Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో నిండిపోయింది. సిసింద్రీ టాస్క్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులకు చిన్న పిల్లలతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని బిగ్ బాస్ కోరాడు. దీంతో ఒక్కరొక్కరు తమ అనుభవాలను పంచుకున్నారు… కంటెస్టెంట్ల మాయని గాయాలను కళ్లకు కట్టింది. అందరినీ కంటతడి పెట్టించింది. ‘సిసింద్రీ’ టాస్క్ పేరిట గత మూడు నాలుగురోజులుగా చిన్న పిల్లల బొమ్మలను ఇచ్చి కంటెస్టెంట్లతో కెప్టెన్సీ టాస్క్ లు ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఈక్రమంలోనే నలుగురు గెలిచి ఇంటి కెప్టెన్ రేసులో నిలబడ్డారు.

సిసింద్రీ టాస్క్ ముగియడంతో ఆ బొమ్మలను స్టోర్ రూంలో పెట్టాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. మూడునాలుగు రోజులుగా అపురూపంగా చూసుకున్న బొమ్మలను ఇచ్చేస్తుంటే భావోద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు కంటెస్టెంట్. ఈ సందర్భంగా తమ జీవితంలో పిల్లలతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
మొట్టమొదట ఆదిరెడ్డి తన అనుభవాలు పంచుకున్నారు. తనకు పుట్టిన పాప తన చెల్లిలిలాగానే అంధురాలని భయపెట్టారని.. విజయవాడకు వెళ్లి మరీ టెస్ట్ చేయించుకున్నాక నా కూతురు చూపు సరిగా ఉందని నిర్ధారించుకున్నాక ఎంతో సంతోషించానని ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. 2013లో తన తల్లి ఉరివేసుకొని చనిపోయిందని.. అప్పుల బాధతో మరణించిందని.. 2018 వరకూ అష్టకష్టాలు పడ్డ తాను బాగుపడ్డానని కానీ ఇప్పుడు చూడడానికి తన తల్లి లేదని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. అప్పులున్నాయని ఆత్మహత్యలు చేసుకోవద్దని.. జీవితం మనకు ఛాన్స్ ఇస్తుందని.. అదృష్టం తలుపుతట్టి తానిప్పుడు బిగ్ బాస్ లో ఉన్నానంటే అదంతా అదృష్టమన్నారు.
2015లో తనకు థాయిరాడ్ ఎక్కువై పాప కడుపులోనే చనిపోయిందని.. ఇప్పటికీ పిల్లలు లేరని.. తన చెల్లెలు కూతురిని పెంచుకున్నామని..చివరకు చెల్లెలు తన కూతురును తీసుకొని వెళుతుంటే ప్రాణాలు పోయినంత పని అయ్యిందని కంటెస్టెంట్ సుదీప తన జీవితంలోని చేదు జ్ఞాపకాన్ని పంచుకుంది.
తను చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమకు దూరంగా ఉన్నానని.. చిన్నప్పుడే నాన్నచనిపోవడంతో అసలు నాన్న అని పిలవలేదని.. కానీ తన వైఫ్ ఇప్పుడు 7వ నెల అని.. పుట్టబోయే బిడ్డతో ఆ కోరిక తీర్చుకుంటానని సింగర్ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.
ఇక దత్తత తీసుకొని పెంచుకుంటున్న కూతురు కూడా చనిపోయిందని సీరియల్ నటి కీర్తి ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్ లోకి వచ్చేముందు తన పాప లేదు అని కాల్ వచ్చిందని.. చివరి నిమిషంలో కూడా తాను పాప దగ్గర లేకుండాపోయానని కీర్తి ఏడ్చేసింది. అటు తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయారని.. ఇటు దత్తత తీసుకున్న కూతురు చనిపోవడం తన జీవితంలో తట్టుకోలేని బాధ అని కీర్తి ఏడ్చేసింది.
ఇక హార్ట్ బీట్ లేని పాపను మూడో నెలలో డాక్టర్లు తీసేశారని.. అది తలుచుకొని తాము గుండె పగిలేలా ఏడ్చేమాని మెరినా-రోహిత్ ఏడ్చేశారు.
అగ్ని ప్రమాదంలో తన కళ్లముందే మా అమ్మ చనిపోయిందని.. గంటన్నర సేపు ఒక్కడినే గుండెలు పగిలేలా ఏడ్చానని.. అందుకే నాకు ఇద్దరు ఆడకూతుళ్లను ఇచ్చాడని.. వారిలో మా అమ్మను చూసుకుంటున్నానని చలాకీ చంటి ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు ఉన్నవాళ్లు అడుక్కుతినండని.. కానీ పిల్లలను మాత్రం రోడ్డుమీద వదిలేసి అనాథలను చేయవద్దని చంటి ఏడుస్తూనే పిలుపునిచ్చాడు..
ఆ తర్వాత ‘నాచో నాచో’ అంటూ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ కెప్టెన్సీ టాస్కులో చలాకీ చంటి, సూర్య, రాజశేఖర్,ఇనాయాలు పోటీపడ్డారు. ఇంటిసభ్యులందరినీ డ్యాన్స్ పోటీల్లో పాల్గొంటూ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను ఈ నలుగురిలోంచి కెప్టెన్ గా ఎన్నుకోవాలని సూచించాడు. ఇందులో ఎక్కువ ఓట్లు రాజశేఖర్ కు పడ్డాయి. కానీ చంటి, ఇనియా, సూర్యలు కలిసి రాజశేఖర్ నే ఏకగ్రీవంగా కెప్టెన్ చేద్దామని అనుకున్నారు. ఆటకు విరామం ఇవ్వడంతో రేపు ఇంటికి కొత్త కెప్టెన్ ఎవరు అవుతారన్నది తేలనుంది.
మొత్తంగా ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ ఎమోషనల్ గా సాగుతుందని అర్థమవుతోంది. కంటెస్టెంట్ ల కష్టాలు చూస్తే కళ్లు చమర్చడం ఖాయంగా కనిపిస్తోంది.