BJP alliances :ఎక్కడ తెలుగుదేశం పార్టీతో కలుస్తారా? కేసీఆర్ కు అస్త్రంగా మారుతారోనని అంతా భయపడ్డారు. ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసిన కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలకు గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ చిత్తైపోయింది. మరోసారి ఇప్పుడు గెలుపునకు అవకాశమున్న బీజేపీ అలాంటి తప్పే చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వర్తమానాలు అందాయో.. తత్వం బోధపడిందో కానీ.. వెంటనే తేరుకున్నారు.. తెలుగుదేశం పార్టీతో ఎక్కడా పొత్తు లేదని బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు..

ఎన్డీయేలోకి టీడీపీ వస్తోందని.. బీజేపీ మౌత్ పీస్ అయిన జాతీయ చానెల్ అయిన రిపబ్లిక్ టీవీ కథనాలు ప్రసారం చేయడంతో అందరూ అదే అనుకున్నారు. తెలుగుదేశంతో కలిస్తే ఏపీలో రాజ్యాధికారం పంచుకోవచ్చు కానీ.. తెలంగాణలో మాత్రం ఓటమి ఖాయం. ఎందుకంటే ఆంధ్రా బాబుతో జట్టుకట్టిన కాంగ్రెస్ ను గత ఎన్నికల్లో కేసీఆర్ ‘తెలంగాణ సెంటిమెంట్’ రగిల్చి ఈజీగా ఓడించారు. ఈసారి బీజేపీ కూడా అదే తప్పు చేస్తోందని.. కమలం పార్టీని ఓడించడం కేసీఆర్ కు ఈజీ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే.. ఈరోజు బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ హైదరాబాద్ లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏలోకి టీడీపీ రావడం అబద్ధమని.. తాము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం మాత్రమేనని.. ఏపీలో తమ పొత్తు కేవలం జనసేనతోనేనని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించారు. సీఎం జగన్ పట్ల ఏపీలో ప్రజా వ్యతిరేకత ఉందని.. జనసేనతో కలిసి తమకు అనుకూలంగా దాన్ని మలుచుకొని గెలుస్తామన్నారు. తెలంగాణలో తామే అధికారంలోకి రాబోతున్నామని.. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి అవకాశం ఉన్నది అధికారంలోకి రాబోతున్నదని తెలంగాణలోనేనన్నారు.
మొత్తంగా కమలనాథులు ముందుగా రిపబ్లిక్ టీవీ ద్వారా టీడీపీతో పొత్తు అని లీక్ చేసినట్టు ఉన్నారు. దాని స్పందనను తెలుసుకున్నారు. టీడీపీతో కలిస్తే ఏపీలో అధికారం దక్కినా.. తెలంగాణలో మటాష్ అని అందరి నుంచి అభిప్రాయాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ లాగానే బీజేపీ కూడా తెలంగాణలో కనుమరుగైపోతుందని ఆడిపోసుకున్నారు. రాంగ్ స్టెప్ అంటూ హెచ్చరించారు. దీంతో దెబ్బకు కుదురుకున్న బీజేపీ వెంటనే లక్ష్మణ్ చేత ప్రకటన ఇప్పించినట్టు తెలుస్తోంది.
ఇక మరో వాదన కూడా వినిపిస్తోంది. తెలుగుదేశంతో బీజేపీ పొత్తు అని టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేసిందని.. తెలంగాణలో దెబ్బకొట్టడానికి కేసీఆర్ వేసిన ఎత్తులో చిత్తు కాకుండా బీజేపీ సుదులాయించుకుందని వాదన వినిపిస్తోంది. ముందే తేరుకొని కేసీఆర్ జిత్తుల మారి ఎత్తులను బీజేపీ చిత్తు చేసిందని అంటున్నారు.
ఏది ఏమైనా ఎక్స్ పైరీ దాటిన తెలుగుదేశం పార్టీతో పొత్తును వద్దనుకొని బీజేపీ మంచి పనిచేసింది. ఇది ఆ పార్టీ మనుగడకు మంచిది. ఇది తెలంగాణలోనైనా.. ఏపీలోనైనా బలంగా ఉన్నప్పుడు బలహీనంగా కాకూడదని బీజేపీ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా తెలంగాణలో అధికారానికి బాటలు వేస్తుంది. ఏపీలో జనసేనతో అధికారం పంచుకోవడానికి దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.