WPL 2024: భళా బెంగళూరు.. ఈ సాలా కప్ నమ్దే..

అనంతరం 114 పరుగుల విజయ లక్ష్యంతో బెంగళూరు జట్టు బరిలోకి దిగింది. కెప్టెన్ స్మృతి మందాన, సోఫీ డివైన్ ఓపెనర్లుగా దిగారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 49 పరుగులు జోడించారు. 32 పరుగులు చేసిన సోఫీ డివైన్ శిఖా పాండే బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఆ తర్వాత వన్ డౌన్ గా ఫెర్రీ మైదానంలోకి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 17, 2024 10:44 pm

Bengaluru win over Delhi in WPL 2024 final

Follow us on

WPL 2024 final : రెండవసారి ఫైనల్ వెళ్లినా ఢిల్లీ జట్టు రాతమారలేదు. అనూహ్యంగా ఫైనల్ వెళ్లిన బెంగళూరు జట్టు నిరాశతో వెనుతిరిగి రాలేదు. ఈ సాలా కప్ నమ్దే అన్నట్టుగా కప్ దక్కించుకుంది. తొలి సీజన్ లో పేలవమైన ఆట తీరు ప్రదర్శించిన స్మృతి మందాన సేన ఈసారి కప్ దక్కించుకొని బెంగళూరు జట్టు కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది.. దీంతో రెండవ సీజన్ విజేతగా బెంగళూరు జట్టు నిలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు.. తొలి వికెట్ వరకు ధాటిగా ఆడింది. ఏడు ఓవర్లలోనే 64 పరుగులు సాధించింది. ఢిల్లీ భారీగా పరుగులు సాధిస్తుందనుకుంటున్న తరుణంలో మొలి నెక్స్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో ఒక్కసారిగా ఢిల్లీ తడబడింది. ముఖ్యంగా ఏడవ ఓవర్ లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది..మొలి నెక్స్ బౌలింగ్ లో షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, క్యాప్సి అవుట్ కావడంతో ఢిల్లీ జట్టు కోలుకోలేని స్థితిలోకి చేరుకుంది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్స్ కూడా అవుట్ కావడంతో ఢిల్లీ మరింత కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన వారెవరూ బెంగళూరు బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. ఫలితంగా 18.3 ఓవర్లలో ఢిల్లీ జట్టు 113 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఒకానొక దశలో నాలుగు వికెట్లకు 74 పరుగులు చేసిన ఢిల్లీ జట్టు.. మిగతా 6 వికెట్లను 113 పరుగులకే కోల్పోవడం విశేషం. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక నాలుగు వికెట్లు తీసి సత్తా చాటింది. శోభన రెండు వికెట్లు పడగొట్టి ప్రతిభ చూపింది. ఢిల్లీ జట్టులో షఫాలీ వర్మ (44), లానింగ్స్(23) తప్ప మిగతా వారెవరూ రాణించలేదు. పైగా రోడ్రిగ్స్, క్యాప్సీ, తానీయా భాటియా వంటి వారు గోల్డెన్ డక్ గా వెనుతిరిగారు.

అనంతరం 114 పరుగుల విజయ లక్ష్యంతో బెంగళూరు జట్టు బరిలోకి దిగింది. కెప్టెన్ స్మృతి మందాన, సోఫీ డివైన్ ఓపెనర్లుగా దిగారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 49 పరుగులు జోడించారు. 32 పరుగులు చేసిన సోఫీ డివైన్ శిఖా పాండే బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఆ తర్వాత వన్ డౌన్ గా ఫెర్రీ మైదానంలోకి వచ్చింది. దూకుడుగా ఆడే ఫెర్రీ నిదానాన్ని నమ్ముకుంది. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూనే.. తనదైన డిఫెన్స్ ప్రదర్శించింది. స్మృతి, ఫెర్రీ రెండో వికెట్ కు 33 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ స్మృతి మందాన (31) మిన్ను మణి బౌలింగ్లో అరుంధతి రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. స్మృతి అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వికెట్ కీపర్ రీచా ఘోష్ బ్యాటింగ్ కు దిగింది. ధనాధన్ ఆటతో ఆకట్టుకుంది. ఫెర్రీ కూడా చివర్లో బౌండరీలు బాదింది. దీంతో బెంగళూరు జట్టు ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు జట్టులో కెప్టెన్ స్మృతి 31, సోఫీ డివైన్ 32, ఫెర్రీ 35 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మిన్ను మణి చెరో వికెట్ దక్కించుకున్నారు.