడంలో చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ ఆరోపిస్తుంటుంది. సోనియాతో కలిసి చంద్రబాబే ఈ కుట్ర పన్నారని అంటుంటారు. అది నిజమో కాదో కానీ.. జగన్ లో మాత్రం ఆ 16 నెలల జీవితం కరుడుగట్టిన నేతగా మార్చింది. పాదయాత్రతో సీఎం అయ్యేలా చేసింది. జగన్ తన పగను, ప్రతీకారాన్ని ఇప్పటికీ వదులుకోలేదని అర్థమైంది. ఇప్పటికే కాంగ్రెస్ ను ఏపీలో భూస్థాపితం చేసిన జగన్.. రెండో టార్గెట్ చంద్రబాబును పెట్టుకున్నాడు. మొదట అమరావతి ఇన్ సైడర్ కుంభకోణం బయటపెట్టాడు. అందులో బాబు చిక్కలేదు. తర్వాత ఫైబర్ గ్రిడ్, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బుక్ చేశాడు. కేంద్ర ఐటీశాఖ కూడా 118 కోట్ల కుంభకోణాన్ని చంద్రబాబుపై మోపింది. ఇదే సందు అనుకొని జగన్ అటాక్ చేస్తున్నాడు.

దీంతో చంద్రబాబు ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డునపడింది. నాడు వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇదే గతి పట్టింది. అదే గతిని చంద్రబాబుకు పట్టించడంలో జగన్ విజయం సాధించారు. కోర్టుల్లో ఏం తేలుతుందో కానీ.. ఇప్పుడు ఈ పగ, ప్రతీకార రాజకీయాలు మాత్రం ఏపీలో పతాకస్థాయికి చేరాయని చెప్పొచ్చు.

https://twitter.com/dpudhfm/status/1700347519224717788?s=20