
Demand for Girls : బెండకాయ ముదిరిపోతే కూరకు పనికిరాదు. బ్రహ్మచారి ముదిరిపోతే… దానికి పనికిరాడు.. వెనుకటి రోజుల్లో ఈ సామెత ఎందుకు చెప్పారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం అవుతోంది. చదువు, కెరియర్, ఉద్యోగం అంటూ యువత పెండ్లిని దూరం పెడుతోంది.. తీరా చేసుకుందామనుకున్న సమయానికి అమ్మాయి దొరకడం లేదు. ఫలితంగా 30 ఏళ్లు దాటినా నుదుటి మీద బాసికం, నెత్తి మీద జీలకర్ర బెల్లం పడటం లేదు.. దీనికి తోడు అమ్మాయిల కొరత కూడా ఎక్కువ కావడంతో పరిస్థితి నానాటికి అధ్వానంగా మారుతోంది. ఇక చూసి చూసి విసిగి వేసారి పోయి చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కన్యాదానం స్థానంలో కన్యాశుల్కం తెరపైకి వచ్చింది.. ఇది మనదేశంలో అక్కడక్కడ కాదు చైనాలోనూ ఇదే కొనసాగుతోంది.
పాపం చైనా
కన్యాశుల్కం! అప్పుడెప్పుడో 100-125 ఏళ్ల క్రితం మనదేశంలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని వరకట్నం ఆక్రమించింది. కానీ, చైనాలో మాత్రం ఇంకా కన్యాశుల్కం ఉంది. చైనా అనుసరించిన ‘ఒకే సంతానం’ విధానం కారణంగా చాలా మంది చైనీయులు తమకు పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిస్తే గర్భస్రావం చేయించేసుకునేవారు. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి అక్కడ కన్యాశుల్కాలు భారీగా పెరిగిపోయాయి. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మంచి ఉద్యోగం, సొంత ఇల్లు ఉన్నా సరిపోదు. అమ్మాయి తల్లిదండ్రులు అడిగినంత సొమ్ము చదివించుకోవాల్సిందే. దీంతో అబ్బాయిలు ‘సోలో బతుకే సో బెటరు’.. అంటూ బ్రహ్మచారుల్లా ఉండిపోతున్నారు.
పెళ్లిళ్లు తగ్గిపోవడంతో జననాల సంఖ్య కూడా తగ్గిపోవడం మొదలై ఆందోళనకరస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలతో కలత చెందిన చైనా సర్కారు.. ఈ కష్టాలన్నింటికీ కారణమైన కన్యాశుల్కాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనే నిర్ణయానికి వచ్చింది. అన్నట్టు చైనాలో కన్యాశుల్కాన్ని.. ‘కైలి’ అంటారు. అది కనిష్ఠంగా లక్ష యువాన్లు (దాదాపు రూ.11.7 లక్షలు). చైనాలో 75ు పెళ్లిళ్లు ఈ ‘కైలి’ లేనిదే కావు. ఈ నేపథ్యంలో చైనాలోని కేంద్ర హెబెయ్ ప్రావిన్సు ప్రభుత్వం ఈ కైలి ఆచారంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి సంకల్పించింది. కన్యాశుల్కం లేకుండా జరిగే పెళ్లిళ్లను అక్కడి అధికారులు ‘హెల్డీ మ్యారేజె స్’గా వ్యవహరిస్తున్నారు. అలాంటి పెళ్లి చేసుకున్నవారి పేర్లను.. వివాహాల నమోదు కార్యాలయం వద్ద గోడపై చెక్కుతున్నారు. అలాగే.. జియాంగ్సు ప్రావిన్స్‌లో అధికారులు ‘అందరికన్నా అందమైన అత్తగారు’ అనే ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు. అంటే.. కన్యాశుల్కం అడగని అత్తగారని అర్థం. అలాగే, జియాంగ్సీ స్థానిక అధికారులు.. మన దగ్గర నేత్రదాన ప్రతినల్లాగా.. అక్కడి యుక్తవయసు అమ్మాయిలందరితో ‘కన్యాశుల్కం మాకొద్దు’ అని రాసి ఉన్న పత్రాలపై సంతకాలు చేయిస్తున్నారు. జియాంగ్జీ రాజధానిలో బుధవారం (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) సందర్భంగా.. కన్యాశుల్కాలు కోరని అమ్మాయిలకు, ఇచ్చుకోలేని అబ్బాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది