Telangana BJP : మేం పోటీ చేయం.. ఎన్నికల ముంగిట బీజేపీ నేతలకు ఏమైంది?

ఇప్పు డు చేసే ఖర్చుకు తోడు.. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఖర్చు తప్పదనే భావనతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : October 26, 2023 8:54 pm
Follow us on

Telangana BJP : తెలంగాణలో బీజేపీ సీనియర్‌ నేతలు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు విముఖత చూపిస్తున్నట్టు సమాచారం. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే సంకేతాలు విన్పిస్తున్న నేపథ్యంలో లోక్‌ సభ ఎన్నికలకు టికెట్లివ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. అంతేకాదు.. తొలిజాబితాపై అసంతృప్తులు పెరుగుతుండడం, పార్టీలోంచి నిష్క్రమణలే తప్ప.. చేరికల్లేకపోవడం వంటి పరిణామాలు అధిష్ఠానానికి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.

కిషన్‌రెడ్డి బాటలోనే..
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అంబర్‌పేట నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. అయితే.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకే ఆయన మొగ్గుచూపుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన కూడా పలు సందర్భాల్లో ‘‘అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తా’’ అన్నారే తప్ప.. తాను పోటీలో ఉంటానని చెప్పలేదు. ఇప్పుడు చాలా మంది బీజేపీ సీనియర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనాసక్తి కనబరుస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓకే అంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపోటములను పక్కనపెడితే.. ఇప్పు డు చేసే ఖర్చుకు తోడు.. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఖర్చు తప్పదనే భావనతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉన్నా.. లోక్‌సభ పోల్స్‌ విషయంలో మాత్రం ప్రధాని మోదీ ప్రభతో.. బీజేపీ వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నట్లు పలు సందర్బాల్లో తేలడంతో.. సీనియర్లు అసెంబ్లీ బరిలో నిలిచేందుకు విముఖత వ్యక్తం చేయడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

బండి సంజయ్‌ కూడా..

నిజానికి బండి సంజయ్‌ కూడా లోక్‌సభకే మొగ్గుచూపి.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని భావించారు. అయితే.. తొలి జాబితాలో బండి సంజయ్‌ పేరును కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి ప్రతిపాదించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సీనియర్‌ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి కూడా తాము లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని చెబుతున్నారు. ఈ కారణంగా గద్వాల, మహబూబ్‌నగర్‌ స్థానా ల్లో అభ్యర్థుల ఖరారు పెండింగ్‌లో పడిందని స్పష్టమవుతోంది. ఇక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా శస్త్రచికిత్స కారణంగా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఐబీ సర్వే కూడా కారణమే

బీజేపీ అధినాయకత్వం ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)తో రాష్ట్రంలో సర్వేలు చేయించినట్లు సమాచారం. ఐబీ వర్గాలు హోంశాఖకు ఇచ్చిన నివేదికను అందజేయగా.. అందులో తెలంగాణలో బీజేపీకి రెండంకెల స్థానాలు రావడం కూడా కష్టమేనని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్‌ నేతలు అసెంబ్లీ బరిలోకి దిగేందు కు ఆసక్తిచూపడంలేదని తెలుస్తోంది. ఈ కారణాలతోనే బీజేపీ రెండో జాబితా ఆలస్యమవుతోందని స్పష్టమవుతోంది. నవంబరు 1 వరకు రెండో జాబితా రాదని కిషన్‌రెడ్డి స్వయంగా చెప్పడం గమనార్హం!

అన్యమనస్కంగా ప్రచారం!
పార్టీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రకాశ్‌ జావడేకర్‌ సూచనలను కూడా అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకోలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాం తో ఆయన అన్యమనస్కంగా పనిచేస్తున్నారని అంటున్నాయి. ఇక వేములవాడ నుంచి మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కుమారుడు వికా్‌సరావు, సంగారెడ్డిలో దేశ్‌పాండే, హుస్నాబాద్‌లో బొమ్మ శ్రీరామ్‌ పేర్లతోపాటు.. నారాయణ్‌ఖేడ్‌, పలు ఉత్తర తెలంగాణ నియోజకవర్గాల్లో బండి సంజయ్‌ సూచించిన పేర్లను బీజేపీ అధిష్ఠానం తొలిజాబితాలో పరిగణనలోకి తీసుకోలేదు. దీన్ని బండి సంజయ్‌ అవమానంగా భావిస్తున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్‌ సూచించిన బీసీ వర్గం నేతల పేర్లను కిషన్‌రెడ్డి, ఈటల కలిసి పక్కన పెట్టించారనే ప్రచారం సాగుతోంది.

చేరికల్లేవు?

బండి సంజయ్‌ని పక్కన పెట్టాక.. నిష్క్రమణలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి చంద్రశేఖర్‌, సీనియర్‌ నేతలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, సునీల్‌రెడ్డితోపాటు.. పలువురు నేతలు బీజేపీకి ‘రాంరాం’ చెప్పేశారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తన నిష్క్రమణపై స్పష్టతనివ్వగా.. ఆ బాటలోనే విజయ్‌శాంతి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.