Budget 2024: కేంద్ర బడ్జెట్‌పైనే తెలంగాణ ఆశలు.. నిర్మలమ్మ కరుణించేనా?

రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా.. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇప్పటికీ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి అయినా కేంద్రం బడ్జెట్‌లో పునర్విభజన చట్టం ప్రకారం కేటాయింపులు చేయాలని కోరుతోంది.

Written By: Raj Shekar, Updated On : February 1, 2024 10:05 am

Budget 2024

Follow us on

Budget 2024: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) పార్లమెంట్‌లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కొన్నేళ్లుగా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లుగానే ఇస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేంద్రంలో పెట్టుకున్న వైరమే కారణమని గతంలో బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసారి ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌పై రాష్ట్రం బోలెడు ఆశలు పెట్టుకుంది. తెలంగాణ అవసరాలకు తగినట్లుగా కేటాయింపులు చేయిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశతో ఉంది.

పునర్విభజన చట్టం ప్రకారం..
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా.. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇప్పటికీ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి అయినా కేంద్రం బడ్జెట్‌లో పునర్విభజన చట్టం ప్రకారం కేటాయింపులు చేయాలని కోరుతోంది. రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డుల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు మంజూరు చేస్తుందని ఆశాభావంతో ఉంది. సింగరేణి, ఐఐటీ హైదరాబాద్, మణుగూరు కోట భార జల కర్మాగారాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపుల చేయాలని రాష్ట్రం కోరుతోంది. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, నవోదయ, సైనిక్‌ స్కూళ్లు ఇవ్వాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతోంది. గ్యాస్‌ సిలిండర్, పెట్రోల్‌ ధరలూ తగ్గిస్తుందని ఆశిస్తోంది.

మౌలిక సదుపాయాలపై ఆశలు..
తెలంగాణలో బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రికి ఈసారి భారీగా నిధులు ఆశిస్తోంది. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఈసారి పెద్దపీట వేయాలని కోరుతోంది. కేంద్రం ఇస్తున్న జీఎస్టీ వాటా పెంచాలని రాష్ట్రం ప్రతిపాదన పంపింది. గత మూడు బడ్జెట్‌లలో రైల్వే ప్రాజెక్టులు పెద్దగా మంజూరు చేయలేదని, ఈసారి రైల్వే ప్రాజెక్టులు భారీగా కేటాయించే అవకాశం ఉందని ఆశిస్తోంది. మనోహరాబాద్‌ – కొత్తపల్లి లైన్, కాజీపేట వ్యాగన్‌ ఫ్యాక్టరీకి భారీగా నిధులు కేటాయింపులు ఉంటాయని భావిస్తోంది. కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడోలైన్‌కు కూడా ప్రాధాన్యం ఉంటుందని భావిస్తోంది. భద్రాచలం–కొవ్వూరు, రామగుండం – మణుగూరు ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఈసారి బడ్జెట్‌ నిధులు ఎక్కువగా ఇవ్వాలని కోరుతోంది.