China Flag In Isro Ad: ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ఉద్యోగాల భర్తీలో కుంభకోణం, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం.. వీటన్నింటినీ కేంద్ర దర్యాప్తు సంస్థలు పసిగడితే.. కేసులు పెడితే..”చూశారా మమ్మల్ని తొక్కేస్తున్నారు. దక్షిణాదిపై ఉత్తరాది నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. హిందీ బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు. ద్రావిడ వాదాన్ని అణచాలని చూస్తున్నారని” గగ్గోలు పెడతాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కానీ తన కింద ఉన్న మరకలు మాత్రం చెప్పడు, చెప్పుకోలేడు. ఇక ఆయన కొడుకు ఉదయనిధి చేసే నెత్తి మాసిన విమర్శలకు ఇక లెక్కేలేదు. అలాంటి స్టాలిన్ ప్రభుత్వం మరో వివాదంలో ఇరుక్కుంది.
ఇటీవల తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.. తుత్తుకుడి జిల్లా కులశేఖర పట్నంలో ఇస్రో స్పేస్ పోర్టు నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ స్పేస్ పోర్ట్ ఏర్పాటు చేయించిన ఘనత తమదే అని చెప్పుకోవడానికి స్టాలిన్ ప్రభుత్వం నానా తంటాలు పడింది. గతంలో కేసీఆర్ ఇచ్చినట్టే అక్కడి పత్రికలకు అడ్డగోలుగా జాకెట్ యాడ్స్ ఇచ్చింది. ఈ యాడ్స్ లో జరిగిన ఓ తప్పిదం స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. చైనా జెండాతో కూడిన ఆ రాకెట్ ను ఆ ఆ ప్రకటనలో ఉంచడం తీవ్ర కలకలానికి దారి తీసింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో తయారుచేసిన ప్రకటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్రాల వెనుక ఉన్న ఇస్రో రాకెట్ చుట్టూ మన జాతీయ జెండాకు బదులుగా చైనా జాతీయ జెండాను ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇక ఈ ప్రకటనకు సంబంధించి వివాదం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రికి చైనాకు ఊడిగం చేయడం అంటే ఇష్టం కావచ్చని, అందుకే ఆ దేశపు జెండాను ఇస్రో రాకెట్ కు జత చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వివాదంపై స్పందించారు. తమిళనాడులోని అధికార డిఎంకె అన్ని హద్దులనూ దాటుతోందని ఆరోపించారు. ఇండియన్ రాకెట్ కు చైనా జెండా పెట్టడమేమిటని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదం నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడింది. ప్రకటనలో తప్పు ఎలా దొర్లిందో, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.