BYJU’s Raveendran: బైజూస్ అధినేత రవీంద్రన్ వైదొలగక తప్పదా?

బై జూస్ 2021 చివరిలో కోవిడ్ తీవ్రంగా ప్రబలినప్పటికీ దాని గరిష్ట విలువ 22 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పట్లో ఇది దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ గా నిలిచింది. ఈ కంపెనీ పెరుగుదల చూసి చాలామంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 2, 2024 11:58 am

BYJU's Raveendran

Follow us on

BYJU’s Raveendran: : ఎవరైనా రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు లాభం వచ్చిందనుకోండి. దాన్ని ఏమనాలి? దానికి అదృష్టం అని కాకుండా దానికి మరో పేరు పెట్టాలి. ఇలా తక్కువ పెట్టుబడి పెట్టి అంతకి వందల రెట్ల లాభాలు కళ్ళజూశాడు బైజూస్ రవీంద్రన్. ఎక్కడో కేరళలో పుట్టి.. అంలంచెలుగా ఎదిగి బైజూస్ అనే ఎడ్ టెక్ కంపెనీ స్థాపించి.. కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అంతటి కోవిడ్ టైంలో గొప్ప గొప్ప కంపెనీలు మొత్తం నేల చూపులు చూస్తుంటే.. బైజూస్ మాత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. అంతేకాదు భారీగా లాభాలు ఆర్జించింది. ఎంత ఎత్తుకైతే ఎదిగిందో.. ప్రస్తుతం అదే స్థాయిలో ఆ కంపెనీ పతనాన్ని చూస్తోంది. ఫలితంగా కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారంతా రవీంద్రన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గురువారం జరిగిన బైజూస్ సమావేశంలో జనరల్ అట్లాంటిక్, ప్రాసెస్ వెంచర్స్, పీక్_15, చాన్ జూకర్ బర్గ్ ఇన్సియేటివ్, ఇతర పెట్టుబడి సంస్థలు గురువారం ఒక నోటీసుపై సంతకం చేశాయి. ఇబ్బందుల్లో ఉన్న కంపెనీ బోర్డు పునర్నిర్మాణానికి ప్రతిపాదించాయి. అత్యవసర సాధారణ సమావేశానికి పిలుపునిచ్చాయి. “మొదట జూలైలో, తర్వాత డిసెంబర్లో ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్ రిక్విజిషన్ నోటీసు పై చర్య తీసుకోవడంలో కంపెనీ విఫలమైంది” అని బై జూస్ లో పెట్టుబడులు పెట్టిన ఓ కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ” కంపెనీలో పెట్టుబడులు పెట్టాం కాబట్టి వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ము ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్ నోటీసు జారీ చేస్తున్నామని” ఇన్వెస్టర్ కన్సార్టియం ఒక ప్రకటనలో తెలిపింది. “ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్ పరిగణలోకి తీసుకోవాల్సిన తీర్మానాలలో అత్యుత్తమ పాలన, ఆర్థిక పరమైన వ్యవహారాలు, సమస్యల పరిష్కారం, డైరెక్టర్ల బోర్డు పునర్నిర్మాణం, కంపెనీ నాయకత్వంలో మార్పు.. వంటి అంశాలను కచ్చితంగా చేర్చాలని” ఇన్వెస్టర్ కన్సార్టియం ఒక ప్రకటనలో వివరించింది.

బై జూస్ 2021 చివరిలో కోవిడ్ తీవ్రంగా ప్రబలినప్పటికీ దాని గరిష్ట విలువ 22 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పట్లో ఇది దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ గా నిలిచింది. ఈ కంపెనీ పెరుగుదల చూసి చాలామంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అప్పట్లో ఈ కంపెనీ విలువ అమాంతం పెరగడంతో ఇండియన్ మెన్స్ క్రికెట్ టీంకు స్పాన్సర్ గా వ్యవహరించింది. కోవిడ్ కాలంలో ఎంతో పెరుగుదలను నమోదు చేసిన బై జూస్.. కోవిడ్ అనంతరం తిరోగమనాన్ని నమోదు చేసింది. పాఠశాలలు పునః ప్రారంభం కావడం, కళాశాలలు తెరుచుకోవడంతో బైజూస్ కు డిమాండ్ తగ్గింది. దీంతో అప్పటిదాకా లాభాలు కళ్ళజూసిన కంపెనీ.. క్రమక్రమంగా నష్టాలు నమోదు చేయడం ప్రారంభించింది. ఒప్పందాలు కుదుర్చుకున్న విద్యాసంస్థలు తర్వాత వాటిని రద్దు చేసుకున్నాయి. దీంతో సహజంగానే బై జూస్ కంపెనీకి రాబడి తగ్గిపోయింది. ఇదే క్రమంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు పెరిగిపోయాయి. సంస్థ నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కంపెనీ సీఈఓ రవీంద్రన్ కార్పొరేట్ గవర్నెన్స్ ను పక్కదారి పట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో కంపెనీలో లుకలుకలు మొదలయ్యాయి. పెట్టుబడులు పెట్టిన వారంతా కంపెనీ యాజమాన్యాన్ని నిలదీయడం ప్రారంభమైంది. గత రెండు సంవత్సరాలుగా బై జూస్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. చేతిలో పెద్ద కాంట్రాక్టులు లేకపోవడం.. ఉన్న కాంట్రాక్టులు కూడా భారీ వి కాకపోవడంతో బైజూస్ భవితవ్యం పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్ కోసం గురువారం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. కంపెనీ తన ప్రస్తుత వాటా దారుల నుంచి 200 మిలియన్ డాలర్లు సేకరించాలని నిర్ణయించింది. అంతేకాదు ప్రస్తుత సమస్యల పరిష్కారానికి 225 నుంచి 250 మిలియన్ డాలర్ల పోస్ట్ మని వాల్యుయేషన్ ను అంచనా వేస్తోంది. ఒకవేళ నిధుల సేకరణ సజావుగా జరిగితే చెల్లించాల్సిన బకాయిలు 125 నుంచి 150 మిలియన్ డాలర్ల వరకు ఉంటాయని తెలుస్తోంది. ఇక గతంలో తీసుకొచ్చిన బకాయిలను చెల్లించకపోవడంతో అప్పులు ఇచ్చినవారు న్యాయ పోరాటం చేస్తుండడంతో.. కంపెనీ సాంకేతికంగా డిఫాల్ట్ అనే అపప్రదను మోస్తోంది. ఇక ఈ డిఫాల్ట్ కేసు కు సంబంధించి ఫిబ్రవరి 7న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ లో విచారణ జరగనుంది. అయితే ఇదే సమయంలో బైజూస్ తన బాండ్ హోల్డర్లతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా ఆధారిత ఎపిక్, సింగపూర్ ప్రధాన కార్యాలయం ఉన్న గ్రేట్ లెర్నింగ్ వంటి కొన్ని కీలక ఆస్తులను విక్రయించి డబ్బును సేకరించాలని ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 2021, మార్చి 2022 మధ్య కాలానికి తన ఏకీకృత ఆర్థిక వివరాలను బైజూస్ ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరంలో నష్టాలు 4,564 కోట్లు ఉంటే.. తర్వాత నష్టాలు 8,245 కోట్లకు పెరిగాయి. 22 ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత ఆదాయం 5,298.43 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇది 2,428.39 కోట్లుగా ఉండేది. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ వైదొలగాలని మెజారిటీ వాటాదారులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రవీంద్రన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో రవీంద్రన్ వైదొలగక తప్పదని కార్పొరేట్ నిపుణులు చెబుతున్నారు.