Chandrababu – Modi : చంద్రబాబుకు మోడీ షాక్.. జగన్ మాటకే సై

చంద్రబాబు కంటే జగన్ కు మోడీ ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది పొత్తుల అంశంపై ప్రభావం చూపుతోందని కూడా భావిస్తున్నారు.

Written By: NARESH, Updated On : February 20, 2024 2:02 pm
Follow us on

Chandrababu – Modi : రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. టిడిపి ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసి పనులు ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. పాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. బిజెపి పరంగా మాత్రం అమరావతికి ఆ పార్టీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పరంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తుండడంతో రాజధాని అంశం హైలెట్ కానుంది. అయితే తాజాగా ఓ వ్యవహారంలో జగన్ మాటకే ప్రధాని మోదీ జై కొట్టినట్లు తెలుస్తోంది.

జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు ఇదే కూటమిలోకి బిజెపి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ లోకి టిడిపి ఎంట్రీ లాంఛనమేనని తెలుస్తోంది. దీంతో బీజేపీకి తెలుగుదేశం మిత్రపక్షంగా మారనుంది. అదే సమయంలో బిజెపితో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కీలక విషయాల్లో కేంద్ర ప్రభుత్వపరంగా జగన్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందుతున్నాయి. దీంతో ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం బ్యాలెన్సింగ్ గా వెళుతున్నట్లు తెలుస్తోంది. కానీ అమరావతి రాజధాని విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం ప్రశ్నించడం లేదు. సరిగ్గా తెలుగుదేశం పార్టీతో స్నేహం కుదురుతున్న సమయంలోనే అమరావతి నుంచి కీలక ప్రాజెక్టును విశాఖకు తరలించడం హాట్ టాపిక్ గా మారింది.

అమరావతి ప్రాంతాన్ని టిడిపి ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించారు. అమరావతిని రాజధానిగా గుర్తించిన కేంద్రం ఇక్కడ ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో చంద్రబాబు సర్కార్ 11 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఇంతలో వైసిపి అధికారంలోకి రావడం, మూడు రాజధానుల నిర్ణయం జరిగిపోయింది. దీంతో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు మరుగున పడింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట అదే ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖకు మార్చేందుకు ఆర్బిఐ సిద్ధపడింది. విశాఖలో తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం భూమి లేదా భవనాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా కలెక్టర్కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. 30 నుంచి 35 వేల చదరపు అడుగుల భవనాలను గుర్తించాలని సూచించింది. ఇప్పుడు ఆ భవనాల అన్వేషణలో అధికారులు బిజీగా ఉన్నారు.

సరిగ్గా ఎన్నికల ముంగిట ఆర్బిఐ తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ విస్మయం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేనిది ఆర్బిఐ ఈ నిర్ణయానికి రాదని.. ఈ లెక్కన ఇప్పటికీ జగన్ కు మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్డీఏలోకి ఎంట్రీ సమయంలో సహనానికి పరీక్షిస్తున్నారని.. చంద్రబాబు కంటే జగన్ కు మోడీ ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది పొత్తుల అంశంపై ప్రభావం చూపుతోందని కూడా భావిస్తున్నారు.