Bandi Sanjay One Man Show: 2023 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పావులు కదుపుతోంది. పక్కా ప్రణాళికతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీ క్రమంగా బలపడుతూ వస్తోంది. అధిష్టానం నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు ఫుల్ సపోర్ట్ లభిస్తుండటంతో టీఆర్ఎస్ కు ధీటుగా కాషాయ జెండా అన్నిచోట్లా రెపరెపలాడుతోంది.
బీజేపీలో తొలి నుంచి ఎంతో మంది హేమాహేమీలు ఉన్నా అధిష్టానం మాత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు అవకాశం కల్పించింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యాక బీజేపీ క్యాడర్లోనూ కొంత జోష్ వచ్చిన మాట నిజమే. అయితే ఆయనకు సీనియర్ల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదని తెలుస్తోంది.
ఈక్రమంలోనే బండి సంజయ్ తెలంగాణలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అన్ని జిల్లాల్లో తన అనుచరులకు పదవులను కట్టబడుతూ క్రమంగా పార్టీపై పట్టు పెంచుకుంటూ వస్తోంది. ఇదే సమయంలో తనతో కలిసి సీనియర్ నేతలకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనే టాక్ బీజేపీలో విన్పిస్తోంది.
బీజేపీలో వర్గపోరు నడుస్తున్నప్పటికీ బయటికి మాత్రం అంతా ఒక్కటే అన్నట్లు పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. గతంలో బండి సంజయ్ తెలంగాణలో తొలిసారి పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆయనకు సీనియర్లు మద్దతిచ్చి సహకరించారు. అయితే పలు సందర్భాల్లో బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పలువురు సీనియర్లు అసంతృప్తికి లోనయ్యారు.
బండి సంజయ్ తమ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్లు కినుకతో ఉన్నారు. దీంతో బండి సంజయ్ నేటి నుంచి చేపడుతున్న రెండో విడుత పాదయాత్రకు వారంతా దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌తో ఆయనకు సరిపడటం లేదని ప్రచారం జరుగుతోంది.
వీరంతా కూడా బండి సంజయ్ కు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే బండి సంజయ్ మాత్రం సీనియర్లు కలిసి వచ్చినా రాకున్న తెలంగాణలో వన్ మ్యాన్ షో చేసేందుకు రెడీ అవుతున్నారు. జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ రెండో విడుత పాదయాత్ర మొదలు కానుంది. దాదాపు 31రోజుల పాటు హ్మడి పాలమూరు జిల్లాలోనే పాదయాత్ర కొనసాగే అవకాశముంది.