
Usman Khawaja : ఆటలో నైపుణ్యం చాలా మందికి ఉంటుంది. కానీ అవకాశం కొంతమందికే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారే నిలబడతారు.. జట్టును నిలబెడతారు.. కానీ కొన్నిసార్లు ఆ అవకాశాలు ఇతరులకు కూడా వస్తాయి.. కానీ వాటిని వారు సద్వినియోగం చేసుకోలేరు. ఇలాంటి సమయంలో అర్హులు మరుగున పడిపోతారు.. ఆట ఆడే సత్తా ఉన్నా, భీకరమైన నైపుణ్యం ఉన్నా అలా మిగిలిపోతారు. బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన ఉస్మాన్ ఖవాజా నేపథ్యం కూడా అలాంటిదే.. ఏ భారత్ లో అయితే డ్రింక్స్ మోసి, అవకాశాల కోసం ఆశగా ఎదురు చూశాడో… నేడు అదే జట్టులో ఓపెనర్ గా మారి, సెంచరీ సాధించాడు. నాలుగో టెస్ట్ తొలి రోజు భారత బౌలర్ల పై ఆధిపత్యం ప్రదర్శించాడు.
వాస్తవానికి అహ్మదాబాద్ మైదానంలో భారత బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ వేశారు. ఆ బంతులను కాచుకుంటూ ఉస్మాన్ ఆడిన తీరు అమోఘం.. ముఖ్యంగా అశ్విన్, జడేజా వంటి బంతులను అతడు డిఫెన్స్ ఆడిన విధానం చూసి ముచ్చటేసింది.. అయితే ఆరంభంలోనే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ట్రావిస్ హెడ్ (32), తనకు దక్కిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. అయితే అతడి పార్ట్ నర్ గా వచ్చిన ఖవాజా మాత్రం (104) అహ్మదాబాద్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
చెత్త బంతులను బౌండరీల వైపు తరలించిన ఖవాజా, మిగతా బంతులని చాలా చక్కగా డిఫెన్స్ ఆడాడు.. లబుషేన్(3) విఫలమైనప్పటికీ, స్టీవ్ స్మిత్ (38), హ్యాండ్స్ కోంబ్ (17) తో చక్కటి భాగస్వామ్యాలు నెలకొలిపాడు. చివరిలో కామెరూన్ గ్రీన్(49 నాట్ అవుట్) వేగంగా ఆడుతుంటే, అతడికి చక్కని సహకారం అందించాడు.. డ్రింక్స్ మోసిన భారత గడ్డపై తొలి సెంచరీ సాధించి, ఆస్ట్రేలియా జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.