Modi PM: బీజేపీ తన రాజ్యాంగాన్ని తనే రాసుకుంది. అదేంటంటే 75 ఏళ్లు దాటిన బీజేపీ కురువృద్ధులను రాజకీయాల్లోంచి సాగనంపి లేదా రెస్ట్ ఇచ్చి యువకులకు అవకాశం ఇవ్వండం.. ఆ కోవలోనే బీజేపీ సీనియర్లు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, మేనకాగాంధీ లాంటి వాళ్లు ఎగిరిపోయారు. వెంకయ్య లాంటి వారికి ఉపరాష్ట్రపతి పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలను చేసేశారు. వాళ్ల రాజ్యాంగం వాళ్లది. కానీ దేశంలోనే కీలకమైన రెండు పదవులు ప్రధాని, హోంమంత్రులు ఒకే రాష్ట్రానికి చెందిన మోడీ, షాలు పంచుకోవడంపై ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. అయినా కూడా వాళ్లు లెక్కచేయలేదు. కీలక స్థానాల్లో ఉన్న వారు ఇటీవల కూడా కేంద్రమంత్రి వర్గ విస్తరణలో పాత వారికి మంగళపాడారు. రవిశంకర్, జవదేకర్ లాంటి మధ్యస్థ నేతలను సైతం మంత్రి పదవుల నుంచి తొలగించేశారు.

కరోనా వేళ వారి వైఫల్యాన్ని సాకుగా చూపి తీసేసారు. కరెక్టే. కానీ మొత్తం వర్గాన్ని చూసుకోవాల్సిన మోడీ షాలకు కూడా ఈ ఫెయిల్యూర్ లో భాగం ఉంది. వారు తప్పించుకొని కింది వారిని బలిచేయడమే విమర్శలకు తావిచ్చింది. మోడీ నిర్ణయాలు చేస్తే.. పనిచేస్తే ఈ మంత్రులు అడ్డుచెప్పే అవకాశాలే లేవు.కానీ వైఫల్యాలను మాత్రం వీరిపై నెట్టడమే బీజేపీ శ్రేణులు తట్టుకోలేకపోయాయి.
ఇప్పుడు మోడీ వయసు 70 ఏళ్లు దాటింది. 2024 వరకు మోడీ కూడా 75 ఏళ్లకు చేరుతారు. మరి మోడీని కూడా సాగనంపాలి.. రెస్ట్ ఇయ్యాలి. కానీ బీజేపీకి మోడీనే పెద్ద దిక్కు. ఆయన లేకుంటే పార్టీనే లేదు. ఒంటిచేత్తో దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే బీజేపీ తాజాగా సంచలన ప్రకటన చేసింది.
2024లోనూ మోడీనే మూడోసారి ప్రధాని కానున్నారని బీజేపీ సంచలన ప్రకటన చేసింది. యూపీలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అమిత్ షా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే సీఎంగా వేరే వ్యక్తిని నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రహోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. 2022లోనూ మరోసారి యోగి ఆదిత్యనాథే సీఎంగా బాధ్యతలు చేపడుతారని ప్రకటించారు.
ఈ క్రమంలోనే 2024లో మోడీ తప్పుకొని అమిత్ షాను ప్రధానిని చేస్తారన్న ప్రచారానికి తెరదించారు. 2024లోనూ మోడీనే మూడోసారి ప్రధాని కానున్నారని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. యూపీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు.
నిజానికి బీజేపీలో మోడీ లేకపోతే అంత హైప్ ఉన్న నేత లేరు. అమిత్ షా ఉన్నా ఆయనకు ప్రజల్లో అంత క్రేజ్ లేదు. మోడీ సామాన్యుడు, చాయ్ వాలా.. నిజాయితీపరుడన్న పేరు తెచ్చుకున్నాడు. పైగా పరిపాలన దక్షుడిగా పేరుపొందాడు. అందుకే మోడీని తప్పించే సాహసం బీజేపీ చేయబోదు.. చేయదు. ఆయన ఉన్నన్నీ నాళ్లు ప్రధానిగా ఉంటారు. ఆయన వైదొలిగితే తప్ప మరొకరు కూర్చోవడానికి లేదు. మరో దఫా బీజేపీ దేశంలో అధికారంలో ఉండొచ్చు. ఆ తర్వాత కష్టమే. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.