Budget 2024: నేడు మధ్యంతర బడ్జెట్.. నిర్మల లక్ష్యాలు ఇవే

ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి.. దీనిని ఆర్థిక పరిభాషలో మధ్యంతర బడ్జెట్ అంటారు. ఇది 3 నెలలు మాత్రమే ఉంటుంది. వచ్చే కొత్త ప్రభుత్వం జూలై నెలలో 2024_25 సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 1, 2024 10:14 am

Budget 2024

Follow us on

Budget 2024: మరి కొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతే.. అందులో దాదాపు నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఉత్సాహం బిజెపిలో అలా ఉండగానే.. రామ మందిర నిర్మాణం, రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట వంటివి జరగడంతో బిజెపికి తిరుగులేని మైలేజ్ లభించింది. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి మూడోసారి కూడా రావాలని భావిస్తోంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో .. అందరి కళ్ళూ నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టే బడ్జెట్ పైనే ఉన్నాయి. ప్రవేశ పెట్టేది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ ఈసారి నిర్మలా సీతారామన్ ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారోననేది ఆసక్తికరంగా మారింది.

ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి.. దీనిని ఆర్థిక పరిభాషలో మధ్యంతర బడ్జెట్ అంటారు. ఇది 3 నెలలు మాత్రమే ఉంటుంది. వచ్చే కొత్త ప్రభుత్వం జూలై నెలలో 2024_25 సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఎన్నికలకు ముందు నేపథ్యంలో నిర్మల ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. ప్రజలను ఆకట్టుకుంటుందా? లేకుంటే గత ఏడాది లాగానే సంస్కరణలకు పెద్దపీటవేస్తారా? అనే విషయాలపై చర్చ జరుగుతుంది. గత పది సంవత్సరాలుగా బిజెపికి అండగా ఉండుకుంటూ వస్తున్న రైతులు, శ్రామికులకు, సూక్ష్మ, మధ్య పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఏమైనా వరాలు ఇస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వేతన జీవులు ఎదురుచూస్తున్న పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. అల్ప, మధ్యతరగతి ఆదాయ వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా ప్రామాణిక తగ్గింపు పరిమితిని లక్షకు పెంచే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలుగా ఈ పరిమితి 50,000 గా ఉంది. వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి సవరణ చేపట్టలేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వేతన జీవులకు ప్రామాణిక తగ్గింపు పరిమితి లక్షకు పెంచి.. వారిని తమ వైపు తిప్పుకోవాలని నిర్మల భావిస్తున్నారు. ఇక ఈ ప్రామాణిక తగ్గింపు వల్ల వ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగులకు ప్రయోజనం జరుగుతుంది.

గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు కేంద్రం ఈ బడ్జెట్లో సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. వృద్ధిరేటు విషయంలో ఈ ప్రాంతాలు కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో కొనుగోలు శక్తి పెంచేందుకు కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. 2023 నవంబర్లో గ్రామీణ ప్రాంతాలలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విక్రయాలు 9.8% తగ్గాయి. గ్రామీణ ప్రజల ఆదాయం తగ్గిపోవడం.. అది కొనుగోలు శక్తి మీద ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో.. రిటైల్ ద్రవ్యోల్వణం పెరగడం.. వంటి కారణాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణుల కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయేతరదాయాన్ని పెంచుకునే విధంగా కేంద్రం గ్రామీణులకు తోడ్పాటు ఇచ్చే అవకాశం ఉంది. చిన్న, సన్నకారు రైతులకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహాత్మా గాంధీ ఉపాధి పథకాలకు ఈ దఫా బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని పథకాలు తీసుకొచ్చే యోచనలో నిర్మల ఉన్నట్టు సమాచారం.