Nadda Visit Telangana: టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ఎన్నికల ఎజెండాను ఖరారు చేయడం, పార్టీ కార్యకర్తలకు నాయకత్వం అన్ని సమయాల్లో అండగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని ఇవ్వడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో సాగుతున్న ‘ప్రజాసంగ్రామ యాత్ర’లో భాగంగా గురువారం నిర్వహించే పాలమూరు బహిరంగ సభ ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం తన వైఖరి స్పష్టం చేయనుందని సమాచారం.

-బీజేపీ భరోసా..
మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ‘ప్రజల గోస–బీజేపీ భరోసా’పేరిట రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, వారికి బీజేపీ ఎలా భరోసాగా నిలువనున్నదో నడ్డా వివరిస్తారని తెలుస్తోంది. ఇంతవరకు టీఆర్‌ఎస్–బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య ఒక స్థాయిలో సాగుతున్న విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పాలమూరు సభతో మరింత వేడెక్కవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: AP Financial Crisis : దివాలా దిశగా ఏపీ.. రూ.20వేల కోట్ల చెల్లించలేక చేతులెత్తేసిందే?
-ఎన్నికల వ్యూహ రచన…
తెలంగాణ శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓ నిర్దిష్ట ఎజెండా ఖరారుకు నడ్డా సభ దోహద పడుతుందని భావిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రేణులు సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిందిగా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని, ఆయా అంశాలను సోదాహరణంగా వివరించడం ద్వారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాల్సిందిగా కోరతారని పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్‌కు ప్రత్నామ్నాయం తామేననే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునివ్వనున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలతో పాటు హామీల అమల్లో తిరోగమనం, రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఆత్మహత్యల పర్వం కొనసాగడం, తదితర అంశాలను నడ్డా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, వేధింపులకు పాల్పడడం, ఖమ్మంలో సాయిగణేశ్ ఆత్మహత్య వంటివి ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రాష్ట్ర పార్టీకి, కార్యకర్తలకు జాతీయ నాయకత్వం పూర్తి అండదండలు అందిస్తుందని భరోసా కల్పించనున్నారు.
-మరింత దూకుడు..
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. నిరసనలు, పోరాటాలు, పాదయాత్రలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు రాష్ట్ర నాయకులు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దాడులను నిత్యం ఎడగడుతూనే ఉన్నారు. తాజాగా నడ్డా పర్యటన తర్వాత రాష్ట్రంలో పార్టీ దూకుడు మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ అధ్యక్షుడు కూడా పదాదికారుల సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని సమాచారం.

-అవినీతే ప్రచారస్త్రం..
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకోవాలని కాషాయ పార్టీ భావిస్తోంది. తర్వాత ప్రాధాన్యాలుగా కుటుంబ పాలన, 2018 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట కొనుగోళ్లు, నిరుద్యోగం, తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు, కార్యకర్తల వరకు టీఆర్‌ఎపార్టీ అవినీతిని ఎండగట్టే వ్యూహచరన చేయనున్నట్లు తెలిసింది. పోరాడే వారికి పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని నడ్డా భరోసా ఇవ్వనున్నారు.
-అంతర్గత సమస్యలకు చెక్..
పార్టీలో కొన్నాళ్లుగా అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఎవరూ బహిర్గతం కాకపోయినా.. సోషల్ మీడియా వేదికగా తమ అనుయాయులు, మద్దతు దారులతో ప్రచారం చేయించుకుంటున్నారు. అధికారంలోకి రాకముందే.. ముఖ్యమంత్రి పీఠంపైనా ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటివి కాషాయ పార్టీ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని రాష్ట్ర, జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అసంతృప్త నేతలను గాడిలో పెట్టే ప్రయత్నం నడ్డా చేయవచ్చని తెలుస్తోంది. ఈమేరకు అసంతృప్త నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతారని సమాచారం. ఇక్కడ వీలు కాని పక్షంలో అసంతృప్తులను, పార్టీ కోసం కష్టపడే వారిని ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడే అవకాశం ఉంది.
[…] […]
[…] […]