Homeఆంధ్రప్రదేశ్‌Menu For Modi: మోడీ విందులో తెలంగాణ రుచులు.. స్పెషల్ మెనూ.. వండిపెట్టేది ఎవరో తెలుసా?

Menu For Modi: మోడీ విందులో తెలంగాణ రుచులు.. స్పెషల్ మెనూ.. వండిపెట్టేది ఎవరో తెలుసా?

Menu For Modi: ఏడడుగులు నడిచిన వాడు మధ్యలోనే కాలం చేశాడు. మూడు నెలల బిడ్డను, కట్టుకున్న భార్యను అన్యాయం చేసి వెళ్లిపోయాడు. ఓవైపు భర్త మరణం, మరోవైపు పేదరికం, దీనికితోడు అత్తింటివారి వేధింపులు.. ఇలాంటి అనేకానేక ప్రతికూలతలను ఆమె తట్టుకుంది. ధైర్యంగా నిలబడింది. 15 రూపాయల కోసం కూలికి వెళ్లిన స్థాయి నుంచి నేడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన చేతి వంట రుచి చూపే స్థాయి వరకు ఎదిగింది. ఈ సుదీర్ఘ “వంట” ప్రయాణంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంది. ఇంతకీ ఎవరామే? దేశ ప్రధానికి వండి పెట్టే స్థాయికి ఎలా ఎదిగింది?

Menu For Modi
Modi, yadamma

మట్టి పెల్లలు కూలి భర్త చనిపోయాడు

ఇది 30 ఏళ్ల కిందటి ముచ్చట. హుస్నాబాద్ కు చెందిన యాదమ్మకు కొండాపూర్ కు చెందిన చంద్రయ్యతో చిన్నతనంలోనే వివాహం జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు. అప్పటికి ఆ బాబు వయసు మూడు నెలలు. బాలింత కావడంతో యాదమ్మ ఇంటి వద్దే ఉంటున్నది. చంద్రయ్య ఆరోజు బాయి తీసే పనికి వెళ్ళాడు. బావి లో పూడిక తీస్తుండగా మట్టి పెల్లలు కూలి అర్ధాంతరంగా కన్నుమూశాడు. దీంతో యాదమ్మ జీవితం తలకిందులైంది. కట్టుకున్న వాడు మట్టి పెల్లల కింద పడి కన్ను మూయడంతో కంటికి ధారగా విలపించింది. దీనికితోడు అత్తింటివారి వేధింపులు ఎక్కువవడంతో ఆ బాధ తట్టుకోలేక మూడు నెలల పసి బాలుడితో కరీంనగర్ చేరుకుంది.

Also Read: Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహన్ రంగా ఎవరు? ఆయనకు ఎందుకంత క్రేజ్ అంటే?

అక్కడ తెలిసిన వారి సాయంతో ఓ పాఠశాలలో ఆయాగా చేరింది. అప్పుడే కరీంనగర్ లోని సంపన్నుల ఇంట్లో వంట పని చేసేది. వంట బాగా చేస్తుంది అని పేరు రావడంతో వెంకన్న అనే వంట మాస్టర్ దగ్గర పనికి కుదిరింది. ఆయన రోజు 15 రూపాయలు కూలిగా ఇచ్చేవాడు. ఆయన దగ్గర తర్ఫీదు పొందిన తర్వాత కొంతమంది మహిళలతో బృందంగా ఏర్పడి సొంతంగా వంటలు చేయడం ప్రారంభించింది. మొదట్లో చిన్న చిన్న వేడుకలకు మాత్రమే వంటలు చేసేది. ఆ తర్వాత అంచలంచలుగా 20,000 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఈమె దగ్గర పని నేర్చుకున్న వాళ్లు కూడా సొంతంగా కేటరింగ్ చేస్తున్నారు. ఇక కాలేజీ పిల్లలకూ ఉపాధి కలిపిస్తోంది. ఫంక్షన్ల స్థాయిని బట్టి రోజుకు 500 నుంచి 2000 దాకా వారికి చెల్లిస్తోంది. ప్రస్తుతం యాదమ్మ 20,000 మంది వరకు కూడా వడ్డించి పెట్టగలదు. సీజన్లో ఆమెకు ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండదు. రోజువారి చెల్లింపులే 20,000 వరకు ఉంటాయంటే ఆమె ఎంత బిజీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఆమె పప్పులకు యమ డిమాండ్

యాదమ్మ శాకాహార, మాంసాహార వంటలను బాగా చేస్తుంది. ముఖ్యంగా గంగవాయిలి కూర పప్పు, మామిడికాయ పప్పు, పుంటి కూర పప్పు బాగా వండుతుంది. ఈ వంటకాలు బాగా చేస్తారని పేరు రావడంతోనే యాదమ్మకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వస్తున్న మోదీకి వండి పెట్టే అవకాశం కలిగింది. కేవలం శాఖాహార వంటలే కాకుండా మాంసాహార పచ్చళ్లను కూడా యాదమ్మ బాగా పెడుతుంది. అమెరికా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది.

Menu For Modi
Menu For Modi

బండి సంజయ్ చొరవతో

యాదమ్మ వంటలు కరీంనగర్లో బాగా ఫేమస్. ఆమె వంటతనాన్ని గుర్తించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అసలు సిసలైన తెలంగాణ రుచులను ప్రధానమంత్రి మోడీ, ఇతర అతిరథమహారధులకు చూపించాలని యాదమ్మకు వంట వండే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా గంగవాయిలి కూర పప్పు, పుంటి కూర పప్పు, మామిడికాయ పప్పు ను వండి ఏకంగా మోదీకి వడ్డించనున్నారు. తెలంగాణ బ్రాండ్ అయిన సర్వపిండి, సకినాలు, మడుగు బూలను ప్రత్యేకమైన మెనూ లో చేర్చారు. ఇక యాదమ్మ ఒక్కగానొక్క కొడుకు వెంకటేష్ ఎంబీఏ పూర్తి చేసి ఆమెకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం క్యాటరింగ్ ను మరింత విస్తరించే పనిలో ఉన్నాడు.

కృషితో నాస్తి దుర్భిక్షం

కట్టుకున్నవాడు కన్నుమూశాడని, అత్తింటి వారు వేధిస్తున్నారని యాదమ్మ వెనుకడుగు వేసి ఉంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీకి వడ్డించే అవకాశం కలిగేది కాదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంది. కన్నీళ్ళను పవిట కొంగుతో తీర్చుకుంది. తాను వెళ్ళే దారిలో రాళ్లు వేసినా పువ్వుల్లాగే మార్చుకుంది. నేడు ఎంతోమంది మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. అమ్మ ఉన్నచోట ఆకలి ఉండదంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న మోదీ కూడా ఆకలి పడకూడదని యాదమ్మ ఆయనకు మరో అమ్మ అయింది. మోదీ మాతృమూర్తి హీరా బెన్ లాగా వండి వార్చే బాధ్యత తలకు సారీ సారీ వంటకు ఎత్తుకుంది.

Also Read:Maharashtra Crisis: చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ రాజీనామా.. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular